లేపాక్షి వీరభద్రస్వామి
అనంతపురం జిల్లలో హిందూపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉన్న లేపాక్షిలో ఈ వీరభద్ర ఆలయం నెలకొని ఉన్నది. క్రీ. శ. 1538 లో ఈ ఆలయం నిర్మించబడియున్నదని చరిత్ర చెబుతుంది.
ఇక్కడ ఉన్న శిల్పసంపద చూడటానికి రెండు కన్నులు చాలవు. ఒక్కొక్క స్తంభంపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ కళ్యాణమండపంలో స్తంభములపైన రెండు కోతులనే చెక్కి, వాటిని తన చాతుర్యంతో నాలుగు కోతులుగా కనిపించేలా శిల్పి చెక్కాడు. ఒకే ఆవు శరీరానికి 3 తలలు చెక్కి మూడు ఆవులుగా చూపించటగలగటం శిల్పి యొక్క అద్భుతమైన శిల్పకళాచాతుర్యం మనం ఇక్కడ చూడవచ్చును. 70 స్తంభాలున్న మండపంలో రంభ నాట్యం చేస్తున్నట్లు, వాయిద్యాలు వాయిస్తున్న సంగీత కళాకారుల శిల్పాలు, పై కప్పు పైన 100 రెక్కలున్న తామరపువ్వుల చిత్రాలను మనం ఇక్కడ చూడవచ్చును.
ఆలయ బయటి ప్రాకారంలో 7 తలల నాగుపాము పడగనీడలో కొలువైయున్న శివలింగాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చును. ఒకరోజు ఈ ఆలయాన్ని నిర్మించే పనులలో ఉన్న శిల్పులకు భోజనం తయారుచేయటం ఆలస్యం అయినప్పుడు ఆ సమయంలో నాగలింగాన్ని చెక్కినట్లు స్థానికులు చెప్పుకుంటారు. నిజంగా ఇది ఎంతో అద్భుతమైన శిల్పం.
సీతను రావణుడు అపహరించి లంకకు తీసుకువెళుతున్నప్పుడు ఈ ప్రదేశంలో జటాయువు అడ్డుకొని యుద్ధం చేయగా, రావణుడు దాని రెక్కలను నరకివేసినట్టు, కొనఊపిరితో ఉన్న జటాయువును రాముడు చూసి లే పక్షి అన్నాడని, అందుకే ఈ చోటికి "లేపాక్షి" అనే పేరు వచ్చిందని చెప్పుకుంటూఉంటారు.
ఆలయం నుండి సుమారు 600 అడుగుల దూరంలో ఒక పెద్ద రాతిపై 27 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉన్న ఒక నందిని చెక్కారు. ఆలయంలోని నాగలింగాన్ని ఇక్కడినుండే కనిపించేటట్టు చెక్కిన ఈ నందికి కొన్ని చిన్న చిన్న గంటలు, మరెన్నో అలంకారాలతో మనకు విజయనగర సామ్రాజ్యంలో ఎంత గొప్ప శిల్పులుండేవారో తెలియచేప్తోంది.
ఆలయ చరిత్ర -- విశేషాలు
14 వ శతాబ్దం నాటి మాట........ విజయనగరం రాజులలో అచ్యుత రాయలు పాలిస్తున్న సమయంలో ఆయనవద్ద కోశాధికారిగా పనిచేస్తున్న విరుపణ్ణ , రాజుకు ఎంతో విశ్వాసంగా ఉండేవాడు. అతను భగవంతునిపై ఎనలేని విశ్వాసం, భక్తి ఉన్నవాడు.
ఒకరోజు విరుపణ్ణకు కలలో వీరభద్రస్వామి ప్రత్యక్షమై "విరుపణ్ణ ! దక్షుడి యాగాన్ని భగ్నం కావించాక, ఆవేశంతో అటు ఇటు తిరుగుతున్న నన్ను భద్రకాళి కన్యకారూపంలో వచ్చి గాంధర్వ వివాహం చేసుకుంది. ఆమె చూపిన ప్రేమ నాలోని ఆవేశాన్ని అణచివేసింది. ఇప్పుడు నేను కూర్మ శైలంపై స్వయంభూవుగా అవతరించాను. అక్కడ నాకు ఒక ఆలయాన్ని నిర్మించు. " అని ఆజ్ఞ ఇచ్చి అంతర్ధానమైనాడు.
విజయనగరం సామ్రాజ్యంలో లేపాక్షి అనే ప్రాంతంలో తాబేలు ఆకారంలో ఉన్న ఒక కొండను కూర్మశైలం అని పిలిచేవారట. ఆ కొండపైకి వెళ్ళి తనకు కలలో కనిపించిన రీతిలో, ఆ వీరభద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకసాగాడు విరుపణ్ణ. కలలో చూసిన విధంగా అక్కడ ఒక స్వయంభూవు లింగం కనిపించేసరికి అతని ఆనందానికి అవధులులేకుండాపోయాయి. అక్కడ ఒక పెద్దఆలయం నిర్మించటమే కాక పార్వతీ పరమేశ్వరుల వివాహవేడుకుల దృశ్యాలను ఒక కళ్యాణమంటపంలో రాతిపై చేక్కించాలని ఆ పనులలో నిమగ్నమైనాడు విరుపణ్ణ.
గర్భగుడి, గోపురం అద్భుతమైన శిల్పకళతో ఆలయ నిర్మాణం పూర్తి చేసి, కళ్యాణమండపం పనులు చకచకా జరుగుతున్నాయి. విజయనగరసామ్రాజ్యంలో విరుపణ్ణకు ఉన్న పేరుప్రఖ్యాతులు చూసి రాజు యొక్క సన్నిహితులకి కిట్టక, రాజుగారికి అతని ఖజానాలో ఉన్న సొమ్ముతో వీరభద్రునికి విరుపణ్ణ ఆలయం నిర్మిస్తున్నాడు అని, అతనిపై ఉన్నవి లేనివి కల్పించి చాడీలు చెప్పారు. రాజు వారి మాటలు నమ్మి, ఎవరినీ విచారించక, విరుపణ్ణ కన్నులను పీకించమని అజ్ఞ జారీ చేసాడు. రాజుగారి ఉత్తరువు తెలిసిన విరుపణ్ణ ఎంతో న్యాయంగా జీవించిన తనకు ఇటువంటి శిక్షా ? అని ఆవేదనతో రాజుగారి సైనికులు తనను చేరకమునుపే తన కనులను తానీ స్వామికి అర్పించాలని తన 2 కనులను మండపంలో ఒక గోడపై వేశాడు. అందుకే ఈ కళ్యాణమండపం అసంపూర్ణంగా నిలిచిపోయింది అని చరిత్రకారులు చెబుతున్నారు.
గర్భగుడిలో విరుపణ్ణఇంటి దేవుడైన వీరభద్రస్వామి స్వయంభువు లింగం మనం దర్శనం చేసుకోవచ్చును. శివలింగ దర్శనం వల్ల మన మనస్సులో ఎనలేని భాగ్యాన్ని, సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది.శివరాత్రి, దశరా పండుగల వేడుకలు జరిగినప్పుడు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి జన సందోహం కిక్కిరిసిపోతుంది. లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించి పూజించి మోక్షమార్గం పొందుదాం. ప్రతీఒక్కరు జీవితంలో కనీసం ఒక్కసారి ఐనా తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రం.
లేపాక్షి వీరభద్రస్వామి
Nice Article....
ReplyDeleteThank u Venkat :)
Deletethalli, aa lingam lo oka chinna palugu untundi... thelusa, adi ela ayindio telusa.... nenu naa 10th class lo ante, 1970 lo vella, anduulo unna visista emitio thelusa... daani kinda unna base lo mana towel vesi, theesthe, sulambhamga bayatiki vasthundi... ante, daaniki base ledu.... ilaanti visistalu chaala unnayi....
ReplyDeleteha telusu babai...nenu chadivanu.....inka chala viseshalu unnayi....malli time chusukoni avanni adit chestanu babai :) thank u babai
Delete