June 29, 2020

హర్యష్టకం

హర్యష్టకం


ఆయువు, బలము, ఆరోగ్యము, ఐశ్వర్యము యశస్సు వీటిని పొందడానికి ”హరి” యను రెండక్షరములను పలుకండి. సకల పుణ్యక్షేత్రములు సేవించిన ఫలితము, సర్వతీర్థములలో అవగాహన చేసిన ఫలితము, సకల దానము లొనరించిన ఫలితము, సర్వవేద పారాయణ చేసిన ఫలితము, సర్వ యజ్ఞములు చేసిన ఫలితము తప్పక లభిస్తాయి. అంతేకాదు చివరలో మోక్షమార్గంలో ఆ అక్షరములే మనలిని నడిపిస్తాయి అని శ్రీ ప్రహ్లాదుడు మనకు ఉపదేశించిన
హర్యష్టకము.

హరి ర్హరతి పాపాని దుష్టచిత్తౖ రపి స్మృత: |
అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావక: ||
తాత్పర్యము :
”హరి” యను రెండక్షరములను నోరార పలుక గలిగిన వారికి కలుగు లాభములు ఎన్నియో! వారెట్లు కీర్తింపబడుదురో వివరించు స్తోత్రమిది. నిప్పును తెలియక తాకిననూ కాల్చి తీరును. అట్లే ”హరి” నామము రెండక్షరములే అయిననూ తెలియక పలికిననూ వారి పాపరాశులనన్నింటిని హరించివేయు ప్రభావము కలది. దుష్టులనైనను పవిత్రులను చేయును. ఇక ప్రేమతో పలికిన చెప్పనేల?
స గంగా స గయా సేతు: స కాశీ స చ పుష్కరమ్‌ |
జిహ్వాగ్రే వర్తతే యస్య హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
ఎవని నాలుకపై ”హరి” యను రెండక్షరములు ప్రకాశించునో అతడు గంగవలె పవిత్ర తీర్థుడగును. గయా క్షేత్రమువలె పితృదేవతల కానందమొసగును. సీతను లభించుటకై వానర వీరులు నిర్మించిన సేతువువలె భగవానునికి ప్రీతిపాత్రుడగును. కాశీవలె, అతని సమీపములో ఉన్నంత మాత్రముననే పాపములను తొలగించును. పుష్కరక్షేత్రము వలె సాక్షాత్తు భగవానుని అవతారమేయగును.
వారాణస్యాం కురుక్షేత్రే నైమిశారణ్య ఏవ చ |
యత్కృతం తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
సదా రామనామోపదేశము చేయుచుండు శివుడున్నందున కాశీ క్షేత్రమైనది. అక్కడ చేయు పుణ్యకర్మల వల్ల లభించు ఫలము ”హరి’ యను రెండక్షరముల వల్లే కల్గును. వేద పురాణములను ప్రవర్తింపజేసిన వేద వ్యాసాది ఋషుల శిష్యులు వసించినందున నైమి శారణ్‌ంయ పూజ్యతమమైనది. అంతేకాక అది సాక్షాత్‌ భగవదవతారమే ఆక్షేత్రమున ఆచరించు పుణ్య‌క‌ర్మ‌ల‌ ఫలమంతయు హరి యను రెండక్షరములవల్లనే లభించును. ధర్మక్షేత్రమగు కురుక్షేత్ర మందాచరించు పుణ్య‌క‌ర్మ‌ల‌ వల్ల లభించు ఫలితమంతయు ‘హరి’ యను రెండక్షరముల వల్లనే కలుగునను.

పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ |
తాని సర్వా ణ్యశేషాణి హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
భూప్రదక్షిణలు చేయుట. అందలి పుణ్యతీర్తములందు స్నానమాచరించుట పవిత్రక్షేత్రములను, స్థానములను సంరద్శించుట మొదలగు నవన్నియు ఎంత పుణ్యమును కలిగించునో అదంతయు ‘హరి’ యను రెండక్షరముల తలంపు మాత్రముననే కల్గించును.
గవాం కోటి సహస్రాణి హేమకన్యా సహస్రకమ్‌ |
దత్తం స్యాత్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
లెక్కలేనన్ని గోవులను దానమిచ్చిన వానికి ఏ పుణ్యము లభించునో బంగారు ఆభరణములతో నింపిన వేలాది కన్యలను వివాహముగా దానము చేసినవానికే పుణ్యము లభించునో, అంతటి పుణ్యము ‘హరి’ యన్న వానికి లభించును.
ఋగ్వేదోథ యజుర్వేద: సామవేదో ప్యథర్వణ: |
అధీత స్తేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
ఋక్‌, యజుర్‌, సామ, అధర్వ వేదములను క్రమబద్ధముగ నేర్చిన వాని కెట్టి ఫలితము దక్కునో ‘హరి’ యను రెండక్షరముల ను నోరార పలికిన వాని కంతటి ఫలితము దక్కును.
అశ్వమేధై ర్మహాయజ్ఞై: నరమేధై సథైవ చ |
ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
అనేక అశ్వమేధ మహాయజ్ఞములు, నరమేధములు మొదలగు అపూర్వ యజ్ఞములు చేసినవారి కెంతటి పుణ్యము లభించునో అంతటి ఫలితము ‘హరి’ యను రెండక్షరములు పల్కిన వారికి లభించును.

ప్రాణ ప్రయాణ పాథేయం సంసార వ్యాధి నాశనమ్‌ |
దు:ఖాత్యంత పరిత్రాణం హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
‘హరి’ యను రెండక్షరములను యిప్పుడు పలికినచో జీవుడు దేహము వీడి బయలు దేరునపుడు మోక్షము చేరువరకూ దారి భత్యముగ అవియే పోషించును. కర్మ చేయించి సంసార చక్రమున కూలద్రోయ ‘అహంకారము’ ను ‘హరి’ యను రెండక్షరములే హరించును. దు:ఖములకు మూలకారణమగు రజోగుణము దాని వికారముల నుండి ‘హరి’ యను రెండక్షరములే కాపాడును.
బద్ధ: పరికర స్తేన మోక్షాయ గమం ప్రతి |
సకృ దుచ్చారితం యేన హరి రిత్యక్షర ద్వయమ్‌ ||
తాత్పర్యము :
మోక్షమార్గమున పయనించుట కవసరమగు సాధన సామాగ్రియంతయు శ్రమపడి కూడబెట్టనవసరము లేదు. ‘హరి’ యను రెండక్షరముల నొకసారి పలికినచో అవియే అన్నింటిని సిద్ధము చేసి పెట్టగలవు.
ఫలశ్రుతి
హర్యాష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ య: పఠేత్‌ |
ఆయుష్యం బల మారోగ్యం యశో వృద్ధి శ్శ్రియావహమ్‌ ||
తాత్పర్యము :
హర్యష్టక మను ఈ పుణ్య స్వరూపమగు స్తోత్రమును వేకువనే లేచి అనుసంధించువానికి ఆయువు పెరుగును. సత్కార్య నిర్వహణ కనువగు లము ల భించును. స్థిరమగు ఆరోగ్యము కలుగును. అట్టి హరి భక్తుని కీర్తి జగమంత వ్యాపించును. ఐశ్వర్యవంతుడగును.
ప్రహ్లాదేన కృతం స్తోత్రం దు:ఖ సాగర శోషణమ్‌ |
య: పఠేత్‌ స నరో యాతి తద్విష్ణో: పరమం పదమ్‌ ||
తాత్పర్యము :
లోతు, అంతు తెలియని జలసారమువలె, దు:ఖములు కూడ అనంతములు. అట్టివాటి నన్నింటిని ఎండింపజేయు సామర్థ్యము ‘హర్యష్టకము’నకు కలదు. ఎవరీ స్తోత్రమును పఠింతురో అట్టివారికి వైకుంఠప్రాప్తి దేహావసానమున నిశ్చయముగ లభించును.

No comments:

Post a Comment