October 4, 2018

ద్వారక యాత్రా విశేషాలు - Dwaraka Tour Details.... Day 6

Day 6

9/9/18 ఉదయాన్నే 6 గంటలకి వెళ్ళి కృష్ణుడిని దర్శించి, ఉదయ హారతిని చూసి, 8 గంటలకి బసకి చేరుకున్నాము.

ద్వారక చరిత్ర:-
ద్వారకానాథ్‌ ఆలయం 2000-2200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మునిమనుమడు వజ్రనాభుడు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం 5 అంతస్థులతో, 72 ముఖ్య స్థంభాలతో ఉంటుంది. గుడిపైన సూర్యచంద్రుల ఝoడా ఉంటుంది. ప్రతీరోజు ఆ ఝoడాను ఐదు సార్లు మారుస్తారు. ఆ ఝoడాను మార్చటం మేము ఉన్న రెండురోజులు చూసాము. గుడి గోపురం 78 మీటర్ల ఎత్తు ఉంటుంది. గుడికి రెండు ద్వారాలున్నాయి. మోక్ష ద్వారం, స్వర్గద్వారం. 

ఇది ప్రాచీనమైన నాలుగు ధామము(ద్వారక, బద్రీనాథ్‌, పూరి, రామేశ్వరము)లలో ఒకటి.

ప్రస్తుతం ద్వారకలో ఉండే దేవాలయాన్ని గతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలనా భవనంగా ఉపయోగించాడట. శ్రీకృష్ణుడు భేట్‌ ద్వారకలో సముద్రంలోగల గుట్టపై అష్టభార్యలతో నివాసం ఉండేవాడంట.

ద్వారకాధీశుని ప్రధాన ఆలయంచుట్టూ చాలా ఉపాలయాలు ఉన్నాయి. కృష్ణుని ఆలయం ఎదురుగానే దేవకీమాత ఆలయం ఉంది, ఆమె ప్రక్కనే రాధాకృష్ణ మందిరం ఉంది. ఇంకా అనిరుద్, ప్రద్యుమ్న, సత్యన్నారాయణ స్వామి, శ్రీకుశేశ్వరస్వామి, శ్రీ కశ్యపరాయ-విష్ణు, కాశీ విశ్వేశ్వరుడు, దత్తాత్రేయుడు, గాయత్రీమాత, లక్ష్మీదేవి, పురుషోత్తమరాయ్, దుర్వాసముని, అష్టపట్టపురాణుల మందిరాలు, సత్యభామ-జాంబవతి, శ్రీమాధవరాయ్ మందిరం, బలదేవ్ జీ, విట్టల్ జీ మొదలగునవి ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల వారి శారదా పీఠం, అందులో చంద్రమౌళీశ్వరుని ఆలయం ఉంది.

అల్పాహారాలు అయ్యాక 9 గంటలకి ద్వారక చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలని చూడటానికి మా బస్సు బయలుదేరింది.
                     ముందుగా రుక్మిణీ మందిరం చూసాము.


రుక్మిణీ మందిరం చరిత్ర:- 
శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవితో  కలిసి   గురువైన దుర్వాస మహర్షిని    తమ ఇంటికి  భోజనానికి  ఆహ్వానిస్తాడు. దుర్వాస ముని తాను ఎక్కిన రధాన్ని శ్రీకృష్ణుడు, రుక్మిణీ దేవులు స్వయంగా వారే వచ్చి, లాగి తీసుకువెళ్ళాలి అని కోరుతాడు. అంతట వారిరువురు రథాన్ని లాగుతుండగా కొద్ది దూరం వెళ్ళేసరికి  రుక్మిణీ దేవికి అలసట వచ్చి, దాహం వేయసాగింది. శ్రీకృష్ణునికి చెప్పగా శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలితో భూమిని తవ్వాడు. భూమిలోనుంచి  గంగమ్మ పైకి వచ్చింది. రుక్మిణి దేవి ఆ నీటితో తన దాహాన్ని తీర్చుకుంది. దుర్వాసుడు తనకి నీరు ఇవ్వకుండా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి నీరు ఇచ్చినందుకు  కోపం వచ్చి రుక్మిణీ దేవిని శ్రికృష్ణుడిని విడిపోమ్మని శపించాడు.  సముద్రపు  ఒడ్డున వున్నా రుక్మిణీ దేవి   ఆలయం చుట్టుపక్కల  మైదానమే  కనిపిస్తుంది. అంతే కాదు  గోమతి నదికి చుట్టుపక్కల 40 కి.మి. వరకు మంచి నీరు లభించదని. అంతా ఉప్పు నీరే అవ్వాలని  శపించాడట. అందుకే  గోమతి నది నీరు ఇక్కడ తియ్యగా కాకుండా ఉప్పగా ఉంటుందని అక్కడ పూజారులు ఈ కథని వివరించి మాకు చెప్పారు. ఈ కథకి సంబంధించిన ఫోటోలు ఆలయంలో ఉన్నాయి. కానీ మమ్మల్ని ఫోటోలు తీయనీయలేదు.
 
మనకి  ద్వారకలో శ్రీ కృష్ణ ఆలయం పక్కనే, అష్ట భార్యలు ఉన్న మందిరాలూ  కనిపిస్తాయి. కాని  వాటిల్లో  రుక్మిణీ దేవి మందిరం కనిపించదు.  రాధాకృష్ణుల మందిరం, మిగతా  దేవేరుల మందిరాలు ఒకే చోట  వున్నాయి.

తరవాత సముద్రం మధ్యలో నిర్మించబడిన శ్రీకృష్ణుని మందిరం చూడటానికి భేట్ ద్వారక వెళ్ళాము. ఈ భేట్ ద్వారక వెళ్ళాలంటే ఒడ్డున ఉన్న బోట్ ఎక్కి వెళ్ళాలి. సుమారుగా 15 - 20 నిముషాలు బోట్లో ప్రయాణించాక భేట్ ద్వారక చేరుకుంటాము.






(ఒక్కో బోట్లో సుమారుగా 100 నుండి 150 వరకు జనాలు ఎక్కుతున్నారు. మనిషికి 20 రూపాయలు తీసుకున్నారు. అంటే ఇది ఒకప్రక్క చార్జీ. రానూపోనూ 40 అయ్యింది..... ఎవరైనా వెళితే ఎంత అవుతుందో తెలియచేయటానికే చెప్పాను.)

ఆవలి ఒడ్డున పడవ దిగాక ఇలా వంతెన దాటి ఊరిలోకి వెళ్ళాలంటే సుమారుగా 1Km దూరం ఉంటుంది. కానీ మాకేమీ దూరం అనిపించలేదు. నడవగలిగే వారు నడిచెయ్యొచ్చును. నడవలేనివారు అక్కడ బల్ల బండీలు ఉన్నాయి. వాటి మీద కూర్చుని వెళ్ళొచ్చును.

                                భేట్ ద్వారక ప్రవేశద్వారం     


ప్రవేశద్వారం దాటగానే కౌంటర్ లో మొబైల్స్ & కెమారాలు ఇచ్చెయ్యాలి. అందుకే ఫోటోలు ఏమీ తియ్యటానికి కుదరలేదు.
 
ఇక్కడ కృష్ణ మందిరం, బలరామ మందిరం, కృష్ణుని అష్టభార్యల మందిరాలు ఉన్నాయంట. కానీ మేము వెళ్ళేసరికి 12 గంటలు అయ్యింది. 12.30 కే ఆలయం మూసేస్తారంట. అందుకే కృష్ణ మందిరం తప్పించి ఇంకేమీ చూసే అవకాశం కుదరలేదు. ఎవరైనా అన్నీ తిరిగి చూడాలి అంటే 9 గంటలకి అక్కడికి చేరుకుంటే ప్రశాంతంగా అన్నీ తిరిగి చూసి రావచ్చును. మాకు ఆవిషయం ముందుగా తెలియలేదు.
                           తరవాత గోపీతాలాబ్ చేరుకున్నాం. 


ఇక్కడ ఉన్న రాధాకృష్ణుల మందిరం దర్శించాము.






తాలాబ్ అంటే చెరువు. గోపితాలాబ్ అంటే కృష్ణుని చెరువు అని అర్థం. ఈ చెరువులో ఉన్న మట్టితోనే చందనం తయారుచేస్తారంట. అందుకే ఈ చందనాన్ని గోపీ చందనం అంటారు.
                          కృష్ణ భక్తులు ధరించే చందనం ఇదే 


ఇంతకీ ఈ తాలాబ్ లో నీరు లేదు. అంతా ఎండిపోయి ఉంది.

తరవాత నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాము.





నాగేశ్వర జ్యోతిర్లింగం చరిత్ర:- 
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది 10వ జ్యోతిర్లింగం.
దారుకఅనే పేరుగల ఒకానొక రాక్షసి పార్వతిదేవి వరదానము వలన ఆమె చాలా గర్వముతో ఉండేది. దారుకుడు అనే రాక్షసుడు ఆమె భర్త. అతడు అనేకమంది రాక్షసులను వెంటబెట్టుకొని మునులను, ప్రజలను  సంహరిస్తూ ఉండేవాడు. అతడు ప్రజల యజ్ఞములను, ధర్మాన్ని నాశనము చేస్తూ తిరుగుతూండేవాడు. పడమట సముద్రతీరాన్న ఒక వనము ఉండేది. దారుక తన భర్తతో కూడి ఇష్టము వచ్చినట్లు వనమునందు విహరిస్తూ.  అందరిని భయపెట్టుచుండెడిది. దారుకునిచే పీడితులైన ప్రజలు ఔర్వక మహర్షిని ఆశ్రయించి, ఆయనకు తమ దుఃఖమును తెలియచేసారు. ఔర్వుడు శరణు కోరి వచ్చినవారిని రక్షించుటకై ఆ రాక్షసులను ఈవిధంగా శపించాడు. - "ఈ రాక్షసులు భూమిమీదనున్న ప్రాణులను హింసించినా లేక యజ్ఞములను ధ్వంసము చేసినా తమ ప్రాణములను పోగొట్టుకొంటారు." అని. 

భూమండలం మీద ఎవరినీ ఏమీ చేయలేక ఆ వనమును ఉన్నదున్నట్లు తీసుకొనిపోయి సముద్రమునందు ఆ రాక్షసి నివసించెను. రాక్షసులు నీటిలో నిర్భయముగ నివసిస్తుండేవారు. ఓడలలో వర్తకానికై వచ్చే వారిని కొల్లగొడుతూ, వారిని చెరసాలలో వేసి హింసిస్తూ ఉండేవారు. 

ఆ రాక్షసులు ఒకసారి సుప్రియుడనే వైశ్య శివభక్తుని చెరసాలలో బంధించి హింసిస్తూ ఉండేవారు. సుప్రియుడు మహాశివభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టినంతటినీ ఒకచోట చేర్చి, దానిలో కొద్దిగా నీళ్లుపోసి, ఒక శివలింగాన్ని తయారు చేసుకుని, శివుణ్ణి పూజించసాగాడు. ఆ ఘటన చూసి దారుకుడు సుప్రియుడిని బెదిరించాడు, అయినా వినలేదు. ఇలా లాభం లేదని, శిరస్సుని ఖండించబోయాడు, అప్పుడు ఆ పార్థివలింగం నుంచి శివుడు ఒక జ్యోతి రూపంలో ప్రత్యక్షమై, ఆ రాక్షసుని తన త్రిశూలంతో ఒక్క దెబ్బకొట్టి, దుష్టులైన వాడి అనుచరగణాన్ని భస్మం చేశాడు. సుప్రియుని ప్రార్థన మేరకు మహాశివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు.  

ఆలయంలోనికి మొబైల్స్ & కెమారాలు తీసుకువెళ్ళొచ్చును, కానీ గర్భాలయంలో ఫోటోలు తీయటానికి అనుమతి లేదు.
                        గూగుల్ నుండి సేకరించిన ఫోటో ఇది.  


.అన్నీ తిరిగి బసకి చేరుకునేసరికి రాత్రి 7 గంటలు అయ్యింది. మాతో వచ్చిన మా Family Doctor అయిన Dr.Komaladevi గారి జన్మదినం ఆరోజు. టూర్ లో ఎవరివైనా పుట్టినరోజులు, పెళ్ళిరోజులు వంటి ప్రత్యేకమైన రోజులు ఉంటే..... టూర్ ఆర్గనైజర్ శారదా గారు వారే పార్టీ ఏర్పాటు చేస్తారంట. అదే విధంగా ఆరోజు శారదా గారే ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసి, కేక్ తెప్పించి, మా ఆంటీ చేత కట్ చేయించారు.

ఆరోజు ఆంటీ ఆనందానికి అవధులు లేవు. ఆమెకు 70 సంవత్సరాలు నిండి 71 వ సంవత్సరంలో అడుగుపెట్టిన రోజు. ఈ పుట్టినరోజు ద్వారకలో కృష్ణుని వద్ద జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని చాలా ఆనందాన్ని పొందారు. నా జీవితంలో మరుపురాని తియ్యని జ్ఞాపకం ఈరోజు అని అన్నారు.



8 గంటలకి కృష్ణయ్యని దర్శించుకొని, రాత్రి హారతి చూసుకొని, 9.30 కి మా రూమ్స్ కి చేరుకున్నాము. 

No comments:

Post a Comment