March 28, 2014

అక్షయ తృతీయ (చందనయాత్ర)

అక్షయ తృతీయ (చందనయాత్ర)

చందనం తీసిన తరవాత స్వామివారి నిజరూప దర్శనం 
అక్షయ తృతీయనే "చందనయాత్ర"  అంటాము. వైశాఖ బహుళ తదియ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. 

సింహద్రి అప్పన్న నిజరూప దర్శనం కోటి జన్మల తపః ఫలం ....నర మృగ శరీరాలతో పక్కన చేతి కింద నమ్ముకున్న గరుడాళ్వార్ తో ఏడాది పొడుగున దివ్య చందనం లో లింగా కారంలో కనిపించే స్వామి ఆనాఢు పురూరవునికిచ్చిన మాట ప్రకారం వరహా నరసింహునిగా నిజరూపంతో కనిపించే దివ్యమైన రోజే అక్షయతృతీయ. 

సింహాచలంలో భగవానుడు మనకు సంవత్సరము అంతా గుమ్మడిపండు రూపంలో దర్సనమిస్తాడు. విదియనాటి రాత్రి స్వామి కి అభిషేకాదులు చేసి అర్చకులు....  స్వామి మేను నుండి చందనము తొలగిస్తారు. తిరిగి తదియనాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుండి మట్టి కలశలతో నీరు తెచ్చి అప్పన్నకి సహస్ర కలశాభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం జరుగుటకు మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాము. 

హిరాణ్యాక్షుని సంహరించిన పిదప, నరసింహస్వామి ప్రహ్లాదునుని, నీకేమివరము కావాలో కోరుకో అని అడుగగా..... అంతట ప్రహ్లాదుడు స్వామితో ఇట్లనెను "స్వామీ మా తండ్రి, పెడతండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యము నాకు కల్పించు తండ్రీ" అని అడగగా స్వామి అట్లే అనుగ్రహించి, ప్రహ్లాదుని కోరికని మన్నించెను. అందువలననే ఇచట వెలసిన స్వామిని "శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి" అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి రూపం మనకు మరెక్కడా కనిపించదు.             

ప్రహ్లాద వంశీయుడైన పురూరవ చక్రవర్తి, ఊర్వశితో గగనమార్గాన విహరిస్తున్న సమయంలో సింహగిరి సమీపమునకు రాగానే వారి పుష్పకవిమానము ముందుకు కదలక అచ్చటే నిలిచిపోయేనట. ఆ చక్రవర్తి భగవదాజ్ఞగా భావించి, కొంత సమయము విశ్రాంతి తీసుకోదలచి వాహనమును సింహగిరి పైకి దించి, ఒక చెట్టు క్రింద విస్రమించెను. అంతట అతనికి స్వప్నమందు అప్పన్న సాక్షాత్కరించి, "నేను ఇచటనే వెలసియున్నను, నాకు ఆరాధన చేయు" అని పలికెను. వెంటనే పురూరవుడు.....స్వామి చెప్పిన గురుతుల ప్రకారము, ఆ కొండ ప్రాంతమంతా భటులచే వెతికించి, ఒక చోట స్వామి ఉన్నట్లు తెలుసుకొని, స్వామి పై ఉన్న పుట్టమన్నుని తొలగించి దర్శించెనట.  అంత స్వామి ఇంతకాలము తనపై ఉన్నమట్టివలన తాపములేదని, ఎంత మన్నుని తనపైనుండి తీసారో అంతే  పరిమాణంలో తనపై శ్రీ చందనం పూతగా వేయవలెనని చెప్పెనట, సంవత్సరములో ఈ ఒక్కరోజునే స్వామి యొక్క నిజరూప దర్శనభాగ్యం మనకు లభిస్తోంది.  పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు ఉన్న కారణంగా, ఇప్పుడు అంతే పరిమాణంగల చందనమును 4 విడతలుగా వేస్తున్నారు. ఆ నాలుగు విడతలు----

1) అక్షయ తృతీయ నాడు, 2) వైశాఖ పూర్ణమి నాడు, 3) జ్యేష్ట పూర్ణిమ & ఆషాడపూర్ణిమ. ప్రతీ విడతకు 3 మణుగుల చొప్పున చందనమును స్వామిపై వేస్తారు. అందుకే ఈ స్వామిని చందన స్వామి అనికూడా అంటారు.


చందనం అరగతీయటం
చందనయాత్ర రోజున నాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధారవద్ద స్నానమాచరించి, మట్టికలశలతో గంగధార నీటిని తీసుకొని వచ్చి, స్వామికి అభిషేకిస్తారు. అభిషేకం అనంతరం స్వామిని చల్లబరచటానికి - తృప్తిపరచటానికి పంచదారతో పానకం చేసి ఆరగింపు చేస్తారు. ఆ పానకమే ఆనాటి స్వామి ప్రసాదన్నమాట. అనంతరం స్వామికి విశేష పూజలు చేసి, మళ్ళీ చందనంతో స్వామికి పూత పూస్తారు.


దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లక్ష్యంగా సింహద్రి అప్పడు చందన రూపం ధరించినది ఈ రోజే
పతిత పావని గంగమ్మ ఉధ్భవించినది ఈ రోజే
పితృవాక్యపాలకుడు పరశురాముడు జన్మించినది నేడే
చార్ ధామ్ యాత్ర మొదలయ్యేది నేడే
కుచేలుడు కృష్ణుడికి అటుకులిచ్చి అక్షయ సంపదలు ఫొందింది నేడే
అరణ్యవాసానికి పోతూ అన్న కృష్ణుడిని ఆర్తితో ప్రార్థించిన ద్రౌపది అక్షయపాత్ర పొందింది నేఢే
అటువంటి పవిత్ర అక్షయ తృతీయ నాడు అప్పన్న నిజరూప దర్శనం శాశ్వత వైకుంఠ నివాసాన్ని ఇస్తుంది
సింహచల వరహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనం సకల పాప నాశనం సర్వసౌభాగ్యదాయకం
ఏడాదికి ఒక్కసారి లభించే ఈస్వామి దర్శనం చాలా పుణ్యం చేసుకుంటేగానీ లభించదు. శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించండి ...... పాపాలను తొలగించుకొని పుణ్యలోకాలకి మార్గం సుగమం చేసుకోండి.   



🙏🙏🙏అప్పన్న నిజరూప దర్శనం 🙏🙏🙏

2 comments: