January 30, 2014

గోపికల రథము పై సింహాద్రి అప్పన్న తిరువీధి ఫోటోలు

గోపికల రథము పై సింహాద్రి అప్పన్న తిరువీధి ఫోటోలు 











సింహాద్రి అప్పన్న తెప్పోత్సవ చిత్రాలు

సింహాద్రి అప్పన్న తెప్పోత్సవ చిత్రాలు 







తిరువళ్ళూరు --- శ్రీ వీరరాఘవేంద్ర స్వామి -- పుష్య బహుళ అమావాస్య

తిరువళ్ళూరు శ్రీ వీరరాఘవేంద్ర స్వామి - పుష్య బహుళ అమావాస్య


త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో...వివిధ పేర్లతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలకు ‘దివ్యతిరుపతులు ’, ‘దివ్య దేశములు’ అని పేరు. మొత్తం 108 దివ్య తిరుపతులు వున్నాయి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరువళ్ళూరు’లో శ్రీ మహావిష్ణువ ‘శ్రీవీరరాఘవస్వామి’ పేరుతో శయనరూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటున్నాడు

కృతయుగంలో బదరికాశ్రమంలో ‘పురుపుణ్యర్’ అనే మహర్షి నివసిస్తుండేవాడు. ఆయన భార్య సత్యవతి. శ్రీ మహావిష్ణువు భక్తులైన ఈ దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదు. దీనితో వారు పుత్ర సంతానం కోరుతూ ఒక సంవత్సర కాలం పుత్రకామేష్టీ యాగం చేసారు. ఫలితంగా వీరికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించగా, శ్రీ మహావిష్ణువు ప్రసాదంగా భావించిన ఆ పిల్లవాడికి ‘శాలిహోత్రుడు’ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. తల్లిదండ్రుల మాదిరే శాలిహోత్రుడికీ చిన్నతనంనుంచే విష్ణు భక్తి  అలవడింది.

అటువంటి శాలిహోత్రుడు యుక్తవయసు రాగానే దేశ పర్యటనకు బయలుదేరి దేశంలోని పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటూ ప్రస్తుతం ‘తిరువళ్ళూరు’ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి ‘హృత్తాపనాశని’ తీర్ధం చూసి...అది ఎంతో పవిత్రమైనదని గుర్తించి, అందులో స్నానమాచరించి, దైవప్రార్దనలు చేసాడు. ఈ సమయంలో ఇక్కడే వుండి తపస్సు చేయాలనే కోరికతో తపస్సును ప్రారంభించాడు. ఒక సంవత్సరం పాటు తపస్సు, యజ్ఞయాగాలు చేసాడు. సంవత్సరం పూర్తవుతూనే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాడు. అనంతరం నైవేద్యాన్ని మూడు భాగాలు చేసాడు. ఒక భాగాన్ని దేవునికి సమర్పించాడు.  ఇక రెండో భాగాన్ని ఆహుతుడి కొరకు, మూడవ భాగాన్ని తనకోసం వుంచుకుని ఆహుతుడి కోసం ఎదురు చూడసాగాడు. ఈలోగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ దారిన వెడుతూ కనిపించడంతో దేవుడుపంపిన ఆహుతుడుగా భావించిన శాలిహోత్రుడు ఆ వృద్ధుడిని ఆహ్వానించి ఆహుతుడి కోసం వుంచిన ప్రసాదాన్ని వడ్డించాడు. దానిని భుజించిన వృద్ధుడు తనకు ఆకలి తీరలేదని తెలపడంతో శాలిహోత్రుడు తనకోసం వుంచుకున్న భాగాన్ని కూడా ఆయనకే వడ్డించాడు. ఆయన తృప్తిగా భుజించి వెళ్లిపోయాడు. అయితే శాలిహోత్రుడికి మాత్రం ప్రసాదం లభించలేదు. దానితో తన తపస్సులో ఏదో లోపం వుండడంవల్లనే తనకు ప్రసాదం లభించలేదని భావించిన శాలిహోత్రుడు మరో సంవత్సరం పాటు తపస్సు చేసాడు. కానీ ఇంతకుముందులాగా ఒక పండు ముసలి బ్రాహ్మణుడు ఆశ్రమానికి రాగా...ఆయనను సాదరంగా ఆహ్వానించి ప్రసాదాన్ని వడ్డించాడు. శాలిహోత్రుడు వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా భుజించిన ఆయన ‘‘నాకు భుక్తాయాసంగా వుంది. ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి?’’ అని శాలిహోత్రుడిని అడగ్గా... ‘‘ఇక్కడనే పవళించండి’’ అని శాలిహోత్రుడు సమాధానం ఇచ్చాడు. దీనితో బ్రాహ్మణుడు దక్షిణంవైపు తలపెట్టి, ఉత్తరంవైపు కాళ్లు వుంచి తూర్పువైపు చూస్తూ పవళించాడు. ఈ విధంగా పవళించిన ఆయనకు బ్రాహ్మణుడి రూపం పోయి శ్రీ మహావిష్ణువు రూపం ప్రత్యక్షం అవడంతో శాలిహోత్రుడు సంతోషించి పరిపరి విధాలుగా స్వామివారిని ప్రార్ధించాడు.

శాలిహోత్రుని కోరిక ప్రకారం తాను విశ్రాంతికోసం పవళించిన శయన రూపంలోనే ‘శ్రీ వీర రాఘవస్వామి’గా కొలువుతీరినట్టు స్థలపురాణ కథనం. అత్యంత ప్రాచీన కాలంనుంచే వున్న ఈ ఆలయాన్ని క్రీశ 8,9 శతాబ్దాల కాలంలో పునర్నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. చోళ వంశస్తులు ఈ ఆలయాన్ని వివిధ మండపాలను నిర్మింపచేసారు. తర్వాతి కాలంలో విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్టు చరిత్ర చెప్తోంది.

ప్రధాన గర్భాలయంలో ఐదు శిరస్సుల శేషతల్పంపై శ్రీ వీరరాఘవస్వామివారు శయనించి దర్శనమిస్తారు. భారీ రూపంతో ద్విభుజాలతో కొలువుతీరివున్న స్వామివారు ఒక చేయిని కిందికి ముని శిరస్సుపై వుంచి మరోచేయి పైకి ఎత్తి గర్భాలయ వెనక గోడకు ఆనించి దర్శనమిస్తారు. స్వామివారి తలకు దగ్గర శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటాడు. స్వామివారి గర్భాలయంపై వున్న గోపురం విభిన్నంగా ఉంటుంది. మామూలుగా గర్భాలయాలపై ఏక కలశ గోపురం వుంటుంది. అయితే ఈ క్షేత్రంలో గాలిగోపురం లాగా ఐదు కలశాలను కలిగిన గోపురంవుండడం విశేషం.  తిరువళ్లూరులోని శ్రీ వీరరాఘవస్వామికి ఉప్పు, మిరియాలు అంటే ప్రీతి. శ్రీ వీరరాఘవస్వామి వారిని దర్శించి ఉప్పు, మిరియాలను సమర్పించడంవల్ల వివిధ వ్యాధులు ప్రధానంగా చర్మవ్యాధులు నయమవుతాయని చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెబుతూ ఉంటారు.


కోరిన కోర్కెలు తీర్చే స్వామి శ్రీ వీరరాఘవేంద్ర స్వామి. పుత్రసంతానము లేని వారు పుష్య బహుళ అమావాస్య నాడు వరిపిండి మరియు బెల్లంతో కూడిన చలివిడి చేసి, ఆ చలివిడి మధ్యలో ఆవునెయ్యి - ప్రత్తితో దీపం వెలిగించి, ఆ దీపం ఘనం అయ్యాక ముగ్గురు లేక మన స్థోమతను బట్టి కొంతమంది ముత్తైదువులకు దక్షిణ - తాంబూలాలను ఇచ్చుకోవాలి. దీపము వెలిగించిన వత్తిని చలివిడి లేక పాలు లేక నీళ్ళతో మింగినట్లయితే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నానుడి. పిల్లలు లేనివారికి ఇచ్చిన పుణ్యమే. పిల్లలు ఉన్నవారు మింగితే కడుపుచలువ అంటారు. 

       
'వీరరాఘవుడు' ని 'వైద్య రాఘవుడు' అని కూడా అంటారు. రాఘవేంద్రుడు ఔషధుల మూటని తన తలక్రింద ఉంచుకొని పడుకుంటాడని, బాధలతో (అనారోగ్యంగా) ఉన్నవారు అతనిని కొలిస్తే, వారి బాధలని తొలగించుతాడు అని అంటారు. 

పుష్యబహుళ అమావాస్య రోజున మరొక విశేషము ఉంది. ఈరోజున సింహాచలంలో వెలసిన లక్ష్మీ వరాహ నృసింహ స్వామికి కొండ దిగువనున్న వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. దీనినే 'తెప్ప తిరునాళ్ళు' అని కూడా అంటారు. సింహాద్రి అప్పన్న శ్రీకృష్ణుని అలంకరణలో, ఉభయ దేవేరులతో కలసి తెప్పలో వాహ్యాళి చేసి, అనంతరం గోపికల రథంపై కొండ దిగువున తిరువీధి తిరిగుతాడు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.

              

January 29, 2014

మత్స్య జయంతి

మత్స్య జయంతి 



పరీక్షిత్తు మహారాజు మహావిష్ణువు యొక్క అవతార విశేషములు తెలుసుకునే ఉత్సుకతతో ..... విష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం గూర్చి వివరించమని శుకబ్రహ్మను కోరగా నైమిశారణ్యంలో సూతమహర్షి శౌనకాది మునులకు ఈవిధంగా వివరిస్తున్నాడు.  భగవానుడు గోవులను, బ్రాహ్మణులను, దేవతలను, సాధువులను, వేదములను ధర్మమును రక్షించుటకై అవతారములను ధరిస్తూఉంటాడు. భగవానుడు ఏ రూపమును ధరించినా ఆ రూపము యొక్క గుణ దోషములు తనకు అంటవు.


ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములు  ప్రసిద్ధమైనది. మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. భగవంతుని దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు.

బ్రహ్మకు ఒక పగలు అంటే - వెయ్యి మహాయుగాలు ....  గడిస్తే  ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగ చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని 'కల్పం' అని అంటారు.

వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెల్లి స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలలోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది "రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు" అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు ... ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతట ఆ మత్స్యం "తాను శ్రీమన్నారాయణుడుని  అని, ఏడు రోజులలో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయి అని, ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని" పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి, అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.






 
మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి, ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి, 'వైవస్వత మనువు' గ ప్రశిద్ధికెక్కాడు.




బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు  నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా,  "సొమకాసురుడు" అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి, సముద్రగర్భంలోకి  వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా, అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి,, అతని కడుపుని చీల్చి ......  వేదాలను - దక్షిణావర్త శంఖాన్ని తీసుకొని, బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తానూ తీసుకొని, శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.



వేదాలను అపహరించటం అంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకారశక్తిని తనలో లయం చేసుకోవటం అని సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృస్టికార్య  ప్రతిబంధరూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందటమే వేదాలు మరల గ్రహించటం అని తత్వార్థం. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి.


మత్స్య జయంతి  చైత్ర బహుళ పంచమి రోజు జరుగుతుంది.      
                                                         

January 23, 2014

రథసప్తమి

రథసప్తమి



సూర్యుడు మాఘశుక్ల పక్షం అశ్వనీ నక్షత్రయుక్త ఆదివారం, సప్తమి తిథిన దక్ష ప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి, కశ్యపులకు పుత్రుడైనందున ఆదిత్యుడని, కశ్యపుడని వ్యవహరిస్తారు.

విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ సూర్యునికి భార్య. ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున - యముడు అనే కవలలు జన్మించారు. సంజ్ఞ తనకు మారుగా ఛాయను సృజించి, కొంత కాలము భర్తకు దూరంగా ఉన్నసమయంలో సూర్యుడు ఆ ఛాయనే సంజ్ఞగా భావించడం చేత ఆమె వల్ల సూర్యునికి శనైశ్చరుడు(శని)  జన్మించాడు.

తాను ఉదయించి జగతిని చైతన్యపరచేవాడు, తన స్పర్శతో ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, గతి తప్పని నిరంతర గమనశీలి, సమయపాలనకు చక్కని నిర్వచనంగా చెప్పదగినవాడు --- సూర్యభగవానుడు. 'సూర్య' అనే పదానికి 'ప్రేరేపించువాడు' అని అర్థము. చరాచర జగత్తు అంతా ప్రేరణ పొందేది, తమతమ కర్తవ్యాలను నిరాటంకంగా నిర్వహించే శక్తిని గ్రహించేదీ -- సూర్యుని ఉనికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే. అందుకే సూర్యుడిని 'కర్మసాక్షి' అని అంటారు. సూర్యుని జన్మతిథి 'మాఘశుక్ల సప్తమి' . ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారంగా కలిగి ఉంటాయంట. అందుకే ఈరోజుని రథసప్తమి అని అంటారని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యునికి... సప్త (ఏడు) సంఖ్యకు చాలా దగ్గర సంబంధం ఉన్నదంట. సూర్యుని జన్మతిథి సప్తమి, అతని రథానికి గుర్రాలు ఏడు, అతని పయనం సప్తద్వీప పర్యంతం, అతని కిరణాలలో ఉండే కాంతి యొక్క రంగులు ఏడు రంగులతో కూడుకొని ఉండే సమాహారం. అతని వెలుగులు సప్తసముద్రాలు దాటుతాయి. అందుకే సూర్యభగవానుని సప్తలోక ప్రదీపునిగా అందరూ స్తుతిస్తారు.

సూర్యుని ఏడు కిరణాల పేర్లు
1) సుషుమ్నo   2)హరికేశు  3) విశ్వకర్మ  4) విశ్వవ్యచ  5) సంపద్వసు  6) అర్వాదము  7) స్వరాడ్వసు  


భారతీయులకు శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్తకిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. 
సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.

సౌరకుటుంబములో అన్ని గ్రహాలకు సూర్యుడే ఆధారం. సూర్యకాంతి వల్లనే స్వయం ప్రకాశం లేని చంద్రుడు, నక్షత్రాలు,  గ్రహాలు మొదలైనవి ప్రకాశిస్తున్నాయి. జీవుల యొక్క సృష్టి - స్థితి - లయలకు ఆధారం సూర్యుడే అని కొన్ని పురాణాలు తెలియచేస్తున్నాయి. విజ్ఞానశాస్త్ర దృష్ట్యా గమనించినట్లయితే ఈమాట నిజమే అని అనిపిస్తుంది. సూర్యుని చుట్టూ నిరంతరం అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రాణి పుట్టుటకు, ఉనికికి, ఆధారమైన నీరు ఉన్నది --- ఒక్క భూగ్రహం మీదనే. ఆ నీటినుంచే ప్రాణికోటి ఆవిర్భవించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల సృష్టికి ఆధారం సూర్యుడే అని మనకు తెలుస్తుంది.

సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘ శుద్ధ సప్తమినాడు, సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథ సప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు. సూర్యుడే లేకపోతే లోకమే చీకటిమయంగా ఉంటుంది.       

కాలగణనలో ఒక్కొక్క మనువు పేరుతో ఒక్కొక్క  మన్వంతరం ఉంది. వాటిల్లో ముఖ్యమైనది ప్రస్తుతం జరుగుతున్నది -- వైవస్వత మన్వంతరం. ఈ పేరుకు మూలాధారుడైన వైవస్వత మనువు, వివస్వంతు(సూర్యు)ని కుమారుడే. తండ్రి జన్మదినమైన రథసప్తమి రోజునే ఈ మన్వంతరం మొదలై అమలులోకి వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి. 

ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఈ పన్నెండు నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో చెప్పబడింది.

ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని సూర్యునివల్లే జీవజాలమంతా ఆరోగ్యం పొందుతుందని మనకందరికి తెలుసును. సూర్యుని లేలేత కిరణాలు శరీరాన్ని తాలితె తేజస్సు పెరుగుతుంది - అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అందుకే అనునిత్యం ఆదిత్యహృదయం చదవటం, సంధ్యావందనం ఆచరించటం, సూర్యనమస్కారాలు చేయటం, అర్ఘ్య ప్రదానం ఇవ్వటం వంటివి సూర్యుని ఎదురుగా నిలబడి చెయ్యాలి అని శాస్త్రాలు చాటుతున్నాయి, మన పెద్దలు చెబుతున్నారు. ఏదోఒక మిషతో నీరెండలో నిలబడటం ఆరోగ్యప్రదము అంటున్న విజ్ఞాన శాస్త్రం ఈ విషయాన్ని బలపరుస్తోంది. విదేశీయులు కూడా సూర్యస్నానం పేరుతొ నీరెండలో నిలబడుట ఆంతర్యం ఇదే. సూర్య భగవానుని ఈ రోజుల్లో ఆరాధించడం ఆరోగ్యాన్ని-ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ మాసమంతా నియమంగా సూర్యుని ఆరాధిస్తూ, ప్రతి ఆదివారం ఉదయాన్నే శుచిగా క్షీరాన్నం (పాయసాన్నం) వండి సూర్యునికి అర్చించాలి.

రథసప్తమి నాడు పాటించవలసిన విధులు
రథ సప్తమినాడు ఆవు నేతితో దీపారాధన చెయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, పిడకలను వెలిగించి పాలు పొంగించి, ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయి.


రథసప్తమి రోజున ఆచరించే అనేక కర్మలలోని మర్మం -- ఆరోగ్యానికి చాలా సూత్రాలు దాగి ఉన్నాయి. వాటిల్లో మొదటిగా ----- షష్ఠి నాడు రాత్రి ఉపవాసం చేసి,  సప్తమినాడు సూర్యోదయమున స్నానచేసినట్లైతే, ఏడు జన్మల పాపములు తొలగిపోయి, రోగశోకములు నశించి పోతాయని విశ్వాసం. ప్రాతఃకాలములోనే స్నానమాచరించి సూర్యుని ధ్యానిస్తూ రాగి, వెండి, మట్టి ప్రమిదలలో, దేనిలోనైనా నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి, దీపజ్యోతులను తలపై పెట్టుకుని నదీ జలాల్లో గానీ, మనకు దగ్గరగా కాలువలో పారే జలాల్లోగానీ తటాకాదులకు గాని, వెళ్లి సూర్యుని ధ్యానించి, ఆ దీపమును నీటిలో వదిలి, రేగుపండు కాని , ఆకు కాని ..... జిల్లేడు ఆకులు కలిపి తలమీద పెట్టుకొని స్నానం చెయ్యాలి. ఈవిధంగా చెయ్యటం వలన సూర్యుని కిరణాలలోని ఆరోగ్య కారక లక్షణాలను, శక్తిని గ్రహించి శరీరానికి అందించే గుణం ఉందని ఆయుర్వేద నిర్వచనం. ప్రతీరోజూ ఈవిధంగా చేసినట్లయితే చాలా మంచిది. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కనుక సూర్యజయంతి రోజున అర్క (జిల్లేడు) పత్రం శిరస్సు మీద ధరించి,
|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే,
సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే || 
("సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థం.)
అని ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేసినట్లయితే, శుభ ఫలితాలు కలుగుతాయి - అని మన పెద్దల ఉవాచ. 

రెండవది ----- పాయసాన్ని నివేదన చెయ్యటం. ఈరోజు కొత్తబియ్యం + కొత్త బెల్లం కలిపి సూర్య కిరణాలు ప్రసరించే ప్రదేశంలో ఆవుపాలతో పాయసం వండుతారు. దాన్ని చిక్కుడు ఆకులమీద ఉంచి సూర్యునికి నివేదన చేస్తారు. అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు. రథసప్తమి నాడు సూర్యకిరణాలలో ఉన్నశక్తి ఆ పాయసంలో చేరి, ఔషధగుణాలు కలిగి చిక్కుడు ఆకులతో కలిగిన రసాయనిక చర్యవల్ల ఆ ప్రసాదం తిన్నవారికి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. 
మూడవది ---- సూర్యుణ్ణి స్తుతించే 'అరుణం' 'మహాశౌరం' వంటివి చదవటం వలన ఆ ధ్వనితరంగాలు పరిసర ప్రాంతాలలో వ్యాప్తిచెంది, ఆ ప్రదేశమంతా ఆరోగ్య వాతావరణం కలిగి ఉంటుంది మన పెద్దల భావన. 

ఇప్పుడు కాలం మారింది దానికి అనుగుణంగా మనం కూడా మారాల్సివచ్చింది. పొయ్యలు పోయి, గ్యాస్ స్టవ్ లు వచ్చాయి కాబట్టి వాటినే ముందుగా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుపాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టవచ్చు. రథసప్తమి నాడు దేముడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. 

వేదవిహితమైన గాయత్రీమంత్రం, ఋగ్వేదంలోని మహాశౌరం పేరున రుక్కులు, వాల్మీకి రామాయణంలో ఆదిత్యహృదయం, భారత భాగవతాలలోని సూర్య స్తుతులు ..... ఇవి అన్నీ సూర్యుని గొప్పతనాన్ని మహిమలను చాటి మనకి తెలియచేస్తున్నాయి. 


నవగ్రహలలోఅగ్రస్థానం సూర్యునిదే. దేశాలు, ప్రాంతాలు, ఆచారాలు, ఆరాధనా విధానాలు వేర్వేరుగా ఉన్న చాలా ఎక్కువ దేశాల ప్రజలు దేవుడు అని నమ్మేది, ఒప్పుకునేది, ఆరాధించి పూజించేది సూర్యభగవానుడినే. సూర్యుడు మనకందరికీ ప్రత్యక్షదైవం.   

సూర్యుడు ఆరోగ్య ప్రదాత, యోగాసనం, ప్రాణాయామం మరియు చక్రద్యానం కూడుకొని చేసే సంపూర్ణసాధనే సుర్యనమస్కారములు. బ్రహ్మముహుర్తంలో చేస్తే మంచి ఫలితాలని ఇస్తాయి. సూర్య నమస్కారములలో 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలని జపిస్తూ సుర్యనమస్కారములు చేస్తే ఆరోగ్యానికి మంచిది. సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖముగా నిలబడి సుర్యనమస్కారములు చేయాలి. సూర్య నమస్కారముల వలన ఊపిరితిత్తులు, నాడీమండలం, జీర్ణశక్తి మొదలయిన అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సక్రమంగా జరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కళ్ళ సమస్యలు ఉన్నవారు సూర్యదేవుని ఆరాధిస్తే సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం ఆదిత్య హృదయం సుర్యభగావానునికి సంబదించిన స్తోత్రం. రామాయణం యుద్దకాండలో శ్రీరాముడు అలసట పొందినపుడు అగస్త్యమహర్షి యుద్దస్థలమునకు వచ్చి ఆదిత్య హృదయం ఆనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశం అయిన పిమ్మట శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. 

భారత దేశంలో సూర్యునికి అనేక ప్రాంతాలలో సూర్య దేవాలయాలు ఉన్నాయి, ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయం ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయాన్ని గంగవంశం రాజు అయిన నరసింహ వర్మ నిర్మించారు. గుజరాత్ లోఅని మొధిర ప్రాంతంలో సూర్యదేవాలయం క్రి.శ.1026 సంవత్సరంలో భీం దేవ్ అనే రాజు ఈ దేవాలయాన్ని నిర్మిచారు. ఇంకా మన దేశంలో కొన్ని ప్రాంతాలలో కూడా సూర్యదేవాలయాలు ఉండేవి. ముస్లింల పరిపాలనలో అవి నేలమట్టం కాబడ్డాయి. మన రాష్ర్టంలో కుడా సూర్యదేవాలయం కలదు. శ్రీకాకుళం పట్టణానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో అరసవల్లి అనే గ్రామంలో సూర్యదేవాలయం కలదు. పూర్వం ఈ ప్రాంతాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. కాల క్రమేణా అరసవల్లి గా ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయం ప్రాచినమైనది. ఇక్కడ లభించిన శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రి.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడినదని తెలుస్తున్నది. క్రి.శ.17వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం నవాబు పరిపాలన కిందకు వచ్చింది. “షేర్ మహమ్మద్ఖాన్ అనే అతడు ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డారు. అతడు ఇక్కడ దేవాలయాలను ఎన్నింటినో ధ్వంసం చేసాడు. అలా ద్వంసం చేయబడిన దేవాలయాలలో అరసవల్లి దేవాలయం కుడా ఒకటి. క్రి.శ. 1778 లో ఎలమంచిలి పుల్లాజి పంతులు అనే ఆయన పూర్వం నిర్మింపబడిన చోటనే మళ్ళీ ఆలయాన్ని పునరుద్దరించి విగ్రహాలని వెలికితీసి ఆ దేవాలయంలో ప్రతిష్టించాడు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం అదే. ఈరోజున సూర్యోదయ సమయంలో  అరసవిల్లిలో వెలసిన సూర్యనారాయణుని విగ్రహంపైన సూర్యకిరణాలు పడతాయి. ఇది మనకు భగవంతునిపై ఉన్న నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనం.  సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రమే సూర్యకిరణాలు స్వామిపై పడతాయి.  



కోణార్క్ లోని సూర్య దేవాలయంలో రథ సప్తమిని పురస్కరించుకుని మహా వైభవోపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోణార్క్ లో జరిగే ఈ రథోత్సవాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు తండోపతండాలుగా వస్తారు.


రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో శ్రీనివాసునికి ఈ రోజున ఏడు వాహనాల సేవలను టిటిడి పాలకమండలి నిర్వహించి తిరుమాడ వీథులలో ఊరేగిస్తారు. దీనినే ఒక్కరోజు బ్రహ్మొత్సవంగా కూడా అంటుంటారు. 
వాటి వివరాలు ఇలా ఉన్నాయి ... 
ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు 
ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనంపై ఊరేగిస్తారు 
ఉదయం 11 గంటలకు గరుడ వాహనంపై ఊరేగిస్తారు 
మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనంపై ఊరేగిస్తారు 
మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు 
మధ్యాహ్నం 4 గంటలకు కల్పవృక్ష వాహనంపై ఊరేగిస్తారు
 
సాయంత్రం 6 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు 
సాయంత్రం 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు.
                                           రథసప్తమి యొక్క కథ :--
మన్వంతరము ప్రారంభమున సూర్యుడు మాఘ శుద్ధ సప్తమి రోజున తన రథమును ఎక్కి ఆకాశసంచారము ప్రారంభించాడు. అందువల్ల కాలచక్రము పరిభ్రమించుటకు కారణమైన సూర్యుని పూజించిన, వ్రతము - జపము - దానము మొదలగునవి చేసిన విశేషఫలితాలని ఇస్తాయి. 

పూర్వము యశోవర్మ అనే రాజుకు అంగవైకల్యముతో ఒక కొడుకు పుట్టెను. రాజుకు కొడుకు పుట్టినందుకు సంతోషము కలిగిన ...... అంగవైకల్యముతో ఉన్నందుకు బాధపడి, పండితులని పిలచి విచారించగా వారు ఈ విధంగా చెప్పిరి. "రాజా ! నీకుమారుడు గతజన్మలో ధనవంతుడు కానీ లోభత్వముతో ఉండెడివాడు. ఒక రోజున పక్కింటివారు రథసప్తమి వ్రతమును చేస్తుండగా చూసి, ప్రసాదమును స్వీకరించాడు. అందువల్ల అతను రాకుమరునిగా జన్మించాడు. కానీ దానము చేయక లోభత్వముతో ఉండిన వాడు కనుక అంగవైకల్యమును పొందాడు. ఇప్పుడు మీరు ఇతనితో రథసప్తమి వ్రతమును చేయించినచో తగు ఫలితము లభించును." అని చెప్పిరి. రాజు వారు చెప్పినట్లే తన కుమారునిచే రథసప్తమీ వ్రతమును చేయించెను. కొద్దికాలానికి రాకుమారునికి వైకల్యము తొలగిపోయి, పూర్తి ఆరోగ్యవంతుడయ్యెను.  

ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని పురాణ ప్రబోధము. ఆరోగ్యప్రదాత అయిన ప్రత్యక్ష నారాయణుని సూర్యభగవానుడుని  కొలిచి సర్వజనులు ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తూ
                                    సర్వేజనా సుఖినోభవంతు        

         
                                                           అరసవిల్లి కోవెల

January 21, 2014

హోలీ పండుగ ...... హోలీ పౌర్ణమి

హోలీ పండుగ ...... హోలీ పౌర్ణమి


దేశమంతా వేర్వేరు రూపాల్లో, వేర్వేరు కారణాలతో, రకరకాలుగా ఉత్సవాలు జరుపుకునే వాటిల్లో హోలీ పండుగ ఒకటి. త్రిమూర్తులను దంపతసహితంగా పూజించే రోజు ఒకే ఒక్కరోజు. అదే ఫాల్గుణ పౌర్ణమి (హోలీ పున్నమి). 

ఫాల్గుణోత్సవం, కళ్యాణ పూర్ణిమ, డోలాపున్నమి, హుతశనీపూర్ణిమ, కాముని పున్నమి, అనంగపూర్ణిమ, హోళికాదహో, హోళికాపూర్ణిమ, వసంతపూర్ణిమ, హోలీ ----- ఇలా రకరకాల పేర్లతో పిలవబడిన, అవన్నీ ఒక్కటే, అదే హోలీ పండుగ. ఈరోజు జరిపే కార్యక్రమాలు, అనుసరించే ఆచారాలు, జరిపే పూజలు అన్నీ భిన్నమైనవే. అన్నింటి వెనుకా ఆనందంతో పాటు, ఆరోగ్య భావన, ఆధ్యాత్మిక తత్త్వం, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో అనేక కథనాలు దాగిఉన్నాయి. 

శివపార్వతులను కలిపే ప్రయత్నంలో మదనుడు శివుని ఆగ్రహానికి గురై దహనమయ్యాడు. అతని భార్య రతీదేవి అభ్యర్థన చేసిన మీదట, ఆమెకు మాత్రమే సశరీరునిగా, మిగిలిన వారికి అనంగునడిగా ... తిరిగి లేచిన రోజు ఫాల్గుణ పౌర్ణమి. కనుక ఈరోజుని 'కాముని పున్నమి' - 'అనంగ పూర్ణిమ' అనే పేర్లు వచ్చాయని మనకు పురాణాలు వివరిస్తున్నాయి. 



ఉత్తరాంధ్రా ప్రాంతాలలో శివాలయాల్లో శివపార్వతులను (విగ్రహాలను) డోలిక (ఉయ్యాల) లో వేసి ఊపుతూ ఉత్సవం జరుపుతారు. బృందావనంలో బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి ఊపుతూ, రంగులు చల్లుకుంటూ ఉత్సవం చేస్తారు. ఈ రెండు కారణాల వలన 'డోలా పూర్ణిమ' అనే పేరు వచ్చింది. 

మధుర మీనాక్షిదేవి తపస్సు చేసి, సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్నరోజు ఫాల్గుణ పౌర్ణమి.కనుక దక్షిణాది దేవాలయాలలో ఈరోజుని కళ్యాణ (లక్ష్మీనారాయణ) వ్రతం చేస్తారు. అందుకే కళ్యాణ పూర్ణిమ అనే పేరు వచ్చిందని విష్ణుపురాణం తెలియచేస్తుంది. 


ఉత్తర హిందూప్రాంతంలో వసంతఋతువు ఆగమనాన్ని స్వాగతిస్తూ సృష్టికర్త అయిన బ్రహ్మను, జ్ఞానప్రదాత్రి అయిన సరస్వతిదేవిని పూజిస్తారు. దీనినే ఫాల్గుణోత్సవం అని అంటారు. ఆ మరుసటిదినం (ఫాల్గుణ బహుళ పాడ్యమి) చంద్రమానం ఆచరించేవారికి కొత్త సంవత్సరాది. కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతూ, సంతోషాలని వ్యక్తం చేసుకునేందుకే ఒకరిపైఒకరు రంగుల పొడులు, రంగునీళ్ళు జల్లుకుంటూ "హోలీ హోలీ రెరంగ హోలీ చమకేళిర హోలీ" అని పాడుతారు. ఈపాటకి భావం ---- "మోదుగపూలు తెచ్చి రోట్లో దంచి, కుండలో వేసి, రసం తీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. (ఆ రసం ఎర్రగా ఉంటుంది). దీనికి వసంతం అని పేరు. దాన్ని వారు వావి వరుసలు చూడకుండా (పాటించకుండా) అందరూ ఒకరిపై ఒకరు జల్లుకొవాలని" దాని అర్థం. మోదుగపూలు దంచగా కషాయం ఈమాస వాతావరణంలో ఒంటిమీద పడటం వలన శరీరానికి కాంతి, వర్ఛస్సు ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. శరీరంలో కలిగే ఉద్రేకాలు (రక్తపోటు వంటివి) మానసిక దుర్వికారాలు వంటివి తగ్గుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది.