మనసు స్వాధీన పరచుకునే మార్గాలు:
మన మనసులో బాగా పాతుకుపోయిన చెడు అలవాట్లను తొలగించుకోవాలంటే చాలా కష్టమైన పనే. పోనీ మనవల్ల కాకపొతే ఎవరైనా బాగుచేస్తే, బాగుపడుతుందేమో, అని అనుకోవటానికి వీలులేదు.
ప్రపంచంలో ఎన్నో వింతలూ విడ్డూరాలు చూస్తున్నాము. కంపూటర్లు రాజ్యమేలుతున్నై. ఎన్నెన్నో పెద్ద పెద్ద సిస్టమ్స్ కి, కంపూటర్ లతో కనెక్ట్ చేసి, ఒక్కచోటే కూర్చుని, అన్నిటిని కంట్రోల్ లో పెట్టి, పని చేయించటం మనం చూస్తున్నాము. ఎంతగా సైన్స్ అభివృధి చెందినా మనస్సును కంట్రోల్ చేసే పరికరాన్ని మాత్రం కనుగొనలేకపోతున్నారు, ఇకముందు కూడా కనుగొనలేరు.
ఎవరికి ఆకలివేస్తే వారు తింటేనే ఆకలి తీరుతుంది. రోగం వచ్చిన వ్యక్తే మందులు వాడాలికానీ, మరొకరు వాడితే రోగం తగ్గదు కదా! అలాగే ఎవరి మనసు పాడైతే వారే బాగుచేసుకోవాలి, మరొకరు చేయలేరుకదా ! మనసుని బాగుచేసుకోవటానికి సాధనంగా మనసే ఉపయోగపడుతుంది.
మనం సర్కస్ లో చూస్తూ ఉంటాము.... రింగ్ మాస్టర్ చేతిలో కొరడా పట్టుకుని సింహం, పులి వంటి క్రూరమైన మృగాలను... అతను ఇష్టమొచ్చినట్లు ఆడిస్తాడు. అది ఎలా సాధ్యమవుతుంది ? నిరంతర సాధన ద్వారా, పులిని పిల్లిలా చేసి, తన చెప్పుచేతల్లో పెట్టగలుగుతున్నాడు. "సాధనమున పనులు సమకూరు ధరలోన" అనే మాట వినే ఉంటాము.
కనుక సాధన ద్వారా మనసుని, నిశ్చలంగా చేసి, మన ఆధీనములో ఉంచుకోవాలి. అంటే భక్తీ అనే తాడుతో బంధిస్తే, మనసు నిశ్చలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో మనసు ప్రధమ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మనసుని జయిస్తే, సమస్త ప్రపంచాన్ని జయించినట్లే .... కనుక మన మనసు ఆధ్యాత్మిక సాధన కోసం పాటు పడాలి. అప్పుడే మనసు కుదుటపడుతుంది.
ఆ దేవదేవుని చరణాలని ఆశ్రయిస్తే అతనే మనం సన్మార్గంలోకి వెళ్ళే మార్గం చూపిస్తాడు.
No comments:
Post a Comment