సర్వేశ్వర చక్రాయుధ
శర్వాణివినుతనామ జగదభిరామా
నిఎవాణనాధ మాధవ
సర్వాత్మక నన్నుగావు సదయత కృష్ణా ll
భావం
కృష్ణా!నీవు సమస్తమునకు ప్రభువును,సమస్తమునకు లోపల నుండువాడవు.చక్రమును ఆయుధముగా ధరించినవడవు. పార్వతీ దేవి చేత స్మరించబడు పేరుగల వాడవు.మోక్షమునుకు నదిపతివి.లక్ష్మిని భార్యగా గలవాడవు. నన్ను దయతో రక్షింపుము.
96 వ పద్యం
శ్రీధర మాధవ యచ్యుత
భూదర పురుహుతవినుత పురుషోత్తమ ఏ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో నమ్మినాcడ ముద్దుల కృష్ణా ll
భావం
లక్ష్మీ దేవిని హృదయమున దరించి,ఆమెకు భర్తయైన వాడా,శాశ్వతుడవైన వాడా!దేవేంద్రుని చేత స్తోత్రము చేయబడినవాడా, భూదేవిని దరించినవాడా,పురుషులయందు పరమశ్రేష్టునివైనవాడా,ముద్దులు మూటగట్టెడు రూపముగలవాడా, ఓ కృష్ణా నీ పాదముల జంటను ఎల్లపుడు సంతోషముతో నమ్మి ఉన్నాను.అట్టి నన్ను రక్షింపుము.
97 వ పద్యం
శిరమున తర్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపు పతకము
సిరినాయక అమరcదాల్తువు శ్రీహరి కృష్ణా ll
భావం
కృష్ణా!నీవు తలమీద రత్నములు చెక్కిన కిరీటమును కరములందు శంఖము,చక్రము,అనేక గొప్ప అలంకారములను, వక్షఃస్థలమున కౌస్తుభ రత్నముతో కూడిన పతకములను బహు అలంకారముగా నుండునట్లు ధరింతువు.
98 వ పద్యం
అందెలు పాదములందున
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర ముని సన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా ll
భావం
పాదములందు ముద్దులొలుకునట్లుగా అందమైన అందెలను ధరించి ఉన్నావు.మంధర పర్వతమును కూర్మావతారములో మోసినట్టి కృష్ణా మునులచేత నుతులను గైకొనువాడా!నందుని ప్రియపుత్రుడా!నిన్నే నమ్మితిని.నీవే నాకు దిక్కు.
99 వ పద్యం
కందర్పకోటి సుందర
మందరధర నామతేజ మధుసూదన యో
సుందరవిగ్రహ మునిగణ
వందిత మిము దలcతు భక్తవత్సల కృష్ణా ll
భావం
ఓకృష్ణా!కోటి మన్మదులంత సౌందర్యము కలిగిన్వాడవు.మందర పర్వతమును మోసినవాడను గొప్పపేరు గలవాడవు, మదువను రాక్షసుని చంపిన వాడవును,మునీశ్వరులచే నమస్కరింపబడు వాడవును అయిన నీ సుందర విగ్రహమును ఎల్లపుడును మనస్సులో తలంతును.
100 వ పద్యం
అనుదినము కృష్ణశతకము
వినిన పథించినను ముక్తి వేడుక గలుగున్
ధనధాన్యము గో గణములు
తనయులు నభివృద్ధిపొందు తద్దయు కృష్ణా ll
భావం
ఓ కృష్ణా!ప్రతిదినము నీ శతకము చదివినను,వినినను వారికి పరలోకమందు ముక్తియు,ఈలోకమందు ధనధాన్యములు పుత్రాభివృద్ది విశేషముగ గలుగును.
101 వ పద్యం
భరద్వాజ సగోత్రుడ
గారవమున గంగకసుతుడన్
పేరు నృసింహాహ్వయుడను
శ్రీ రమణా ! నన్నుగావు సృష్టిని కృష్ణా ll
భావం
ఓ లక్ష్మీదేవితో కూడిఉన్న శ్రీకృష్ణా ! నేను భారద్వాజస గోత్రమున పుట్టినవాడను, గౌరన్న- గంగమాంబ అను పుణ్య దంపతుల పుత్రుడను, నృసింహుడు అను పేరుగల నన్ను దయతో కాపాడుము.