November 19, 2014

పెద్దలకు ఇది పెద్దబాలశిక్ష

పెద్దలకు ఇది పెద్దబాలశిక్ష



పిల్లల్ని ‘పిల్లలు’ అంటూ తేలిగ్గా తీసుకోవడానికి లేదు. రెండేళ్ళ సిసింద్రీ నుంచి ఇష్టాలు, అయిష్టాలు, కోపం, విసుగు అన్నీ ప్రదర్శిస్తూ వుంటారు. మన స్పందన బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతూ వుంటుంది. చాలాసార్లు మీరు గమనించే వుంటారు.. మూడు నాలుగేళ్ళ పిల్లలు ఏదన్నా కావాలంటే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టు అడుగుతారు. మనకి కోపం వచ్చేస్తుంది అది చూసి. వేలెడంత లేవు - ఏదన్నా కావాలంటే నెమ్మదిగా అడగకూడదా.. నామీదే అరుస్తావా అంటూ పిల్లాడిని కోప్పడతాం.కానీ నిజానికి ‘మాన్యుపులేషన్’ ఇంకా అలవాటు కాని వయసది. నెమ్మదిగా బతిమాలితేనే బావుంటుందని వాళ్ళింకా నేర్చుకోని అమాయకత్వం మరి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని అనుకరించడమే కరెక్టు అనుకునే సందర్భమది. మనం పిల్లలకి ఏదన్నా చెప్పాలంటే గొంతు పెంచి అరిచేకదా చెబుతాం. వాళ్ళూ అదే చేస్తున్నారు. కానీ, దానికి మనకి కోపం వస్తుంది. అయితే ఇక్కడే మని వాళ్ళని పెద్ద కన్ఫ్యూజన్‌లో పడేస్తాం. అమ్మ అరిస్తే తప్పులేదుగానీ, నేను అరిస్తే తప్పేంటి? అలాగే కదా చెప్పాలి? అని ఆ పసిపాపల మనసులు ఆలోచనలో పడిపోతాయి.

పెద్దల్లాగే పిల్లలూనూ:  ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే వారిని పెంచడానికి మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ వుండాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు సాధారణంగా పిల్లల ప్రవర్తనను అంచనా వేసే విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు, చేసుకోవాల్సిన సర్దుబాట్లు కొన్ని ఉన్నాయంటూ పిల్లల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘‘వాటికి మొండితనం చాలా ఎక్కువ’’ అంటూ మనం పిల్లల్ని పదేపదే అంటుంటాం కదా, ఆ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా? కొంతమంది పిల్లలు ప్రతీ పనిని చాలా చక్కగా చేయాలని తాపత్రయపడతారు. ఎక్కడా రాజీపడరు. అలాగే వాళ్ళ పనులన్నీ కూడా మనం అలా పద్ధతిగా చేయాలని ఆశిస్తారు. దాంతో మొండిగా ప్రవర్తిస్తున్నట్టు మనకి అనిపిస్తుంది.

ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించండి:  మనం పిల్లల్ని నిందించే ముందు వారిలో వున్న ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించాలి. దానిని సరైన దారిలోకి మళ్ళించాలి. ‘‘రాజీలేని మనస్తత్వం’’ ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కావల్సిందల్లా పట్టు విడుపులు నేర్చుకోవడమే. పిల్లలకు ఆ విషయంపై క్లాసు తీసుకుంటే వాళ్ళకేం అర్థం కాదు. అలాకాక ప్రాక్టికల్‌గా ఆ మనస్తత్వాన్ని వాళ్ళకి వాళ్ళే ఎలా గుర్తించాలో, మనసుని ఎలా మలచుకోవాలో నేర్పించాలి. ఉదాహరణకి స్కూలులో ఇచ్చిన ఏదో ప్రాజెక్టు పనిని ఎంత చేసినా సరిగా రాలేదంటూ పిల్లలు విసుగు పడుతుంటే లేదా మిమ్మల్ని విసుగెత్తిస్తుంటే తేలిగ్గా తీసుకుని కొట్టిపారేయకూడదు. 

సమస్యపై పనిచేయడం నేర్పాలి:  పిల్లల దగ్గరకి వెళ్ళి కూర్చుని ఇది కొంచెం కష్టమే కానీ, నువ్వు చేయగలవు - ఎటొచ్చీ నువ్వు కాస్త టెన్షన్ పడకుండా చేయాలి. ఓ అరగంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టావనుకో చురుగ్గా చేయగలవు.... ఇలా చెప్పి చూడండి. అలాగే, పిల్లలు ఏదన్నా కావాలని మొండిపట్టు పడితే ‘‘నేను ఇవ్వను’’ అని కచ్చితంగా చెప్పకుండా ‘‘తప్పకుండా ఇస్తాను. కానీ ఇప్పుడు కాదు.. అది ఎందుకు అవసరం... ఇప్పుడే ఎందుకు కావాలి... ఆలోచించి నాకు చెప్పు’’ అనాలిట. ఇలా చేయడం వలన సమస్యపై పనిచేయడం నేర్చుకుంటారుట పిల్లలు. అంటే, రాజీలేని మనస్తత్వం మంచిది కాదు - అది మొండితనమని మనం విమర్శించటం లేదు - కానీ అలా రాజీ పడలేనప్పుడు దానిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తున్నాం. అలాగే తన ప్రవర్తనకి కారణాన్ని తానే ఆలోచించుకునేలా చేస్తున్నాం.

మనవంతు సహకారం చాలా ముఖ్యం:  పిల్లలు ఎదుగుతూ, చుట్టూ పరిశీలిస్తూ తమ అనుభవాలని సమీక్షించుకుంటూ ఎన్నో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఆ ప్రయత్నానికి మన వంతు సహకారం అందిస్తే చక్కటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అలాకాక పిల్లల ప్రతి చర్యనీ విమర్శిస్తూ, అతిగా స్పందిస్తూ, వారిని నిందిస్తూ వుంటే అది క్రమశిక్షణ అని మనం అనుకున్నా, అది పిల్లల సహజ నైజాన్ని, వ్యక్తిత్వాన్ని చిదిమేయడమే అవుతుంది. అందుకే వారిని విమర్శించేముందు, ఎలా సరిచేయొచ్చో ఆలోచించమంటున్నారు నిపుణులు.

By~~~~~ రమ 

http://www.teluguone.com/vanitha/content/how-to-suggest-child-good-behaviour-76-30684.html#.VGxBqjSUdQA


No comments:

Post a Comment