March 28, 2014

శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణము

శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణము 

స్వామివారి కళ్యాణము చూతము రారండి. చైత్రశుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. అందరమూ వెళ్ళి చూద్దాము రండి.  
   

ఉత్తరాంధ్రలో  పేరొందిన పుణ్య క్షేత్రం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారు వెలసిన సింహాచలం. ఇది విశాఖపట్టణానికి దగ్గరలో ఉన్నది. కొండ దిగువ గ్రామాన్ని అడివివరం అంటారు.  ఇక్కడే వరాహ పుష్కరిణి ఉన్నది.  యాత్రికులు ఇందులో స్నానమాచరించి, నూరువరాల పూమాలలు మెడలో వేసుకుని, తోలిపావంచ(మెట్ల మొదట) వద్ద కొబ్బరికాయ కొట్టి, మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు. కొండమీదకి బస్సు సౌకర్యము కూడా కలదు. మెట్ల మార్గం మధ్యలో ఆంజనేయ స్వామి కోవెల ఉంది. దారి పొడుగునా 12 జలధారలు ఉన్నాయి. కొండమీద గంగధార ఉన్నాది. ఈ ధార ఎక్కడ నుండి వచ్చిందో ఇంతవరకు ఎవరికీ అంతుబట్టలేదు. ఈ ధార కొండమీద ఉన్న చెట్ల వేర్లు తగిలి రావడంతో, ఔషధగుణాలు కలిగి ఉంటుంది. అందువల్ల ఈ గంగధార నీరు సేవించటం వల్ల సకల రోగాలు పోతాయని ప్రతీతి. 


భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించి, గంగధారలో స్నానమాచరించి, స్వామి దర్శనం చేసుకుంటారు. గర్భగుడి పక్కన, "కప్పస్థంభం"(కోర్కెలు తీర్చే కల్పవల్లి) ఉన్నది. దీనికి తగిన రుసుము చెల్లించి, కౌగలించుకొనిన తమ కోర్కెలు తీరునని వాడుకలో ఉన్నది. 

సింహాచలం అనగానే ముందుగా గుర్తుకువచ్చేవి "సంపెంగపూలు". ఈ కొండ అంతా సంపెంగ, జీడి, పనస & అనాస తోటలతో నిండి ఉంటుంది. 


ఈ కొండమీద శిల్పకళా సౌందర్యం చూడాలేగానీ, వర్ణించతరము కాదు. ప్రతీ శిల్పం అపురూపం. 



తిరుమలలో అన్నమయ్య వలె, సింహాచలంలో శ్రీ కృష్ణమాచార్యులు వారు పేరొందిన కవి. ఇతను పుట్టుకతో అంధుడు. స్వామిని కీర్తించుటవల్ల, స్వామి కృపచే ఇతనికి చూపు వచ్చింది. చతుర్వేద, అష్టాదశ పురాణాది, సమస్త రహస్యాలు తెలుసుకుని, ఆ స్వామిని తన సంకీర్తనలతో అర్చించారు. రాగిరేకులపై గ్రంధాలు రాసే పద్దతి, ఈయన నుండే తాళ్ళపాక వారికి వచ్చిందని అంటారు. ఈయన ప్రథమ వచన, సంకీర్తన, కవితాచార్యునిగా ప్రసిద్ధి. ఈయన పాడుతూ ఉంటే, సింహాద్రినాథుడు బాలరూపంలో ఎదుటనిలిచి నాట్యమాడేవాడట. 


హిరణ్యకశిపుని వధించిన పిమ్మట, బ్రహ్మ గారు, ఇంద్రాదిదేవతలతో, సింహగిరికి వచ్చి, నృసింహవారికి  చైత్రశుద్ధ ఏకాదశి నాడు 5 రోజులు కళ్యాణము జరిపించినట్లు, క్షేత్రమహత్యం తెలియచేస్తోంది. అదే విధంగా నేటికీ యధావిధిగా 5 రోజుల కళ్యాణం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మీ సాగరకన్య కాబట్టి, రధోత్సవంలో విశాఖ జాలర్లు కొబ్బరికాయ కొట్టి రథం లాగుతారు, జాలరి నాయకుడు రథసారథిగా ఉంటాడు. కల్యాణంలో భాగంగా, ఎదురు సన్నాహం, రథయాత్ర, కళ్యాణం, నాగవల్లి, సదస్యం, దొంగలదోపు, ఉంగరపుసేవ, పుష్పాంజలి వంటి వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలలో భాగమైన ఉంగరపు సేవ ఎంతో వినోదంగా జరుగుతుంది. 7 మేలుముసుగులతో స్వామి గాలోగోపురం ఎదుట, కొలువుతీరి ఈ వినోదాన్ని తిలకిస్తాడు. 





శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి కళ్యాణము చూచిన, విన్నా జన్మధన్యమవుతుంది. స్వామికళ్యాణము చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగాని లభించదు.                        


సర్వేజనా సుఖినోభవంతు

No comments:

Post a Comment