దశరా నవరాత్రులలో రెండవరోజు బ్రహ్మచారిణీ అవతారవిశేషములు
(2) బ్రహ్మ చారిణి:
దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలః
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
దుర్గామాత నవశక్తులలొ రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ శబ్దమునకు అర్థం తపస్సు. బ్రహ్మచారిణి అనిన తపస్సును ఆచరించేది అని అర్థం. 'వేదస్తత్వం తపోబ్రహ్మ' వేదము, తత్వము, తపస్సు అని బ్రహ్మ శబ్దమునకు అర్థములు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్ణజ్యోతిర్మయమై అత్యంత మనోహరముగా ఉండును. ఈమె తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి, విజయం, సాధకుడికి మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. ఈమె కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయింది.
ఈమె తన పూర్వజన్మయందు హిమవంతునికి పుత్రికగా జన్మించెను. అప్పుడు నారదుని ఉపదేశానుసారము శంకరుని ఆరాధించి అనుగ్రహము పొంది పతిగా పొందవలెనని కఠోరతపస్సు చేసెను. ఈ కారణముగా ఈమెకు తపశ్చారిణీ , బ్రహ్మచారిణీ అనే నామములు వచ్చాయి. పర్ణములను(ఆకులను) కూడా భుజించుట వదిలివేసిన కారణంగా ఈమెను "అపర్ణ" అనే నామము కూడా కలిగిఉన్నది.
కొన్నివేల సంవత్సరాలు కఠినతపస్సును ఆచరించటంవాళ్ళ బ్రహ్మచారిణీదేవి పూర్వజన్మ శరీరము ఒక్కసారిగా క్షీణించి, కృశించి పోవుచుండగా తల్లి మీనాదేవి చూచి బాధపడి, ఆమెను తపస్సు నుండి విముఖురాలను గావించాలని తలంపుతో "ఉమా" ఉ =ఓ అమ్మాయి ; మా = (తపస్సు) వద్దు. అని పలికెను. అప్పటినుండి బ్రహ్మచారిణీ దేవి తన పూర్వజన్మ యందు "ఉమా" నామము కూడా ధరించెను.
బ్రహ్మచారిణీ దేవి కఠోరతపస్సుని చూసి బ్రహ్మదేవుడు "దేవీ ! ఇంతవరకు ఇట్టి కఠోరతపస్సు ఎవ్వరునూ చేయలేదు. ఇట్టి తపస్సు నీకే సాధ్యము. నీ మనస్సునందు ఉన్న కోరిక పరిపూర్ణమగును. శంకరుని నీవు పతిగా పొందెదవు." అని పలికెను. ఆ విధంగా బ్రహ్మచారిణీ దేవిశివుని వివాహమాడెను.
బ్రహ్మచారిణీ దేవి భక్తులకు, సిద్ధులకు అనంతఫలమును అందించును. ఈమెను ఉపాసించిన వారికి తపోత్యాగవైరాగ్య సదాచరములు వృద్ధియగును. జీవన సంఘర్షణలోనూ వారు కర్తవ్యమును మరవరు. బ్రహ్మచారిణీ దేవి కృపవలన వారికి సర్వత్ర విజయము లభించును.
రెండవరోజు నైవేద్యం -------- పులిహోర
పులిహోర చేసేవిధానం ఈక్రింది లింకులో చూడండి
http://swetaabhiruchi.blogspot.in/2013/07/blog-post_18.html
No comments:
Post a Comment