June 29, 2020

హర్యష్టకం

హర్యష్టకం


ఆయువు, బలము, ఆరోగ్యము, ఐశ్వర్యము యశస్సు వీటిని పొందడానికి ”హరి” యను రెండక్షరములను పలుకండి. సకల పుణ్యక్షేత్రములు సేవించిన ఫలితము, సర్వతీర్థములలో అవగాహన చేసిన ఫలితము, సకల దానము లొనరించిన ఫలితము, సర్వవేద పారాయణ చేసిన ఫలితము, సర్వ యజ్ఞములు చేసిన ఫలితము తప్పక లభిస్తాయి. అంతేకాదు చివరలో మోక్షమార్గంలో ఆ అక్షరములే మనలిని నడిపిస్తాయి అని శ్రీ ప్రహ్లాదుడు మనకు ఉపదేశించిన
హర్యష్టకము.

హరి ర్హరతి పాపాని దుష్టచిత్తౖ రపి స్మృత: |
అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావక: ||
తాత్పర్యము :
”హరి” యను రెండక్షరములను నోరార పలుక గలిగిన వారికి కలుగు లాభములు ఎన్నియో! వారెట్లు కీర్తింపబడుదురో వివరించు స్తోత్రమిది. నిప్పును తెలియక తాకిననూ కాల్చి తీరును. అట్లే ”హరి” నామము రెండక్షరములే అయిననూ తెలియక పలికిననూ వారి పాపరాశులనన్నింటిని హరించివేయు ప్రభావము కలది. దుష్టులనైనను పవిత్రులను చేయును. ఇక ప్రేమతో పలికిన చెప్పనేల?
స గంగా స గయా సేతు: స కాశీ స చ పుష్కరమ్‌ |
జిహ్వాగ్రే వర్తతే యస్య హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
ఎవని నాలుకపై ”హరి” యను రెండక్షరములు ప్రకాశించునో అతడు గంగవలె పవిత్ర తీర్థుడగును. గయా క్షేత్రమువలె పితృదేవతల కానందమొసగును. సీతను లభించుటకై వానర వీరులు నిర్మించిన సేతువువలె భగవానునికి ప్రీతిపాత్రుడగును. కాశీవలె, అతని సమీపములో ఉన్నంత మాత్రముననే పాపములను తొలగించును. పుష్కరక్షేత్రము వలె సాక్షాత్తు భగవానుని అవతారమేయగును.
వారాణస్యాం కురుక్షేత్రే నైమిశారణ్య ఏవ చ |
యత్కృతం తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
సదా రామనామోపదేశము చేయుచుండు శివుడున్నందున కాశీ క్షేత్రమైనది. అక్కడ చేయు పుణ్యకర్మల వల్ల లభించు ఫలము ”హరి’ యను రెండక్షరముల వల్లే కల్గును. వేద పురాణములను ప్రవర్తింపజేసిన వేద వ్యాసాది ఋషుల శిష్యులు వసించినందున నైమి శారణ్‌ంయ పూజ్యతమమైనది. అంతేకాక అది సాక్షాత్‌ భగవదవతారమే ఆక్షేత్రమున ఆచరించు పుణ్య‌క‌ర్మ‌ల‌ ఫలమంతయు హరి యను రెండక్షరములవల్లనే లభించును. ధర్మక్షేత్రమగు కురుక్షేత్ర మందాచరించు పుణ్య‌క‌ర్మ‌ల‌ వల్ల లభించు ఫలితమంతయు ‘హరి’ యను రెండక్షరముల వల్లనే కలుగునను.

పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ |
తాని సర్వా ణ్యశేషాణి హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
భూప్రదక్షిణలు చేయుట. అందలి పుణ్యతీర్తములందు స్నానమాచరించుట పవిత్రక్షేత్రములను, స్థానములను సంరద్శించుట మొదలగు నవన్నియు ఎంత పుణ్యమును కలిగించునో అదంతయు ‘హరి’ యను రెండక్షరముల తలంపు మాత్రముననే కల్గించును.
గవాం కోటి సహస్రాణి హేమకన్యా సహస్రకమ్‌ |
దత్తం స్యాత్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
లెక్కలేనన్ని గోవులను దానమిచ్చిన వానికి ఏ పుణ్యము లభించునో బంగారు ఆభరణములతో నింపిన వేలాది కన్యలను వివాహముగా దానము చేసినవానికే పుణ్యము లభించునో, అంతటి పుణ్యము ‘హరి’ యన్న వానికి లభించును.
ఋగ్వేదోథ యజుర్వేద: సామవేదో ప్యథర్వణ: |
అధీత స్తేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
ఋక్‌, యజుర్‌, సామ, అధర్వ వేదములను క్రమబద్ధముగ నేర్చిన వాని కెట్టి ఫలితము దక్కునో ‘హరి’ యను రెండక్షరముల ను నోరార పలికిన వాని కంతటి ఫలితము దక్కును.
అశ్వమేధై ర్మహాయజ్ఞై: నరమేధై సథైవ చ |
ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
అనేక అశ్వమేధ మహాయజ్ఞములు, నరమేధములు మొదలగు అపూర్వ యజ్ఞములు చేసినవారి కెంతటి పుణ్యము లభించునో అంతటి ఫలితము ‘హరి’ యను రెండక్షరములు పల్కిన వారికి లభించును.

ప్రాణ ప్రయాణ పాథేయం సంసార వ్యాధి నాశనమ్‌ |
దు:ఖాత్యంత పరిత్రాణం హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
‘హరి’ యను రెండక్షరములను యిప్పుడు పలికినచో జీవుడు దేహము వీడి బయలు దేరునపుడు మోక్షము చేరువరకూ దారి భత్యముగ అవియే పోషించును. కర్మ చేయించి సంసార చక్రమున కూలద్రోయ ‘అహంకారము’ ను ‘హరి’ యను రెండక్షరములే హరించును. దు:ఖములకు మూలకారణమగు రజోగుణము దాని వికారముల నుండి ‘హరి’ యను రెండక్షరములే కాపాడును.
బద్ధ: పరికర స్తేన మోక్షాయ గమం ప్రతి |
సకృ దుచ్చారితం యేన హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
మోక్షమార్గమున పయనించుట కవసరమగు సాధన సామాగ్రియంతయు శ్రమపడి కూడబెట్టనవసరము లేదు. ‘హరి’ యను రెండక్షరముల నొకసారి పలికినచో అవియే అన్నింటిని సిద్ధము చేసి పెట్టగలవు.
ఫలశ్రుతి
హర్యాష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ య: పఠేత్‌ |
ఆయుష్యం బల మారోగ్యం యశో వృద్ధి శ్శ్రియావహమ్‌ ||
తాత్పర్యము :
హర్యష్టక మను ఈ పుణ్య స్వరూపమగు స్తోత్రమును వేకువనే లేచి అనుసంధించువానికి ఆయువు పెరుగును. సత్కార్య నిర్వహణ కనువగు లము ల భించును. స్థిరమగు ఆరోగ్యము కలుగును. అట్టి హరి భక్తుని కీర్తి జగమంత వ్యాపించును. ఐశ్వర్యవంతుడగును.
ప్రహ్లాదేన కృతం స్తోత్రం దు:ఖ సాగర శోషణమ్‌ |
య: పఠేత్‌ స నరో యాతి తద్విష్ణో: పరమం పదమ్‌ ||
తాత్పర్యము :
లోతు, అంతు తెలియని జలసారమువలె, దు:ఖములు కూడ అనంతములు. అట్టివాటి నన్నింటిని ఎండింపజేయు సామర్థ్యము ‘హర్యష్టకము’నకు కలదు. ఎవరీ స్తోత్రమును పఠింతురో అట్టివారికి వైకుంఠప్రాప్తి దేహావసానమున నిశ్చయముగ లభించును.

June 28, 2020

ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయం ఎంతో విశిష్టమైన స్త్రోత్రం. వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో వివరించబడినది. శ్రీరామ - రావణ యుద్ధం సమయంలో, దుష్టశిక్షణ జరిగి, విజయ ప్రాప్తి కోసం అగస్త్య మహర్షి,  శ్రీరామచంద్రమూర్తికి దివ్యోపదేశం చేసారు.

ఈ ఆదిత్య హృదయంలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.
మొదటి రెండు శ్లోకాలు  అగస్త్యుడు, శ్రీరాముడి వద్దకు వచ్చుట.
3 నుండి 5 శ్లోకాలలో,  ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
6 నుండి 15 శ్లోకాలలో, సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న అంతః స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే అని.
16 నుండి 20 శ్లోకాలలో మంత్ర జపం.
21 నుండి 24 శ్లోకాలలో సూర్యుడు గురించిన మంత్రాలు.
25 నుండి 30 శ్లోకాలలో పారాయణ వల్ల కలిగే ఫలం (ఫలశృతి), ఈ పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీరాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం మొదలగునవి వివరించబడినవి.

ప్రతి ఆదిత్యవారం (ఆది వారం) ఈ ఆదిత్యహృదయం శ్లోకాలను (7) సప్త ధారావాహిక భాగాలుగా తాత్పర్య సహితముగా మీ అందరికీ పంపడం జరుగుతుంది.

ఈ స్తోత్రములను నియమంతో, పఠించడమో లేక పారాయణమో చేయడం వలన, ఆరోగ్యం ప్రాప్తి మరియు ఎన్నో విషయాలలో విజయాలు సాధించవచ్చునని పెద్దలు చెప్పారు.

ఆదిత్యహృదయం 
1)
తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం!
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం!!

అర్థము:
యుద్ధము చేసి, మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.

2)
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం!
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః!!

అర్థము:
యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి, శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.

అగస్త్య ఉవాచ:
3)
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం!
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి!!

అర్థము :
ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనమునుండి మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.

4)
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం!
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం!!

అర్థము :
ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర విజయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.

June 27, 2020

ఏహి ముదం దేహి .... నారాయణతీర్థ తరంగం

ఏహి ముదం దేహి  .... నారాయణతీర్థ తరంగం

ఏహి ముదం దేహి శ్రీకృష్ణ మాం పాహి
గోపాల బాల కృష్ణ కృష్ణ

నంద గోపా నందన శ్రీ కృష్ణా కృష్ణా యదు
నందన భక్త చందన శ్రీ కృష్ణా కృష్ణా

కలభ గతిం దర్శయ శ్రీ కృష్ణా కృష్ణా తవ
కర్ణౌ చలయ శ్రీ కృష్ణా కృష్ణా
ధావ ధావ మాధవ శ్రీ కృష్ణా కృష్ణా నవ్య
నవనీత మాహర శ్రీ కృష్ణా కృష్ణా

విక్రమ బలం దర్శయ శ్రీ కృష్ణా కృష్ణా విధి
శక్రాది సన్నుత శ్రీ కృష్ణా కృష్ణా
భవ్య నటనం కురు శ్రీ కృష్ణా కృష్ణా బల
భద్ర సహోదర శ్రీ కృష్ణా కృష్ణా

సాధు సాధు కృత మిహా శ్రీ కృష్ణా కృష్ణా లోక
సాధక హితాయ శ్రీ కృష్ణా కృష్ణా
నారదాది మునిగ్రేయ శ్రీ కృష్ణా కృష్ణా శివ
నారాయణ తీర్థ వరదా కృష్ణా కృష్ణా

June 24, 2020

శ్రీ రామ నామం మరువం మరువం

శ్రీ రామ నామం మరువం మరువం

శ్రీ రామ నామం మరువం మరువం
సిద్ధము యమునకు వెరువం వెరువం

గోవిందు నే వేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం

నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులనింక మేము నమ్మం నమ్మం

విష్ణు కథలు చెవుల విందాం విందాం
వేరే కథలు చెవుల మాందాం మాందాం

రామదాసులు మాకు సారం సారం
కామదాసులు మాకు దూరం దూరం

మాధవ నామము మరువం మరువం
మరి యమ బాధకు వెరువం వెరువం

పద్మనాభునిదే భారం భారం
పరమేశ్వరుని ఆజ్ఞ మీరం మీరం

దామోదరుని తలుతాం తలుతాం
తామసులకు తొలగి నిలుతాం నిలుతాం

అధోక్షజాయని అందాం అందాం
అతని స్మరించుచు ఉందాం ఉందాం

నరసింహుల దివ్య నామం నామం
చేరి అతనిని గొల్వ క్షేమం క్షేమం

అవనిజ పతిసేవ మానం మానం
మరియొక జోలంటే మౌనం మౌనం

భద్రగిరీసుని కందాం కందాం
భద్రముతో మనము ఉందాం ఉందాం

June 20, 2020

శ్రీభాగవత సుధాలహరి - 7th part

శ్రీభాగవత సుధాలహరి ప్రవచనం (వామనావతారం) ..... ఏడవ భాగం .....By P.L.N.Prasad Garu Sri Bhagavta Sudhalahari Pravachanam....(Vamanavataram)....7th part ప్రవచనం మధ్యలో పద్యాలు అందించినవారు.... శ్రీ.ధార్వాడ మురళీ కృష్ణ గారు & శ్రీమతి. యశోధర గారు

June 13, 2020

శ్రీభాగవత సుధాలహరి 6th part

శ్రీభాగవత సుధాలహరి ప్రవచనం (వామనావతారం) ..... ఆరవ భాగం .....By P.L.N.Prasad Garu


శ్రీభాగవత సుధాలహరి 5th part

శ్రీభాగవత సుధాలహరి ప్రవచనం (వామనావతారం) ..... ఐదవ భాగం .....By P.L.N.Prasad Garu


శ్రీభాగవత సుధాలహరి 4th part

శ్రీభాగవత సుధాలహరి ప్రవచనం (వామనావతారం) ..... నాలుగవ భాగం .....By P.L.N.Prasad Garu




రామ దైవశిఖామణి సురరాజ మనోజ్వల భూమణి

రామ దైవశిఖామణి సురరాజ మనోజ్వల భూమణి కీర్తన

రామ దైవశిఖామణి సురరాజ మనోజ్వల భూమణి
తామరసాక్ష సుధీమణీ భవ్యతారక భక్తచింతామణి                           

నాడే మిము వేడుకొంటిగా శరణాగతి బిరుదని వింటిగా
వేడుక మిము పొడగంటిగా నన్ను దిగవిడనాడ వద్దంటిగా           

చింతసేయగ నేమిలేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా
ఇంతకు మిక్కిలి రాదుగా నేనితరుల కొలిచేది లేదుగా               

తమ్ముడు నీవొక కంటను రామదాసుని రక్షించుకుంటను
సమ్మితినుండు మా ఇంటను భద్రాచలవాస నీబంటు బంటను

June 6, 2020

జానకీ రమణ కల్యాణ సజ్జన నిపుణ

జానకీ రమణ కల్యాణ సజ్జన నిపుణ

జానకీ రమణ కల్యాణ సజ్జన నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ 

ఓనమాలు రాయగానే నీ నామమే తోచు - నీ నామమే తోచు శ్రీరామా

ఎందు జూచిన నీదు అందమే కానవచ్చు - అందమె కానవచ్చు శ్రీరామా

ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రమే చాలు - భక్తి మాత్రమే చాలు శ్రీరామా

సత్య స్వరూపమున ప్రత్యక్షమైనావు - ప్రత్యక్షమైనావు శ్రీరామా

భద్రాచల నివాస పాలిత రామదాస - పాలిత రామదాస శ్రీరామా

June 3, 2020

శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు

శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు



శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు
ఘోరమైన తపములను కోర నేటికే మనసా
1
తారక శ్రీ రామనామ ధ్యానము జేసిన చాలు 
వేరు వేరు దైవములను వెదక నేటికే మనసా
2
భాగవతుల పాద జలము పైన జల్లుకొన్న చాలు  
భాగీరథికి పొయ్యేననే భ్రాంతి యేటికే
భాగవతుల వాగామృతము పానము జేసిన చాలు 
బాగు మీరనట్టి అమృత పానమేటికె మనసా
3
పరుల హింస సేయకున్న పరమ ధర్మమంతే చాలు 
పరులను రక్షింతునని పల్కనేటికే
దొరకని పరుల ధనముల దోచకయుండితే చాలు 
గురుతుగాను గోపురము గట్టనేటికె మనసా
4
అతిథి వచ్చి ఆకలన్న అన్నమింత నిడిన చాలు 
క్రతువు సేయ వలె ననే కాంక్షయేటికే
సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైన 
ఇతర మతములని యేటి వెతల వేటికే మనసా

June 2, 2020

తారక మంత్రము కోరిన దొరికెను

తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని వోరన్న



తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని వోరన్న మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యనిన మికయున్న మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్న హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు లెలమి తిరుగ పని లేదన్న ముచ్చటగ తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్న వచ్చెడి పరువపు దినములలో సుడి పడుటలో మానకయున్న ఎన్ని జన్మముల ఎరుకతో చూచిన ఏకో నారాయణుడన్న అన్ని రూపులైయున్న పరాత్పరు నా మహాత్ముని కథవిన్న ఎన్ని జన్మముల జేసిన పాపము ఈ జన్మముతో విడునన్న అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్న నిర్మల అంతర్ లక్ష్య భావమున నిత్యానందముతో నున్న కర్మంబులు విడి మోక్ష పద్ధతిని కన్నుల నే జూచుచునున్న ధర్మము తప్పక భద్రాదీసుని తన మదిలో నమ్మికయున్న మర్మము తెలిసిన రామదాసు హృన్మందిరమున నే యున్న

శ్రీభాగవత సుధాలహరి 3rd part

శ్రీభాగవత సుధాలహరి ప్రవచనం (వామనావతారం) ..... మూడవ భాగం .....By P.L.N.Prasad Garu


June 1, 2020

కంటి నేడు మా రాముల - కనుగొంటి నేను మా రాముల

కంటి నేడు మా రాముల కనుగొంటి నేను మా రాముల


కంటి నేడు మా రాముల
కనుగొంటి నేను మా రాముల

కంటినేడు భక్త గణముల బ్రోచు మా
ఇంటి వేలుపు భద్రగిరి నున్న వానిని

చెలు వొప్పు చున్నట్టి సీతా సమేతుడై
కొలువు దీరిన మా కోదండ రాముని

తరణి కుల తిలకుని ఘన నీలగాత్రుని
కరుణా రసము గురియు కనుదోయి గలవాని

కురు ముంజి ముత్యాల సరములు మెరయగా
మురిపెంపు చిరునవ్వు మోము గలిగిన వాని

కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప
శరచాపములు కేల ధరియించు స్వామిని

ధరణి పై శ్రీరామదాసునేలెడు వాని
పరమ పరుషుండైన భద్రగిరి స్వామిని