November 19, 2014

వంటింట్లో సంజీవని... కరివేపాకు!

వంటింట్లో సంజీవని... కరివేపాకు!


కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అంటూ వాపోయేవారు, ‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అయితే కూరకి రుచి అంటగానే చక్కగా ఆకుని కాస్తా ఏరిపారేస్తారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో... కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు. కానీ, కరివేపాకు ప్రాశస్త్యం తెలిస్తే చక్కగా అన్ని వంటల్లో ఇంత కరేపాకు ఏరిపారేయడానికి వీలు లేకుండా ఎలా వేయొచ్చో తప్పకుండా ఆలోచిస్తారు.

కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. ఇలా పౌష్టిక విలువలలో ఏ కూరకీ ఏమాత్రం తీసిపోని కరివేపాకుని కేవలం రుచి గురించి మాత్రమే వాడతాం మనం. పూర్వమయితే కరివేపాకు పొడులు, కరివేపాకు పచ్చడి అంటూ కరివేపాకు వినియోగం కొంచెం ఎక్కువగానే వుండేది. కానీ, ఫాస్ట్‌ఫుడ్ కల్చర్‌లో కరివేపాకు వెనుకబడిపోయింది.  మనం ఎవరి ఫాస్ట్‌ఫుడ్స్‌ని అలవాటు చేసుకుని కరివేపాకుకి దూరమవుతున్నామో వారు మాత్రం కరివేపాకుని భారీగా వినియోగిస్తారంటే నమ్ముతారా! మన దేశం నుంచి సుమారు 900 టన్నుల వరకు కరివేపాకు విదేశాలకు ఎగుమతి అవుతోందిట. గల్ఫ్ దేశాలలో మన కరివేపాకుకి బోలెడంత డిమాండ్. ఐరోపా వాసులైతే  ఎండబెట్టిన కరివేపాకు ఆకుల పొడి వాడతారుట. అసలు కరివేపాకుని ఎందుకు తినాలి? అందులో బోల్డన్ని పౌష్టిక విలువలు ఉండబట్టేనని చెప్పుకున్నాం. అంతేనా.. దానిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే.

కరివేపాకుని మధుమేహానికి మంచి మందుగా పాశ్చాత్యులు సైతం గుర్తించారు. ఇందులోని కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు చక్కెర వ్యాధిగ్రస్తుల పాలిట వరం అంటారు నిపుణులు. ఎలా అంటే, తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంధి నుంచి విడుదలయ్యే అల్థాఎమిలేజ్ అనే ఎంజైమే కారణం. కరివేపాకులోని ప్రత్యేక పదార్ధాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయని గుర్తించారు నిపుణులు. నిజానికి జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రివచ్చని ఆయుర్వేద నిపుణులూ చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయమే పది కరివేపాకుల చొప్పున మూడు నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయంటారు ఆయుర్వేద వైద్యులు.

పిల్లలు ఆకలిగా లేదంటూ అన్నం చూడగానే ముఖం తిప్పేస్తుంటే చక్కగా స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు పొడి కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలుట. ఆకలి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది కూడా. కరివేపాకు పొడి అంటే ఒట్టి కరివేపాకే కాదు.. మెంతులు, మిరియాలు కూడా కలపాలి. ఇక డయేరియా వంటి వాటికి రెండు టీస్పూన్ల కరివేపాకు రసం బాగా పనిచేస్తుందిట. అలాగే మజ్జిగలో కాసిన్ని కరివేపాకుల్ని నలిపి లేదా రసం తీసి వేస్తే కడుపులోని బాధలు ఏవైనా తగ్గుతాయిట. అలాగే ఒట్టి కరివేపాకుని వేయించిగానీ, ఎండబెట్టిగానీ పొడిచేసి పెట్టుకుని రోజూ ఓ స్పూన్ తేనెతో ఓ స్పూన్ కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఆరోగ్యానికే కాదు.. అందానికీ కరివేపాకుని వాడతారు. కురులకి ఈ ఆకు ఎంతో మంచిదట. కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. పెరుగుతాయి కూడా. అంతేనా... జుట్టు తెల్లబడటం తగ్గి, కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయిట కూడా. ఇలా ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచిది అని నిపుణులు గట్టిగా చెబుతున్న కరివేపాకుని తరచూ ఏదో ఒక రూపంలో తప్పక తీసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చేశారా? మరింకేం.. కమ్మటి పచ్చడి, టేస్టీ పొడి లేదా పూర్వంలా మజ్జిగలో కరివేపాకు వేసి తాగడం వంటివి మొదలుపెట్టండి. పిల్లలు ఏరిపారేస్తారన్న భయం లేకుండా వుండాలంటే అన్ని కూరల్లో కరివేపాకు పొడిచేసి వేస్తే సరి!
By~~~~~~~-రమ

http://www.teluguone.com/news/content/-health-benefits-of-curry-leaves-34-40133.html#.VGw2nzSUdQA


1 comment: