అట్లతద్ది
"అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు....
చప్పట్లోయ్ తాళాలోయ్ దేవుడిగుళ్ళో మేళాలోయ్
పప్పుబెల్లం దేవుడికోయ్ ...పాలు నెయ్యి పాపాయికోయ్"
అంటూ జరుపుకునే అట్లతదియ పండుగ పదహారణాలా తెలుగువారి పండుగ. కన్నెవయసు పిల్లలు సరదాగా గెంతుతూ, ఆటలు ఆడుకొనే తదియ కాబట్టి "ఆటల తదియ" కాగా, గౌరీదేవికి అట్లను నైవేద్యం పెట్టే తదియ కాబట్టి, అట్లతదియగా మారి.....కాలక్రమంలో అట్లతద్ది లేదా అట్లతదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు. అట్లతద్దికి ముందురోజు చేతులకు పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ప్రతి ఏడాది జరుపుకొనే అట్లతద్ది నోము అందులో ముఖ్యమైనది.
అట్లతద్ది నోము
త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరీ మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై వున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం.
ప్రాచీనకాలం నాటి మాట ....... ఒక రాజు కూతురు, తన చెలికత్తెలతో అట్లతద్ది నోము నోచింది. చెలికత్తెలు అందరూ ఉపవాసము ఉన్నారు. రాకుమార్తె కూడా ఉపవాసం ఉన్నది. ఇంతలో రాకుమార్తె సుకుమారి కావటం వల్ల, ఉపవాసం ఉన్నందువల్ల, ఆకలితో సొమ్మసిల్లి పడింది. అంత ఆమె సోదరుడు తన చెల్లి అవస్థ చూసి, ఆరిక కుప్పకు నిప్పు పెట్టి, చెట్టుకొనకు ఒక అద్దం వ్రేలాడదీసి, మంట చూపించి , చంద్రోదయము అయ్యిందని భోజనం చేయవచ్చు అని తన చెల్లికి ఒక చిన్న అబద్దం చెప్పాడు.
రాకుమార్తె అన్నగారి మాట నమ్మి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.
తన తోటివారికందరికీ అందమైన భర్తలు లభించి, తనకి వివాహము కానందుకు బాధపడింది. అంతట ఆమె ఆ రాజ్యంలో గల పార్వతీ పరమేశ్వరుల దేవాలయమునకు వెళ్ళి ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం(అట్లతద్దినోము) చేస్తే, నీకు అందమైన భర్తగా లభిస్తాడు అని చెప్పిరి. అంతట ఆమె ఆ నోము చేసి, కథ చెప్పి అక్షింతలు వేసుకుంది. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.
అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుల్ని పూజించటానికి కారణం అర్ధనారీశ్వరత్వం. సాక్షాత్తూ భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడిగా మారాడనీ, ఆ అర్ధ నారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందనీ ఇతిహాసాలు చెబుతున్నాయి. అన్యమతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తరవాత ఉపవాసాన్ని విరమించడం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్లతదియ నోము మతసామరస్యానికి పెద్దపీట వేస్తుంది.
ఉద్వాసన:--
సూర్యోదయానికి ముందే నిద్రలేచి, అభ్యంగన స్నానమాచరించి, గోంగూర పచ్చడి వంటి వాటితో అన్నం భుజించి, మళ్ళీ రాత్రి నక్షత్రదర్శనం అయ్యేవరకు ఏమీ భుజించకుండా ఉండి, చంద్రోదయము అయ్యాక గౌరీదేవికి 9 అట్లు నివేదన చేయాలి. అలా 9 సంవత్సరములు నోము నోయాలి. 10 వ సంవత్సరమున 10 మంది ముత్తయిదువలని పిలచి, తలంటి స్నానము చేయించి, పదిమందికి పదేసి అట్లు, పసుపు, కుంకుమ, జాకట్టుముక్క, దక్షిణ , తాంబూలము సమర్పించి , సంతృప్తిగా భోజనం పెట్టవలెను. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవటం ఈ పండుగ విశేషం.
ఉయ్యాల పండుగ
ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు. ఊరిలో వుంటే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు. ఆడవారిదే రాజ్యం. తదియ రోజున ఊయల ఊగకపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతారు.
అట్లలో దాగి ఉన్న రహస్యం
ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్థముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంభందంచిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.... ఇలాంటి పండుగనే కొంచెం మార్పులతో ఉత్తరాదిన మరుసటి రోజున "కర్వా చౌథ్" అనే పేరుతో జరుపుకుంటారు.
శాస్త్రీయ దృక్పథం
ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.
చెమ్మచెక్క చారడేసి మొగ్గ ....
అట్లుపోయ్యంగా ఆరగించంగా ముత్యాలచెమ్మచెక్క .. ముగ్గులేయ్యంగా
రత్నాల చెమ్మచెక్క ... రంగులేయ్యంగా
పగడాల చెమ్మచెక్క ... పందిరేయ్యంగా
పందిట్లో మాబావ పెళ్ళి చేయ్యంగా
సుబ్బారాయుడి పెళ్ళి చూసివద్దాం రండి
మా వాళ్ళింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి
రాజుగారింట్లో పెళ్ళి రమణులారా రండి
దొరగారింట్లో పెళ్ళి దోచుకోద్దాం రండి
ఇలా ఆడుకుంటూ అరచేతుల మీద .... అరచేతులతో కొట్టటం వలన ఊపిరితిత్తులలోకి గాలి బలంగా వెళ్ళటం, లోపలి నుండి నిశ్వాసం కూడా బలంగా రావటం .... చేతులను ముందుకి వెనక్కి వేగంగా కదపటం.... కాళ్ళతో ముందుకు వెనక్కు పాటకు అనుగుణంగా గెంటుట వలన, శరీరంలో అన్ని భాగాలకి వ్యాయామం చేసినట్లు అవుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇది ఒక విశేషం.
ఒప్పులకుప్పా -- వయారి భామా
సన్నా బియ్యం -- ఛాయ పప్పు
బావిలో కప్పా -- చేతిలో చిప్పా
రోట్లో తవుడు -- నీ మొగుడెవరు ???
గూట్లో రూపాయ్ -- నీ మొగుడు సిపాయ్.....
నూకల బియ్యాన్ని-- ఛాయ మినప్పప్పుతో రుబ్బుతూ, కొబ్బరికోరుని, బెల్లపు అచ్చుని కలిపి, రోట్లో కొంచెం తవుడు పోసి రుబ్బి, ఒక బొమ్మ ఆకారాన్ని చేసి, సన్నగాజులను అటూ ఇటూ చెవులుగా చేసి, రూపాయబిళ్ళను కళ్ళలాగా ఏర్పాటుచేసి, ఆ ఏర్పడ్డ రూపం అమ్మాయికి మొగుడు అని ఆటలలో ఏడిపిస్తారు. బొమ్మలను తయారుచేయటం ఒకపక్క.....వ్యాయామం ఒకపక్క. ఈ ఆట వలన నడుంనొప్పులు, వెన్నెముక దోషాలు, మడమ నొప్పులు రానేరావు. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఆరోగ్యానికి మంచి ఆటలు ఇటువంటివి.
స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది. సాంప్రదాయ వాదమైనా, శాస్త్రీయ దృక్కోణమైనా, పెద్దలు చెప్పే ఆచారమైనా మానవుల జీవన గతిలో కించిత్ మార్పును చొప్పించి, సంతోషాలను అందించేందుకు ఉద్దేశింపబడిందే. హైటెక్ యుగంలో పండుగలను కూడా సినిమాలతోనో, షికార్లతోనో గడిపేస్తున్నాం. అసలు పండుగల్లో దాగున్న ఆంతర్యమేమిటో అర్థం చేసుకుంటే సామాజిక ప్రగతికి అవి ఎంత దోహదకారులో తెలుస్తుంది.
పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోతూ రెండు వరుసలుగా ఏర్పడి, ఎదురెదురుగా నిలబడి, ఒకరితరువాత ఒకరు రాములవారి పాటపాడి ఇళ్ళకు వెళ్ళిపోతారు.
ఉత్తముని పేరేమి? ఊరు పేరేమి ?
ఉత్తముడు రాముడు....... ఊరు అయోధ్య
ఉత్తముని ఆలి ఎవరు ? ఊరు పేరేమి ?
ఉత్తముని ఆలి సీతమ్మ..... ఊరు మిధిల
రాముడంతటివాడే బాధ పడ్డాడు
సీత అంతటి ఆమె నింద మోసింది
మానవులము మేమెంత ? నింద పడకుండా ?
అయోధ్యరామయ్య..... మిధిల సీతమ్మ
రక్షించి దీవించండి మీరిద్దరూ
అలా పాడుకుని వెళ్ళే పిల్లలకి ఇంట్లో ఉండే అమ్మమ్మో లేక నాయనమ్మో చిన్న మొట్టికాయవేసి, రెండు అట్లు పెట్టి, ఒక ముద్దు పెట్టుకుంటారు. మళ్ళీ ఈ అట్లతద్ది పైసంవత్సరానికి కదా వచ్చేది... అని వీడుకోలు చెప్పుకొని ఎవరిఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రాములవారి పాటలో లోకానుభవం, రమ్యమైన జీవనవిధానం ఎంత దాగిఉందో మనం తెలుసుకోగలం.
చాల బాగుంది శ్వేతాజీ ..చాలా బాగా వివరించారు అట్ల తదియ ప్రాశస్త్యం ...చక్కని పోస్ట్ సపోర్టింగ్ పిక్స్ తో ...@శ్రీ
ReplyDeleteధన్యవాదాలు శ్రీ జీ :)
ReplyDeleteThank u Krishna Deep
ReplyDeleteHmm.. Aadavaari Nomu.. Aadavaari Panduga.. Teliyani Visesaalenno Panchukunnaaru..
ReplyDeleteAadavaari Panduga Ainappatiki Entho Praamukhyatagaladani Teliyajesaaru ee Post Dwaaraka Sweta Madam.
Tq Sridhar Jii
ReplyDeleteGreat explanation.. thank you
ReplyDelete