November 19, 2014

వేలు వదిలితే చాలు... పిల్లలకి అదే పదివేలు!

వేలు వదిలితే చాలు... పిల్లలకి అదే పదివేలు!


‘‘పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరగాలంటే ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు.. మీరు గట్టిగా పట్టుకున్న వారి వేలుని వదిలేయండి చాలు’’ ఈ మాటలు అన్నది 12 ఏళ్ళపాటు సుదీర్ఘంగా తల్లిదండ్రులు, పిల్లలపై అధ్యయనం చేసిన ఓ యూనివర్సీటీ బృంద సభ్యులు.పిల్లల్లో ఆత్మవిశ్వాసం అన్న అంశంపై వీరి అధ్యయనం సాగింది. అందులో పిల్లల ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే అంశాలను పరిశీలించారు. అందులో తల్లిదండ్రుల అతి జాగ్రత్త, ప్రేమ కూడా కారణమని తేలింది.


సాధారణంగా పిల్లల మీద ప్రేమకొద్దీ వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకుంటారు పేరెంట్స్. వారికి తెలీదని, చేతకాదని అంటూ దగ్గరుండి అన్నీ చేస్తారు. సలహాలు, సూచనలు, నీకేం తెలీదనే అదిలింపులు సరేసరి. అయితే ఇది సరికాదని, పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిని నెమ్మది నెమ్మదిగా స్వతంత్రంగా పనులు చేసేలా, ఆలోచించేలా వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు నిపుణులు. పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకుని తిరిగి ప్రయత్నించమనాలి. పిల్లలు చేసే పొరపాట్లు వారి ఎదుగుదలలో ఓ తప్పనిసరి ప్రాసెస్ అని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. వారు సలహా అడిగితేనే ఇవ్వాలి అంటున్నారు వీరు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల ప్రయత్నాన్ని, తప్పొప్పులని విమర్శించకూడదట. నీవల్ల కాదులే అని చొరబడి వారి పని కూడా చేయకూడదట. అది మూడేళ్ళవాడు కావొచ్చు.. పదమూడేళ్ళవాడు కావొచ్చు.. వాడి పరిధిలో వాడి పనేదో వాడికి చేతనైనట్టు చేయనివ్వాలి. అప్పుడే వారు ‘ఆత్మవిశ్వాసం’ అనే కవచాన్ని పొందగలరు అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. పిల్లల ఎదుగుదల క్రమమంతా ఓ చక్కటి ఆట. ఆ ఆటలో వారు ఒకసారి గెలుస్తారు. మరోసారి ఓడిపోతారు. ఆ ఓటమిలోనే మళ్ళీ ఎలా గెలవాలో వాళ్ళే నేర్చుకుంటారు.

తల్లిదండ్రులుగా ఆ ఆటని చూస్తూ ఆనందించడమే మనం వారికివ్వగలిగే అమూల్యమైన బహుమతి. ఏమంటారు?

By~~~~~~ రమ

http://www.teluguone.com/vanitha/content/-tips-on-helping-your-child-develop-confidence-76-30025.html#.VGw_1jSUdQA


No comments:

Post a Comment