March 28, 2014

తెనాలిరామలింగ కథ

తెనాలిరామలింగ కథ

నల్లకుక్కను కర్రిఆవుగా చేయుట---

తెనలిరామలింగ కవి అంటే తెలియనివారు ఎవరూ ఉండరు కదా ? అతని కథలు మనకు హాస్యాన్ని తెప్పిస్తాయి, ఆలోచింపచేస్తాయి కూడా. అటువంటి కథలలో ఒకటి మనం ఈ రోజు చెప్పుకుందాము.    

శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానములో చాలాకాలం నుండి విశ్వాసపాత్రుడు, పనిలో నైపుణ్యం కలవాడు అయిన ఒక మంగలివాడు ఉండేవాడు. ఆ మంగలివాడు ఎప్పుడూ దైవభక్తి కలిగి సదాచారపరాయణుడై కాలం గడుపుతూ ఉండేవాడు. అతని విశ్వాసము చూసి రాయలువారికి ముచ్చటవేసి "ఒరేయ్ అబ్బీ ! నీకేమి కావాలో కోరుకో" అని అన్నారు. అప్పుడామంగలి "మహాప్రభో ! నేను చిన్నప్పటినుండి నిష్టాగరిష్టుడనై భక్తిశ్రద్ధలతో ఎన్నో పూజలూ, నోములు చేశాను. నన్ను ఎలాగైనా బ్రాహ్మణునిగా మార్చండి" అని రాయలవారిని బ్రతిమాలాడు. రాయలువారు సరేయని రాజపురోహితులను పిలచి ఇతనిని బ్రాహ్మణునిగా మార్చండి అని ఆజ్ఞాపించెను.

రాజపురోహితులు తెల్లబోయి, అడ్డుచేబితే రాజు ఎక్కడ దండనవిధిస్తాడో అని భయపడి, ఆ మంగలిని ప్రతీరోజు నది ఒడ్డుకు తీసుకువెళ్ళి, హొమాదిజపములు చేయిస్తూ, మంత్రోచ్ఛారణ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సంగతి ఒకరోజు తెనలిరమలింగనికి తెలిసింది. ఒక రోజు అతడు కూడా ఒక నల్లకుక్కను వెంటబెట్టుకుని నదిఒడ్డుకి వెళ్ళి, కుక్కను నీటిలో ముంచుతూ, కొన్ని బీజాక్షరాలను చదువుతూ ఉన్నాడు.

మంగలిని బ్రాహ్మణునిగా ఎంతవరకు మార్చారో తెలుసుకుందాము అని రాయలవారు ఒకరోజు నదిఒడ్డుకి వచ్చారు.  నది ఒడ్డున---- ఒకపక్క రాజపురోహితులు మంగలిని, మరోపక్క రామలింగడు కుక్కని నీటిలో ముంచుతూ మంత్రాలూ చదవటం చూసారు. ఆ రెండు దృశ్యాలు చూసి, రామకృష్ణుని అవస్థ చూసి రాయలు వారు పకపక నవ్వి రామలింగడిని ఇలా ప్రశ్నించారు, " ఓయీ రామకృష్ణా ! నేకేమైన పిచ్చిపట్టినదా, కుక్క-- కుక్కే గానీ--- కర్రిఆవు ఎలా అవుతుందీ" అని. అంతట  రామకృష్ణుడు రాయలవారిని " పిచ్చి నాకు కాదు మీకే, లేకపోతే మంగలి బ్రాహ్మణుడు ఐతే, కుక్క గోవుగా ఎందుకు మారకూడదు ?"... అని ఎదురుప్రశ్న వేసెను.

ఆమాటకు రాయలవారికి జ్ఞానోదయం అయ్యి, తనతప్పు తెలుసుకొని, తనకి బుద్ధి తెప్పించటానికే రామలింగడు ఇలా చేసాడని తలచి బ్రాహ్మణులు చేసే పనిని ఆపివేయించెను.



No comments:

Post a Comment