October 17, 2014

భజగోవిందం

భజగోవిందం(మోహ ముద్గరం) శ్లోకాలు






శ్రీ జగద్గురు శంకరాచారులవారు ప్రస్థాన త్రయాలకు భాష్యం వ్రాసి అద్వైతమతానికి ఒక వ్యవస్థను కల్పించారు. ఆచార్యులవారు జ్ఞానయోగానికి ప్రాధాన్యమిచ్చి "జ్ఞానమే మోక్ష సాధనం"  అనినా, భక్తిని కూడా ఆదరించారు. భక్తిని పరంపరా సాధనగా తెలిపారు. కనుక వారు భక్తిపరంగా అనేక స్తోత్రాలను కూడా రచించారు. 

ఆచార్యులవారు ఒకనాడు కాశీలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యచకితులై, ఆ వృద్ధుని హెచ్చరిస్తూ "ఓ మూఢమతి ! కాటికి కాళ్ళు చాచిన నీకు మరణ సమయంలో ఈ వ్యాకరణ సూత్రాలు ముక్తిని కలుగజేయలేవు. ఈ అవసాన దశలో దీన్ని వదలి గోవిందుని(భగవంతుని) భజించవయ్యా !" అంటూ "భజగోవిందం, భజగోవిందం గోవిందం భజ మూఢమతే!" అనే మకుటంతో హెచ్చరించారు. "మోహ ముద్గరం" అని ఈ శ్లోకాలు ప్రసిద్ధి చెందాయి. జగత్తుయొక్క నశ్వరత్వాన్ని తెలుపుతూ అవసరమొచ్చినప్పుడు నీవు 'నావి' అని కౌగలించుకొనుచున్న ధనం, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మరణ సమయంలో నీ వెంటరావు. నిన్ను ఉద్ధరించవు. భగవంతుడు ఒక్కడే సత్యము, నిత్యము. అందుచేత అతణ్ణి భజించు ! అంటూ వివరిస్తూ ఈ శ్లోకాల రచన చేసారు. ఈ రచన లోకంలో బహుళ ప్రచారాన్ని పొందింది. ఇందు ఆచార్యులవారు కొన్ని రచిస్తే, వారి శిష్యులు మరికొన్ని రచించారు.                           


1వ శ్లోకం 
భజగోవిన్దం భజగోవిన్దం 
గోవిన్దం భజమూఢమతే|
సంప్రాప్తే సన్నిహితే కాలే
న హి న హి రక్షతి డుకృఞ్ కరణే|| 

భావం:-
ఓయీ వృద్ధుడా ! మరణకాలము సమీపించగా నీవు వల్లించు " డుకృఞ్ కరణే " అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షింపజాలదు. కావున గోవిందుని మరల మరల భజించుము. బుద్ధిమంతుడవై మెలగుము.    



2వ శ్లోకం 
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||

భావం:-
ధనమును సంపాదించుట అను ఆశను వదులుము. ఆశారహితముగా సద్బుద్ధిని మనంబున కలుగజేసుకొనుము. నీ పూర్వకర్మ ఫలితముగా ఎంత ధనము నీకు లభించునో దానితోనే తృప్తిపొంది ఉండుము. అజ్ఞామును పారద్రోలుము. 


     
3వ శ్లోకం 
నారీస్తనభర నాభీదేశం 
దృష్ట్వా మాగామోహావేశం |
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||

భావం:-
స్త్రీలయొక్క స్థనములను, నాభి ప్రదేశమును చూచి మోహమును పొందకుము. అవి మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల యొక్క వికార రూపములే అని మనస్సునందు మాటిమాటికినీ చింతన చేయుము.


     
4వ శ్లోకం 
నలినీదళగత జలమతి తరళం 
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||

భావం:-
తామరాకుపై పడిన నీరు ఎట్లు చపలముగ ఉండునో, అట్లే ప్రాణికోట్ల యొక్క జీవితము మహాచపలమైనది. ప్రపంచమున జనులు రోగములు, అభిమానము మున్నగువానితో కూడినవారై దుఃఖముతో  సతమతమగుచున్నారు.    


   
5వ శ్లోకం 
యావద్విత్తోపార్జన సక్తః 
తావన్నిజ పరివారో రక్తః|
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే||

భావం:-
మానవుడు ఎంతవరకు ధనమును సంపాదింప కలిగియుండునో, అంతవరకు అతని కుటుంబమువారు, బంధువులు అతనిపై ప్రేమ కలిగియుందురు.  


  
6వ శ్లోకం 
యావత్పవనో నివసతి దేహే 
తావత్పృచ్ఛతి కుశలం గేహే|
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే||

భావం:-
ఎంతవరకు దేహమందు ప్రాణవాయువు ఉండునో, అంతవరకు అందరునూ అతని క్షేమసమాచారములను గూర్చి ప్రశ్నించుచుందురు. ఆ కొంచెము ప్రాణము పోయినప్పుడు ఆ మృతదేహమును చూసి భార్య కూడా భయపడును. అతని దగ్గరకు ఎవ్వరునూ చేరరు. 


    
7వ శ్లోకం 
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తి తతః సుఖ లేశః సత్యమ్ |
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః || 

భావం:-
ధనము అనర్థమును కలుగజేయుననియూ, ఆధ్యాత్మిక ప్రయోజనము లేనిదనియు, ఎల్లప్పుడూ భావించుము. ఆ ధనము వలన కొంచమైననూ పారమార్థిక సుఖము లేదు. ఈ విషయము ముమ్మాటికిని సత్యము. ధనవంతులకు తమ పుత్రులవలన కూడా భయము కలుగుచుండును. ఈ పధ్ధతి లోకమందు అంతటను ఒకే విధముగా ఉన్నది. 



8వ శ్లోకం 
బాల స్తావత్క్రీడాసక్తః 
తరుణ స్తావ త్తరుణీసక్తః|
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కోపిన సక్తః||

భావం:-
మనుజునకు బాల్యకాలము ఆటలయందు గడిచిపోవుచున్నది. యౌవ్వనము వనితాది విషయముల యందు గడుచుచున్నది. వార్ధక్యము అనేక చింతలతో గడిచిపోవుచున్నది. ఇక పరబ్రహ్మమునందు ఆసక్తి కలవాడు ఎవ్వరునూ లేరు.(అట్టివారు అరుదు అని భావం)    


   
9వ శ్లోకం 
కా తే కాంతా కస్తే పుత్రః 
సంసారో యమతీవ విచిత్రః|
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః||

భావం:-
నీ భార్య ఎవరు ? కొడుకు ఎవరు ? వారికీ నీకు ఏమి సంబంధము ? ఈ సంసారము చాలా విచిత్రముగా ఉన్నది. సోదరా ! నీవు ఎవరివాడవు ? ఎచట నుండి వచ్చినావు ? దీని తత్వమును బాగా విచారించి తెలుసుకొనుము.   


10వ శ్లోకం 
సత్సంగత్వే నిః సఙ్గత్వం 
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం|
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః||

భావం:-
సజ్జన సాంగత్యముచే సంసారమందు నిస్సంగత్వము కలుగును. నిస్సంగత్వముచే మోహము(అజ్ఞానము) అంతరించును. మోహము అంతరించుటచే ఆత్మ తత్వమందు నిలకడ కలుగును. అట్టి నిశ్చల తత్వముచే జీవన్ముక్తి లభించును.        

11వ శ్లోకం 
వయసి గతే కః కామవికారః 
శుష్కే నీరే కః కాసారః|
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్త్వే కః సంసారః||

భావం:-
యౌవ్వనము గడిచిన పిమ్మట కామవికారమెచట ? నీరు ఎండిపోవ ఇక చెరువు ఎచట ? ధనము తగ్గిపోగా ఇక పరిజనమెచట ? తత్వజ్ఞానము కలిగిన పిమ్మట(ఆత్మ తత్వము తెలిసికొనిన మీదట) ఇక సంసారబంధ మెచట ?(అవి ఉండవని భావము)    

12వ శ్లోకం 
మా కురు ధన జన యౌవన గర్వం 
హరతి నిమేషాత్కాలః సర్వం|
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా||

భావం:-
ధనము, పరివారము, యౌవ్వనము - ఇవి కలవని గర్వించకుము. ఎందుకంటే ఒక్క నిమిషంలో కాలము వాటినన్నిటినీ హరించివేయగలదు. దృశ్య పదార్థములన్నియూ మాయామయములు, అశాశ్వతములు, కావున వాటిని త్యజించి, శాశ్వతమగు బ్రహ్మమును తెలుసుకొని అందు ప్రవేశించుము.          

13వ శ్లోకం 
దినయామిన్యౌ సాయం ప్రాతః 
శిశిరవసంతౌ పునరాయాతః|
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః||

భావం:-
రేయింబవళ్ళు, సాయంసంధ్య సమయములు వచ్చి పోవుచున్నవి. ఋతువులు క్రమంగా ఎన్నో గడిచిపోతున్నాయి. ఈవిధంగా కాలచక్రము రివ్వున తిరుగుచునే ఉన్నది. ఆయుష్షు తరిగిపోవుచున్నది. అయినను ఆశ అను గాలి జనులను వదలకనే ఉన్నది.       


14వ శ్లోకం 
ద్వాదశ మంజరికాభిర శేషః
కథితో వైయా కరణస్యైషః |
ఉపదేశో భూద్-విద్యా నిపుణైః
శ్రీమచ్ఛంకర భగవచ్ఛరణైః || 

భావం:-
పండ్రెండు శ్లోకములను పుష్పగుచ్ఛములతో కూడిన ఈ సమస్త శాస్త్రసారభూతమగు ఉపదేశమంతయు సకల విద్యా ప్రవీణులైనట్టి శ్రీశంకరాచార్యుల వారిచే వ్యాకరణ పండితునకు చెప్పబడెను.  


15వ శ్లోకం 
కాతే కాంతా ధనగతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా|
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా||

భావం:-
ఓయీ ! నీకు యువతీ ధనాదుల గూర్చిన చింత ఏల ? నీకు బోధించువాడు నిన్ను శాసించువాడు లేడా ఏమిటి ? ముల్లోకములందును ఒక్క సజ్జన సహవాసమే సంసారముద్రమును దాటుటకు నావయై ఉన్నది.  


16వ శ్లోకం 
జటిలో ముండీ లుంఛితకేశః 
కాషాయాంబరబహుకృతవేషః|
పశ్యన్నపి చన పశ్యతి మూఢో
ఉదరనిమిత్తం బహుకృతవేషః||

భావం:-

అజ్ఞాని జడలు పెంచుకొనినను, బోడితల కలవాడైనను, రకరకములుగా జుట్టు కత్తిరించుకొనినను, కాషాయ వస్త్రము ధరించినను, పలు విధములుగా వేషములు వేసినను, బ్రహ్మమయమగు ఈ జగత్తును చూస్తున్నను, పరమార్థ సత్యమును తెలిసికోకుండానే ఉన్నాడు. అట్టివాడు పలురకములుగా వేషాలేన్ని వేసినను పొట్టకూటి కొరకు మాత్రమే అగును, అని ఈ శ్లోకాన్ని తోటకాచార్యులవారు చెప్పిరి.          
17వ శ్లోకం 
అంగం గలితం పలితం ముండం 
దశనవిహీనం జాతం తుండం|
వృద్ధో యాతి గృహిత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం||

భావం:-
శరీరము ముడతలు పడినను, తల నేరసిపోయినను, నోటిలో పండ్లన్నీ ఊడిపోయినను, కర్రపట్టుకొని నడుచుచున్నను, ముదుసలివణికి ఆశ వదులుటలేదు. ఈ శ్లోకమును హస్తామలకాచార్యులవారు చెప్పిరి.       


18వ శ్లోకం 
అగ్రే వహ్నిః పృష్ఠే భానూ 
రాత్రౌ చుబుకసమర్పితజానుః|
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః||

భావం:-
ముందుభాగమున అగ్ని హోత్రము, వెనుకభాగమున సూర్యుడు కలిగియుండి, రాత్రిళ్ళు చలిపోగొట్టుకొనుటకు మోకాళ్ళు గడ్డమునకు ఆనించి ముడుచుకొని పడుకొనుచు, కరతలభిక్షను స్వీకరించుచు, చెట్టుక్రింద నివసించుచు ఉన్నప్పటికిని ఆశ అను త్రాటిని వదలుటలేదు. ఈ శ్లోకమును సుబోధాచార్యులవారు చెప్పిరి.        


19వ శ్లోకం 
కురుతే గంగాసాగరగమనం 
వ్రతపరిపాలనమథవా దానం|
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన||

భావం:-
గంగాది పవిత్ర నదులయందును, సముద్రమందును స్నానమాచరించినప్పటికిని, వ్రతములను పరిపాలించినప్పటికిని, దానములను చేసినప్పటికిని ఆత్మజ్ఞానము లేనిచో నూరుజన్మలకైనను మానవులకు మోక్షము లభించదు. ఇది సర్వమత సమ్మతము. ఈ శ్లోకమును సురేశ్వరాచార్యులవారు చెప్పిరి.          


20వ శ్లోకం 
సుర మందిర తరుమూల నివాసః 
శయ్యా భూతల మజినం వాసః|
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః||

భావం:-
దేవాలయ ప్రాంగణమునగల చెట్టుక్రింద నివాసము చేయుచు, భూమినే శయ్యగా ఉపయోగించుకొనుచు, జింకచర్మమునే వస్త్రముగా ధరించుచు, సర్వవస్తు పరిగ్రహణమును త్యజించి, భోగములను వదలివైచి, వైరాగ్యమును అవలంబించి భగవంతుని ధ్యానించుచుండ ఎవనికి సుఖము కలుగకుండును.         


21వ శ్లోకం 
యోగరతో వా భోగరతోవా 
సఙ్గరతో వా సఙ్గవిహీనః|
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ||

భావం:-
ఎవనియొక్క చిత్తము పరబ్రహ్మము(ఆత్మ)నందు నిలకడ కలిగి ఉండునో,  అట్టివాడు యోగయుక్తుడుగ ఉండినను, భోగయుక్తుడుగా ఉండినను, సంగ యుక్తుడుగా ఉండినను, సంగరహితునిగా ఉండినను, ఆనందమునే ముమ్మాటికిని పొందుచుండును. ఈ శ్లోకమును ఆనందగిరి ఆచార్యులవారు చెప్పిరి.        


22వ శ్లోకం 
భగవద్గీతా కించిదధీతా 
గంగా జలలవ కణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా||

భావం:-
ఎవరు భగవద్గీతను కొంచమైనను అధ్యయనము చేయునో, గంగాజలమును ఒకింతైనను పానము చేయునో, ఒక్క పర్యాయమైనను భగవంతుని పూజించునో, అట్టి వానిని గూర్చి యముడు కూడా చర్చింపడు. ఈ శ్లోకమును దృఢభక్తాచార్యులవారు చెప్పిరి.      


23వ శ్లోకం 
పునరపి జననం పునరపి మరణం 
పునరపి జననీ జఠరే శయనం|
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే||

భావం:-
మరల మరల పుట్టుట, మరల మరల చచ్చుట, మరల మరల తల్లి గర్భమునందు పరుండుట - మొదలైన బాధలతో కూడిన ఈ అపార దుస్తర సంసార సముద్రము నుండి ఓ పరమాత్మా ! దయతో రక్షింపుము. ఈ శ్లోకమును నిత్యనాథాచార్యులవారు చెప్పిరి.     


24వ శ్లోకం 
రథ్యా చర్పట విరచిత కంథః 
పుణ్యాపుణ్య వివర్జిత పంథః|
యోగీ యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ||

భావం:-
వీథులందు పడియున్న గుడ్డపీలికలచే సమకూర్చబడిన బొంతకలవాడను, పుణ్యాపుణ్యములకు అతీతమైన ఆత్మ మార్గమున సంచరించువాడును, ఆత్మయందు నియోగింపబడిన చిత్తము కలవాడను అగు యోగి బాలునివలెను, ఉన్మత్తునివలెను తనలో తానూ ఆనందించుచుండును.(ఆత్మానందమును పొందుచుండును). ఈ శ్లోకమును యోగానందాచార్యులవారు చెప్పిరి.         


25వ శ్లోకం 
కస్త్వం కోఅహం కుత ఆయాతః 
కా మే జననీ కో మే తాతః|
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం||

భావం:-
నీవెవడవు ? నేనెవరిని ? మనం ఎక్కడ నుండి వచ్చాము ? నా తల్లి ఎవరు ? నా తండ్రి ఎవరు ? - అని ఈ ప్రకారముగ సంసారమునుగూర్చి విచారించి, ఇది అంతయు కలవలె అసత్యమని తెలిసికొని, ఆ యా దేహాది పదార్థములపై వ్యామోహమును విడనాడి సత్యమగు పరమాత్మను ఆశ్రయించవలెను. ఈ శ్లోకమును సురేంద్రాచార్యులవారు చెప్పిరి.       


26వ శ్లోకం 
త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః 
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః|
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్య చిరాద్యది విష్ణుత్వమ్||

భావం:-
నీయందు, నాయందు అంతటను ఒకే భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అయినను నా పట్ల అసహనము కలిగి వ్యర్థముగా నన్ను కోపగించుచున్నావు. నీవు దైవత్వమును శీఘ్రముగా కోరేదవని సర్వత్ర సమబుద్ధి (సర్వం విష్ణుమయం అను భావము) కలవాడవు కమ్ము. ఈ శ్లోకమును మేధాతిథి ఆచార్యులవారు చెప్పిరి.           


27వ శ్లోకం 
కామం క్రోధం లోభం మోహం 
త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం|
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరకనిగూఢాః||

భావం:-
కామమును, క్రోధమును, లోభమును, మోహమును విడిచినచో, అనగా మనస్సునందలి వికారములను త్యజించినచో జీవుడు 'సోహం' భావము ద్వారా అనగా 'ఆ పరమాత్మయే నేను' అను నిశ్చయము ద్వారా తన ఆత్మను చూడగలుగుచున్నాడు. అట్టి ఆత్మజ్ఞానము లేనివారు అజ్ఞానులు, నరకమున పది నానాబాధలను పొందుదురు. ఈ శ్లోకమును భారతీవంశాచార్యులవారు చెప్పిరి.           

28వ శ్లోకం 
గేయం గీతా నామ సహస్రం 
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం|
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం||

భావం:-
భగవద్గీతను, విష్ణుసహస్రనామములను గానము చేయవలెను. భగవంతుని యొక్క స్వరూపమును ఎల్లప్పుడూ ధ్యానము చేయవలెను. సత్సాంగత్యమందు చిత్తమును ప్రవేశపెట్టవలెను. బీదలకు దాన ధర్మములను చేయవలెను. ఈ శ్లోకమును సుమతాచార్యులవారు చెప్పిరి.       

29వ శ్లోకం 
శత్రౌ మిత్రే పుత్రే బంధౌ 
మా కురు యత్నం విగ్రహసంధౌ|
సర్వస్మిన్నపి పశ్యా త్మానం
సర్వత్రో త్సృజ భేద జ్ఞానమ్||

భావం:-
శతృవుతో కాని, మిత్రునితో కాని, పుత్రునితో కాని, బంధువులతో కాని కలహాదులకు ప్రయత్నించకు. అందరి యందును ఆత్మనే చూడు. భేదరూపమైన అజ్ఞానమును సర్వత్ర త్యజించివేయుము. ఈ శ్లోకమును శ్రీశంకరాచార్యులవారు చెప్పిరి.        

30వ శ్లోకం 
సుఖతః క్రియతే రామాభోగః 
పశ్చాద్దంత శరీరే రోగః|
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం||

భావం:-
సుఖాపేక్షతో కామభోగాములను అనుభవించుదురు. కాని అనంతరం శరీరము రోగగ్రస్తమగుచున్నది. ప్రపంచమున చావు అనునది తథ్యమై ఉన్నప్పటికిని జనులు పాప ఆచరణమును వదలకయే ఉన్నారు. ఆహా ! ఆశ్చర్యము. ఈ శ్లోకమును శ్రీశంకరాచార్యులవారు చెప్పిరి.    


31వ శ్లోకం 
ప్రాణాయామం ప్రత్యాహారం 
నిత్యానిత్య వివేకవిచారం|
జాప్యసమేత సమాధివిధాన
కుర్వవధానం మహదవధానం||

భావం:-
ప్రాణాయామము, ప్రత్యాహారము, నిత్యానిత్యవస్తు వివేకము, తత్వవిచారణ, మంత్రజపము, గొప్ప ఏకాగ్రతతో కూడిన సమాధిస్థితి మొదలగు సాధనాలను అవలంబించుము. ఈ శ్లోకమును శ్రీశంకరాచార్యులవారు చెప్పిరి.               


32వ శ్లోకం 
గురుచరణాంబుజ నిర్భర భక్తః 
సంసారాదచిరాద్భవ ముక్తః|
సేంద్రియమానస నియమాదేవ
ద్రక్ష్యపి నిజ హృదయస్థం దేవం||

భావం:-
గురువు యొక్క పాదపద్మములందు మనస్సును నెలకొల్పి గురుభక్తి కలవాడై, సంసారబంధనము నుండి శీఘ్రముగా విముక్తుడవు కమ్ము. ఇంద్రియములను, మనస్సును నిగ్రహించుటచేత మాత్రమే నీ హృదయమందున్న ఆత్మరూప పరమేశ్వరుని, దేవదేవుని చూడగలవు. ఈ శ్లోకమును శ్రీశంకరాచార్యులవారు చెప్పిరి.             


33వ శ్లోకం 
మూఢః కశ్చిన వైయాకరణో
డుకృణ్కరణాధ్యయన ధురీణః |
శ్రీమచ్ఛంకర భగవచ్చిష్యైః
బోధిత ఆసీచ్ఛోదిత కరణైః || 

భావం:-
ఆత్మజ్ఞానము లేనివాడును, 'డుకృఞ్ కరణే' అను వ్యాకరణ సూత్రమును వల్లెవేయుటయందు మాత్రమూ అగ్రేసరుడైన ఒకానొక వ్యాకరణ శాస్త్రజ్ఞుడు, శ్రీ శంకర భగవత్పాదుల చేతను, వారి శిష్యులచేతను ఈ విధముగా బోధింపబడి, అంతఃకరణము శుద్ధపరచుకొని తరించెను. ఈ శ్లోకమును శ్రీశంకరాచార్యులవారు చెప్పిరి.


    

No comments:

Post a Comment