January 13, 2014

సంక్రాంతి పండుగ

సంక్రాంతి పండుగ 

సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించటాన్ని 'మకర సంక్రమణం' అంటారు. సౌరమానము - చంద్రమానము అనేవి రెండూ సంవత్సరానికి రెండుమార్లు కలుస్తాయి. వాటినే ఉత్తరాయణం - దక్షిణాయనంగా చెప్పుకుంటూఉంటారు. అవి రెండు ఆయనాలు జనవరి 14 & జూలై 16 గా నిర్ణయింపబడినది. సంవత్సరంలో ఈ రెండు రోజులలో మాత్రమే రాత్రింబవళ్ళు కాలము సమానంగా ఉంటుంది. మకరసంక్రమణం నుండి సూర్యుని వేడి పెరుగుతూ ఉంతుంది.   

సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు చాంద్రమానం ప్రకారం పండుగ చేసుకునేవారు 'కర్కాటక సంక్రమణం' అని వారు పండుగ జరుపుకుంటారు. --- సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు సౌరమాన ప్రకారం పండుగ జరుపుకొనే వారు 'మకరసంక్రమణం' అని పండుగ జరుపుకుంటారు.


సంక్రాంతి రోజున, మకరసంక్రమణ ఉత్తరాయణ పుణ్యాకాలంలో, వారి - వారి సంప్రదాయాల ప్రకారం మరణించిన పితృదేవతలకి, బంధువులకు పిండివంటలు - గారెలు చేసి, దేవునికి నైవేద్యం చేసి, వారి ఆత్మసంతృప్తి కోసం తర్పణాలు విడుస్తారు. ఈ విధంగా అన్నదానం - వస్త్రదానం ఉత్తరాయణ పుణ్యా కాలంలో చేస్తే మంచిది అని మన పెద్దలు చేసి, మనలను ఆచరించమని తెలిపారు.

గంగిరెద్దులు 
ధనుర్మాసం నెలరోజులూ దానధర్మాలు చేస్తే మంచిది. అందుకే గంగిరెద్దులవారు, హరిదాసులు, పిట్టలదొరలు, కొమ్మదాసర్లు, బుడబుడక్కలవాళ్ళు  ఇలా అనేకరకాలవారు వచ్చినప్పుడు దానాలు చేస్తే మంచిది. పల్లెటూర్లలో రైతులకు కొత్తపంటలు చేతికి వచ్చిన సంతోషంతో  అందరికీ దానధర్మాలు చేస్తారు.

ముందు ఒకరు, వెనుక ఒకరు వస్తూంటే, వంటిపై పాతబట్టలతో, బొంతలతో, వింతవింత అలంకారాలతో గంగిరెద్దు ఇంటిముందు నిలబడుతుంది. ఆ ఇద్దరూ శృతిబద్దంగా బాకా ఊదుతూ, అయ్యవారికి దండం పెట్టు - అయ్యవారికి జైజైచెప్పు అని అంటుంటే తల ఆడిస్తూ, ముందు కాళ్ళతో నృత్యం చేస్తూ, వింత సంతోషాన్ని కలుగచేస్తుంది గంగిరెద్దు. మరొక విశేషం ఏమిటంటే, మన ఇళ్ళల్లో నిండుగా కొత్త పంటలు వచ్చుటకు కారణం ఈ ఎద్దు జాతే. పొలాలని దున్నుట, పంటలని ఇంటికి చేర్చుట మొదలగు సేవలు చేసిన ఎద్దులు మన ఇంటికి వచ్చినప్పుడు, గర్వం - అహంకారం లేక శ్రమించిన సేవకునికి వినయమే ఉంటే ఎలా ఉంటుందో గంగిరెద్దు ద్వారా మనకు అవగతమవుతుంది. ఆ ఎద్దు చేసిన సహాయానికి సంతోషపడి, దానికి మనం బహుమానంగా పాత దుప్పట్లు, బొంతలు ఇస్తే అవే శాలువాలుగా  అనుకొని ఆనందపడి వెళతాయి. ఇంట్లో పాతబడిన వస్త్రాలని అమ్ముట సరికాదని, నిల్వ ఉంచుకోకుండా, ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవాలని ఈ విషయం తెలియచేస్తుంది. అంత పాతబట్టని ఇచ్చినా, ఒంటినిండుగా సంతోషంతో 'అంబా' అని మనల్ని ఆశీర్వదించి వెళ్ళే గంగిరెద్దుకి, ఆ అల్పసంతోషబుద్ధికి కారణం భోళాశంకరునికి అనాదిగా వాహనంగా ఉంటూ, అతని లక్షణం వచ్చుటే.


హరిదాసు
తలమీద గుండ్రని మంచి గుమ్మడి ఆకారపు గిన్నెని ధరించి, నుదుట ఊర్థ్వపుండ్రాలని ధరించి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, శ్రావ్యంగా పాడుతూ చేతిలో చిడతలతో హరిదాసు వస్తాడు. ఇతను ధనుర్మాసము నెలరోజులూ వస్తూనే ఉంటాడు. తెల్లవారుఝాము కాలంలో హరినామ సంకీర్తనం చేసుకుంటూ వస్తాడు ఇతను.

హరిదాసు నెత్తిమీద పండుగుమ్మిడికాయ ఆకారంలో, అదే రంగులో కన్పిస్తూ ఉంటే ఆ గిన్నె, భూమికి సంకేతం. ఆ భూమి నించి గాదె నిండుగా ఇంటికి ధాన్యాన్ని తెచ్చుకున్న మనం మళ్ళీ ఆ ధాన్యాన్ని భూమి ఆకారంలో ఉన్న హరిదాసు పాత్రలో వేయటమనేది -- మళ్ళీ పంట కోసం విత్తనాలని జల్లుతున్న దానికి సంకేతం. కొద్దిగా ధాన్యాన్ని భూమిలో వేస్తే తిరిగి అదే భూమి ఎన్నోవేల రెట్ల ధాన్యాన్ని మనకి ఇస్తుంది (ఇస్తోంది కదా!). ఆ ప్రత్యుపకార బుద్ధినీ - కృతజ్ఞతాభావాన్ని గుర్తు ఉంచుకొనేలా చేయటమే ఈ హరిదాసు చేసే పని. ఇతని చక్కని సంగీతంతో తృప్తిపరచి ధాన్యాన్ని తీసుకొని వెళ్ళటం ఎంత చక్కని విధానమో కదా ! గంగిరెద్దు రూపంలో శివదాసుడు వస్తే, ఇప్పుడు హరిదాసుని రూపంలో నారదుడు వచ్చాడన్నమాట. అతణ్ణి వస్త్రాలతో సన్మానిస్తే, ఇతడిని అన్నానికి కావలసిన ధాన్యంతో సన్మానిస్తున్నారన్నమాట.

'ఓ యజమాని ! ఎవరికీ ఇవ్వకపోయిన కారణంగా ఇలా ఇంటింటికీ వెళ్ళి యాచించే స్థితిలో నేనున్నాను. ఎప్పుడూ ఇస్తూ ఉండే అలవాటున్న కారణంగా మీరు ఇలా ఇచ్చే స్థితిలోనే ఇంకా ఉంటూనే ఉన్నారు.'  అని ప్రతీ యాచకుడు మౌనంగా చెబుతాడంట. ఆ విషయాన్ని గుర్తుంచుకావలసిందిగా హెచ్చరిస్తూ, తాను మాత్రం యాచించుటకు రాలేదని శ్రావ్యమైన కీర్తనలు చేసుకుంటూ, ఆ కీర్తనలనే అను నిత్యం జపిస్తూ ఉండాలని, అలా కీర్తిస్తే కష్టాలని దాటుకుంటారని మనకి తెలియచేస్తాడు. 

 
బుడబుడక్కలవాడు, పిట్టలదొరలు, జంగమదేవరలు, కొమ్మదాసరి మొదలైనవారు ఎందరో వచ్చి తమతమ గొప్పదనాన్ని చాటుకుంటూ, మన నుంచి బహుమానాలని (దానలని) పొందుతారు.

సంక్రాంతి శుభాకాంక్షలు

                 

4 comments:

  1. This blog is excellent in getting Telugu traditional information.Congrats

    ReplyDelete
  2. Nice information.

    Keep post this kind of information. So many people don't know why we are celebrating particular festivals and essence of it, even myself not aware.

    Thanks to Admin for this post.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు బాలకృష్ణగారు ____//ll\\____

      Delete