దశరా నవరాత్రులలో మొదటిరోజు శైలపుత్రి అవతారవిశేషములు
(1) శైలపుత్రీ:
వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరామ్
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ||
దుర్గామాత తన మొదటి అవతారంలో శైలపుత్రి నామంతో అవతరించెను. పర్వతరాజు హిమవంతునికి పుత్రికగా జన్మించిన కారణముచే శైలపుత్రి అని నామం వచ్చెను. ఈమె వృషభముపై కూర్చొని యుండును. కుడిచేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము ధరించియుండును. నవదుర్గలలో ప్రధమదుర్గయైన శైలపుత్రి శక్తి అనంతము. నవరాత్రులలో ఈ ప్రధమదిన ఉపాసనయందు యోగులమనస్సు మూలాధారచక్రమునందు నిలిపియుంచెదరు. ఇప్పటినుండియే యోగుల యోగసాధన ప్రారంభమగును.
ఈమె పూర్వజన్మ యందు ప్రజాపతి దక్షునుకి పుత్రికగా జన్మించెను. అప్పుడు ఆమె సతీ నామము ధరించి యుండెను. ఈమె వివాహము శంకర భగవానునితో జరిగెను.
ఒకమారు ప్రజాపతి దక్షుడు ఒక గొప్ప యజ్ఞము చేయ బూనెను. ఆ యజ్ఞమునకు శివునినితప్ప, దక్షుడు సమస్త దేవతలను వారివారి యజ్ఞ భాగములను పొందుటకై ఆహ్వానించెను. సతీదేవికి తన తండ్రి ఒక గొప్ప యజ్ఞము చేయుచున్నాడని తెలిసి, వెళ్లి చూడాలని కోరిక జనించి శివునికి తన కోరికను తెలిపెను. అంతటా శివుడు సతీదేవితో ఇట్లనెను " దక్షుడు మనపై అయిష్టంతో ఉన్నాడు, తన యజ్ఞమునకు మనల్ని తప్ప అందరి దేవతలనీ ఆహ్వానించెను. కనీసం కబురైనా పంపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు వెళ్ళుట మంచిదికాదు" అని పలికెను.
శివుని మాటలు సతికి రుచించలేదు. తల్లిని, సోదరీమణులను చూడవలెనన్న కోరిక బలీయంగా ఉన్నదన్న విషయం గ్రహించిన శివుడు సతీదేవి వెళ్ళుటకు అంగీకారము తెలిపెను.
సతీదేవి పుట్టింటికి వెళ్ళగానే కన్నతల్లి తప్పించి, తండ్రిగానీ .. సోదరీమణులు గానీ ఎవ్వరూ ఆదరించలేదు. అందరూ వ్యంగ్యంగా మాట్లాడి అవమాన వచనాలు పలికిరి. దక్షుడు శంకరుని తిరస్కారభావంతో అవమానపరచు విధంగా మాట్లాడెను.
అంతట సతీదేవి శివుని మాటలు పెడచెవినపెట్టి, పుట్టింటికి వచ్చినందుకు చాలా దుఃఖించెను. తన పతిని అవమానపరచుట సహించలేక అచటనే ఉన్న యోగాగ్నిలో పడి భస్మమయ్యెను.
సతీదేవి యోగాగ్నిలో తన శరీరమును భస్మము గావించిన మరుజన్మలో శైలరాజు హిమాలయునికి పుత్రికగా జన్మించెను. పార్వతి , హైమావతి అనే పేర్లు ఈమెవే. ఈ శైలపుత్రి కూడా శంకరుని ఆరాధించి అనుగ్రహమును పొంది, వివాహమాడెను.
మొదటిరోజు అమ్మవారికి నైవేద్యం------ కట్టుపొంగలి.
కట్టు పొంగలి చేసే విధానం ఈ క్రింది లింకులో చూడండి.
http://swetaabhiruchi.blogspot.in/2013/07/blog-post_18.html
No comments:
Post a Comment