June 28, 2020

ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయం ఎంతో విశిష్టమైన స్త్రోత్రం. వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో వివరించబడినది. శ్రీరామ - రావణ యుద్ధం సమయంలో, దుష్టశిక్షణ జరిగి, విజయ ప్రాప్తి కోసం అగస్త్య మహర్షి,  శ్రీరామచంద్రమూర్తికి దివ్యోపదేశం చేసారు.

ఈ ఆదిత్య హృదయంలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.
మొదటి రెండు శ్లోకాలు  అగస్త్యుడు, శ్రీరాముడి వద్దకు వచ్చుట.
3 నుండి 5 శ్లోకాలలో,  ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
6 నుండి 15 శ్లోకాలలో, సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న అంతః స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే అని.
16 నుండి 20 శ్లోకాలలో మంత్ర జపం.
21 నుండి 24 శ్లోకాలలో సూర్యుడు గురించిన మంత్రాలు.
25 నుండి 30 శ్లోకాలలో పారాయణ వల్ల కలిగే ఫలం (ఫలశృతి), ఈ పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీరాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం మొదలగునవి వివరించబడినవి.

ప్రతి ఆదిత్యవారం (ఆది వారం) ఈ ఆదిత్యహృదయం శ్లోకాలను (7) సప్త ధారావాహిక భాగాలుగా తాత్పర్య సహితముగా మీ అందరికీ పంపడం జరుగుతుంది.

ఈ స్తోత్రములను నియమంతో, పఠించడమో లేక పారాయణమో చేయడం వలన, ఆరోగ్యం ప్రాప్తి మరియు ఎన్నో విషయాలలో విజయాలు సాధించవచ్చునని పెద్దలు చెప్పారు.

ఆదిత్యహృదయం 
1)
తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం!
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం!!

అర్థము:
యుద్ధము చేసి, మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.

2)
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం!
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః!!

అర్థము:
యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి, శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.

అగస్త్య ఉవాచ:
3)
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం!
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి!!

అర్థము :
ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనమునుండి మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.

4)
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం!
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం!!

అర్థము :
ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర విజయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.

No comments:

Post a Comment