July 18, 2013

తొలి ఏకాదశి -- ప్రాశస్త్యం....

తొలి ఏకాదశి -- ప్రాశస్త్యం

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యమ్
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

ఆషాఢ శుద్ధ ఏకాదశిని ... తొలి ఏకాదశి అని అంటారు, దీనినే శయనైకాదశి అని కూడా అంటారు. ఈ రోజునుండి పండుగలు మొదలవుతాయి గనుక దీనిని తొలిఏకాదశి అని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి, భగవంతుణ్ణి భక్తితో పూజిస్తే, గోలోకప్రాప్తి లభిస్తుందట. 
విష్ణుమూర్తి పాలకడలిలో శేషపాన్పు పై, యోగనిద్రలోకి ప్రవేసించే రోజు ఈ రోజు. (యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అనేదానికి సూచన. దానివలన ప్రజలలో నిద్రాసమయం పెరుగుతుంది.) భగవానుడు దక్షిణవైపు తలపెట్టి, కుడిచేతిమీద పడుకుంటాడు. సూర్యచంద్రులు అతనికి రెండు నేత్రాలు. రెప్పలు మేఘాలు. శయనించుట అనగా సూర్యుని, చంద్రుని కన్నులుగా కలిగిన అతడు---- నిదురించుట అంటే రెప్పలు మూయుట అని అర్థము. అనగా ఆ రోజునుండీ మేఘములచే--సూర్యచంద్రులు కప్పబడతారు. నిజానికి భగవంతుడు నిద్రపోడు. యోగనిద్రలో ఉంటాడు. తిరిగి విష్ణుమూర్తి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. దీనినే క్షీరాబ్ది ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఈ నాలుగు నెలలు స్వామి అలసట తీర్చుకొనుటకు యోగనిద్రలోకి వెళ్ళి, భక్తుల పరిరక్షణా భారాన్ని, లోక సంరక్షణా భారాన్ని అమ్మవారికి అప్పగిస్తారు. అందుకే అమ్మవారికి ఈ నాలుగు నెలలు పూజలు ఎక్కువగా జరుగుతాయి. శ్రావణమాసంలో -- శ్రావణలక్ష్మీ రూపంలో, ఆశ్వీయుజ మాసంలో -- శక్తిరూపంలో అమ్మ అందరి పూజలను అందుకుంటుంది. "అమ్మా మా విన్నపాలను స్వామికి తెలుపమ్మా" అని అమ్మకి మన మొరలని తెలియచేసుకునే అవకాశం మనకు లభిస్తుంది.


సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశించటంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో సరైన సూర్యరశ్మి లేక, వర్షాభావం వలన, మానవులు అనేక వ్యాధులబారిన పడతారు. అందుకే మన పెద్దలు ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష, నోములు, వ్రతాలూ అని చెప్పి, ఉపవాసములు చెయ్యమని, ఆహరనియమాలను పాటించమని, ఆ ప్రకారం నడుచుకుంటే మనకు పుణ్యం లభిస్తుంది అని తెలియచేసారు.

వ్రతములలోకెల్ల శ్రేష్టమైనది ఏకాదశి వ్రతము. ఇది అన్ని సంప్రదాయముల వారు, అన్ని ఆశ్రమముల వారు తప్పనిసరిగా చేయవలసినది. ఏకాదశి నాడు భగవంతునికి పళ్ళూ -- పాలు నివేదన చేసి తీసుకోవచ్చును. ఉపవాసం అంటే --- "ఉప" అంటే "దగ్గరగా", "వాసం" అంటే "ఉండుట" --- అంటే..... భగవంతుని నామస్మరణ చేస్తూ, అతనికి దగ్గరగా ఉండటం అనేది ఉపవాసం యొక్క అర్థం. ఈ విధంగా ఏకాదశినాడు రోజంతా ఉపవాసం ఉండి, భక్తితో భగవంతుని పూజించి, రాత్రంతా జాగరణ చేసి, ద్వాదశినాడు తెల్లారక భగవంతునికి పూజలు చేసి, వండిన పదార్థాలను స్వామికి నైవేద్యం చేసి, మనం తీసుకోవాలి.

విష్ణువు నుండి వరం పొందిన పాప పురుషుడు అన్నంలో దాగి ఉంటాడు. బ్రహ్మ శ్వేద బిందువు క్రిందపడి, రాక్షసుడుగా అవతరించి--- నాకు నివాసము, ఆహారము ఏది అని అడగగా... ఏకాదశి నాడు ఎవరైతే అన్నాన్ని భుజిస్తారో, ఆ అన్నమే మీకు ఆహారంగా లభిస్తుంది... మీ పాప ఫలం వారు పొందుతారు---అని బ్రహ్మ వారికి వరమిచ్చెను. అందువల్ల ఆ రోజు మనం ఆహారాన్ని భుజిస్తే ఆ రాక్షసులు మన కడుపులో చేరి... సూక్ష్మ క్రిములుగా మారి, మనకి అనారోగ్యాన్ని కలిగిస్తారు.

సైన్స్ పరంగా కూడా 15 రోజులకు ఒకసారి కడుపు ఖాళీగా ఉంచుకుంటే అనారోగ్యం మన దరిచేరదు-- అని పెద్దలఉవాచ. ఉపవాసం ఉండుట వలన, కడుపులోని జీర్ణకోశాలు పరిశుద్ధమై, ఇంద్రియ నిగ్రహం కలిగించి, మనసుని శుద్ధి చేసి, శరీరాన్ని తేజోవంతం చేస్తుంది. ఉపవాసం ఉన్నవారు-- పేలాలు వేయించి, పొడి చేసుకొని, బెల్లం కలుపుకొని దేవునికి నైవేద్యం చేసి భుజిస్తారు. 
అందుకే ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలు చేబడతారు. ఈ దీక్ష చేపట్టిన వాళ్ళు పొలిమేర దాటకూడదు అనే నియమం ఉండుట వలన... వారు ఉన్న దగ్గరకే విద్యార్థులను రప్పించుకొని, విద్యాబోధనలు చేస్తారు. వారి ప్రవచనాల ద్వారా జ్ఞానాన్ని అందరికీ పంచుతారు. చాతుర్మాస వ్రతం ఆచరించేవారు, వ్రతం పూర్తి అయ్యేవరకూ నిమ్మకాయలు... అలసందలు... ముల్లంగి.... గుమ్మిడికాయ... చెరుకుగడలు మొదలగునవి వాడకూడదని శాస్త్రం చెప్పింది. మొదటి నెలలో కూరలు మాత్రమే తీసుకోవాలి, రెండవ నెలలో పెరుగూ, మూడవ నెలలో పాలు, నాల్గవ నెలలో ఆకుకూరలు అన్నంలో ఆధరువులు తీసుకోవాలి.


సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేయలేని వారు, ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా అన్ని ఏకాదశులు చేసిన ఫలితం లభిస్తుంది.
కృష్ణో రక్షతు నో జగత్త్రయగురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం ll


4 comments: