August 30, 2013

నారసింహ శతకం 1 నుండి 10 వరకు శ్లోకాలు

నారసింహ శతకం
1 నుండి 10 వరకు పద్యాలు

శేషప్ప కవి ప్రణితము
                                            1 నుండి 5 పద్యాలు వీడియో

1
శ్రీమనోహర ! సురా ర్చిత సింధుగంభీర !
భక్తవత్సల ! కోటి భానుతేజ !
కంజనేత్ర ! హిరణ్య కశ్యపాంతక ! శూర !
సాధురక్షణ ! శంఖ చక్రహస్త !
ప్రహ్లాద వరద ! పాపధ్వంస ! సర్వేశ !
క్షీరసాగరశాయి ! కృష్ణవర్ణ !
పక్షివాహన ! నీల భ్రమరకుంతలజాల |
పల్లవారుణపాద పద్మయుగళ !

చారుశ్రీచందనాగరు చర్చితాంగ !
కుందకుట్మలదంత ! వైకుంఠధామ !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
2
పద్మలోచన ! సీస పద్యముల్ నీ మీద
జెప్పబూనితినయ్య ! చిత్తగింపు
గణ యతి ప్రాస లక్షణము జూడగలేదు
పంచకావ్య శ్లోక పఠన లేదు
అమరకాండత్రయం  బరసి చూడగలేదు
శాస్త్రీయ గ్రంధముల్ చదువలేదు
నీ కటాక్షంబున నే రచించెద గాని
ప్రఙ్ఞ నాయది గాదు ప్రస్తుతింప

దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనె
చెఱకునకు వంకపోయిన చెడునె తీపు?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
3
నరసింహ ! నీ దివ్య నామమంత్రము చేత
దురితజాలము లన్ని దోలవచ్చు
నరసింహ ! నీ దివ్య నామమంత్రముచేత
బలువైన రోగముల్ పాపవచ్చు
నరసింహ ! నీ దివ్య నామమంత్రముచేత
రిపుసంఘముల సంహ రింపవచ్చు
నరసింహ !నీ దివ్య నామమంత్రముచేత
దండహస్తుని బంట్ల దరమవచ్చు

భళిర ! నే నీ మహామంత్ర బలముచేత
దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార !నరసింహ దురితదూర !
4
ఆదినారాయణా ! యనుచు నాలుకతోడ
బలుక నేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కార మర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండివారైనను
నిన్ను గాననివారి నే స్మరింప
మేము శ్రేష్ఠుల మంచు మిదుకుచుంచెడివారి
చెంత జేరగనోను శేషశయన

పరమ సాత్వికులైన నీ భక్తవరుల
దాసులకు దాసుడను జుమీ ధాత్రిలోన
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార !నరసింహ దురితదూర !
5
ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు
ద్రవ్య మిమ్మని వెంట దగులలేదు
కనక మిమ్మని చాల గష్టపెట్టగలేదు
పల్ల కిమ్మని నోట బలకలేదు
సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు
భూము లిమ్మని పేరు పొగడలేదు
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు
పసుల నిమ్మని పట్టు పట్టలేదు

నేను గోరిన దొక్కటే నీలవర్ణ
చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార !నరసింహ దురితదూర !
6 నుండి 10 వరకు పద్యాలు వీడియో

6                               
మందుండనని నన్ను నింద చేసిననేమి?
నా దీనతను జూచి నవ్వ నేమి?
దూరభావములేక తూలనాడిన నేమి?
ప్రీతిసేయక వంక బెట్ట నేమి?
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?
తీవ్రకోపముచేత దిట్ట నేమి?
హెచ్చుమాటలచేత నెమ్మె లాడిన నేమి?
చేరి దాపట గేలి చేయనేమి?

కల్పవృక్షంబువలె నీవు గల్గ నింక
బ్రజల లక్ష్యంబు నాకేల? పద్మనాభ !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార !నరసింహ దురితదూర !
7
చిత్తశుద్ధిగ నీకు సేవజేసెదగాని
పుడమిలో జనుల మెప్పులకు గాదు
జన్మపావనతకై స్మరణజేసెద గాని
సరివారిలో బ్రతిష్థలకు గాదు
ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని
దండిభాగ్యము నిమిత్తంబు గాదు
నిన్ను బొగడగ విద్య నేర్చితినేకాని
కుక్షినిండెడు కూటి కొఱకు గాదు

పారమార్థికమునకు నే బాటుపడితి
గీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార !నరసింహ దురితదూర !
8
శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ
లేశ మానందంబు లేనివాడు
పుణ్యవంతులు నిన్ను బూజసేయగ జూచి
భావమందుత్సాహ పడనివాడు
భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ
దత్పరత్వములేక తలగువాడు
తనచిత్తమందు నీధ్యాన మెన్నడు లేక
కాలమంతయు వృధా గడపువాడు

వసుధలోనెల్ల వ్యర్ధుండు వాడె యగును
మఱియు జెడుగాక యెప్పుడు మమతనొంది
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార !నరసింహ దురితదూర !
9
గౌతమీస్నానాన గడతేఱుద మటన్న
మొనసి చన్నీళ్లలో మునుగలేను
తీర్థయాత్రలచే గృతార్థు డౌదమటన్న
బడలి నేమంబు లేనడపలేను
దానధర్మముల సద్గతిని జెందుదమన్న
ఘనముగా నాయొద్ద ధనములేదు
తపమాచరించి సార్ధకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు నిలుపలేను

కష్టములకోర్వ నాచేత గాదు నిన్ను
స్మరణచేసెద నా యధాశక్తి కొలది
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార !నరసింహ దురితదూర !
10
అర్థివాండ్రకు నీక హాని జేయుట కంటె
దెంపుతో వసనాభి దినుట మేలు
ఆడుబిడ్డలసొమ్ములపహరించుట కంటె
బండ గట్టుక నూతబడుట మేలు
పరులకాంతల బట్టిబల్మి గూడుట కంటె
బడబాగ్ని కీలల బడుట మేలు
బ్రతుకజాలక దొంగ పనులు చేయుట కంటె
గొంగుతో ముష్టెత్తు కొనుట మేలు

జలజదళనేత్ర నీ భక్త జనులతోడి
జగడమాడెడు పనికంటె జావు మేలు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార !నరసింహ దురితదూర !


No comments:

Post a Comment