October 19, 2015

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు





శరత్కాలంలో ప్రకృతి ఆరాధనతో ముడిపడిన పండుగ బతుకమ్మ వేడుక. బొడ్డెమ్మ సందడితో మొదలై 21 రోజులపాటు సాగే పువ్వుల పులకింత, సంస్కృతి సంప్రదాయాల పూలపుంత - బతుకమ్మ సంబరం. భాద్రపదమాసం చివరి రోజైన అమావాస్య మొదలు తొమ్మిదిరోజులపాటు కనువిందుగా ఈ పర్వం పరిమళిస్తుంది. సమిష్టితత్వం, సమైక్య జీవన సౌందర్య నేపథ్యంగా జానపదుల సందళ్ళు శోభిల్లుతాయి. ఆ పరంపరలోనిదే బతుకమ్మ ఆరాధనం. శిష్ట సంప్రదాయంలో ఉపాసనరీతిలో, మంత్రపూర్వకంగా శరన్నవరాత్రుల్ని నిర్వహించుకుంటారు. జానపదులు ఆటలపాటల అలరింతలతో ఈ వేడుకలని కొనసాగిస్తారు. 

అమ్మతల్లిని ప్రకృతి స్వరూపిణిగా, పూలమ్మగా పేర్చి బతుకమ్మగా పూజిస్తారు. ప్రకృతిని పూజించండి.... ప్రేమించండి ...... పరిరక్షించండి ..... అనే ఆత్మీయ సందేశ ఆలంబనగా ఈ వేడుకలు విలసిల్లుతున్నాయి. ప్రకృతిలోని పుష్ప వైవిధ్యాన్ని ఏకీకృతంచేసి అమ్మకు చేసే పుష్ప కైంకర్యం బతుకమ్మ వైభవం. 

తెలంగాణా ప్రాంతంలో మహాళయ అమావాస్య నుండి సాగే బతుకమ్మ వేడుకలు ఆశ్వీయుజ శుద్ధ నవమి వరకు ఆకట్టుకుంటాయి. పెద్దల అమావాస్య, ఎంగిలి పూల అమావాస్యగా వ్యవహరించే మహాళయ అమావాస్య నుండి ఎనిమిది రోజులు ఓ సిబ్బి(వెదురు అల్లిక పళ్ళెం)లో గుమ్మిడి ఆకులు పరచి, బతుకమ్మను పేరుస్తారు. గుమ్మిడి, తంగేడు, గునుగు, రుద్రాక్ష, బీర, గన్నేరు, బంతి, గోరింట, సొర మొదలైన పుష్పాలని క్రమపద్దతిలో అమరుస్తారు. 

ఈ పుష్పరాశిపై తమలపాకుల్లో పసుపు గౌరమ్మను ఉంచుతారు. 

పూలసోయగంతో పరిఢవిల్లే ఈ సముదాయమే బతుకమ్మ. ప్రకృతి రూపధారి బతుకమ్మను ఆడపడుచులు పసుపుకుంకుమలతో పూజిస్తారు. బతుకమ్మ చుట్టూ గుండ్రంగా  తిరుగుతూ సామూహికంగా పాటలని పాడుతుంటారు. 

నైవేద్యాలని సమర్పించి, ప్రతీరోజూ బతుకమ్మను దగ్గరలో ఉండే చెరువులలో నిమజ్జనం చేస్తారు. దుర్గాష్టమిరోజు జరిగేది పెద్ద బతుకమ్మ సంబరం. దీన్నే సద్దుల బతుకమ్మ అంటారు. ఆరోజు సిబ్బిలో కాకుండా ఇత్తడి పళ్ళెంలో బతుకమ్మను పేర్చుతారు. ఏటేటా పూలపోదరిళ్ళలోకి బతుకమ్మను ఆహ్వానించి, తమ ఊరువాడలని క్షేమంగా చూడమని ఆడపడుచులు ఆమెకు విన్నవించుకుంటారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి..ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. 

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నానోము పండింది ఉయ్యాలో
నీనోము పండిందా ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో
మీవారు వచ్చిరా ఉయ్యాలో


బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట

ఒక్కొక్క వువ్వేసి [[చంద మామ||
ఒక జాము అయే [[చంద మామ||

రెండేసి పువ్వు తీసి ||చంద మామ||
రెండు జాము లాయె ||చంద మామ||

బొడ్డెమ్మ బొడ్డెమ్మ.... బిడ్డలెందారే
బవిల పడ్డ వారికి ......వారిద్దరమ్మా
చెర్ల బడ్డవికి ..... .. చేరిద్దరమ్మా
కుంట్ల బడ్డ వారుకి.. కోరుద్దరమ్మ
నిద్రపో బొడ్డేమ .... .. నిద్రబోవమ్మ
నిద్రకు నూరేండ్లు...... నీకి వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి....... నిండ నూరేంళ్ళు
అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది.. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

జానపదుల ఇలవేల్పు అయిన బతుకమ్మకు, నవరాత్రి సంబరాలకు సన్నిహిత సంబంధం ఉందని ఎన్నో గాథల ద్వారా వెల్లడవుతుంది. మహిషాసురిడితో యుద్ధంచేసి దుర్గమ్మ అలసి, సొమ్మసిల్లింది. లోకరక్షణ కోసం అవతరించిన దుర్గమ్మను స్త్రీలు సేదదీర్చి, తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి సేవలు చేసారు. ఆమె మనోల్లాసం కోసం  పాటలు పాడారు. తొమ్మిదోరోజుకు అమ్మకు అలసట తీరి, మహిషాసురిడిని వధించి, కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వర్తించింది. లోక శుభంకరిణిగా దుర్గమ్మ జనులకు కొత్త జీవితాన్ని, బతుకును ప్రసాదించింది. ప్రజలకు బతుకునిచ్చిన అమ్మ కనుక గ్రామీణులు ఆమెను బతుకమ్మగా పిలుస్తున్నారు.



దక్షప్రజాపతి వాళ్ళ అవమానం పొందిన సతీదేవి అగ్నికి ఆహుతయ్యింది. శివుడు ఆగ్రహించి, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. యజ్ఞగుండంలోపడి భస్మీపటలమైన సతీదేవికి ప్రతీకగా పసుపు గౌరమ్మను సృష్టించారు. అందరికీ బతుకునిచ్చేతల్లి ఆమె కాబట్టి సతీదేవే బతుకమ్మ అయ్యిందనేదే మరో కథ. 

చోళరాజు ధర్మాంగుడు, సత్యవతి దంపతులకు ఓ ఆడ శిశువుగా జన్మించింది. అమ్మ ఆశీర్వాదంతో పుట్టిన ఆ బిడ్డ పదికాలాలపాటు బతకాలన్న ఆశతో పాపకు బతుకమ్మ(బతుకు+అమ్మ) అని పేరు పెట్టుకున్నారని మరో కథనం ప్రచారంలో ఉంది. లక్ష్మీ పార్వతుల సమ్మిళిత స్వరూపంగా జానపదుల బతుకమ్మను ఆరాధిస్తారు. ప్రకృతితో మమేకమై జీవన సరళిని జానపదులు కొనసాగిస్తారు. ఆ ప్రకృతే దైవంగా, దైవాన్నే ప్రకృతిగా పూజించే విశిష్ట పర్వం బతుకమ్మ సంబరం. 


                                                                                        -డాక్టర్ కావూరి రాజేష్ పటేల్                                                                             

No comments:

Post a Comment