March 28, 2014

ఆధ్యాత్మిక విషయాలు

ఆధ్యాత్మిక విషయాలు

మానవజీవితం ఆనందనందనవనం కావాలనే జగత్కల్యాణ కాంక్షతో జ్ఞానులైన మహర్షులు ఆధ్యాత్మిక విద్యను లోకానికి అనుగ్రహించారు. ఆ ఆధ్యాత్మిక విషయాలని కొన్నిటిని నేను మీకు అందిస్తున్నాను.

మన చేజేతులా మన అదృష్టాన్ని (జీవితాన్ని) ఎలా పాడుచేసుకుంటున్నామో తెలియచేసే కొన్ని విషయాలు, ఇప్పుడు చెప్పుకుందాము. 

ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు లభించినటువంటి మానవజన్మ, ఏదైనా ఒక విలువైన వస్తువుని చిన్న పిల్లవానికి ఇస్తే దాని విలువ తెలియక దానితో ఆడి ఆ వస్తువుని పాడుచేసుకుని, కొంత వయసు వచ్చిన తరవాత చిన్ననాడు తాను ఆటలాడి పాడుచేసిన వస్తువు యొక్క విలువ తెలుసుకుని అయ్యో ఆరోజు ఇంట విలువైన వస్తువు నా చేతికి వస్తే చేజేతులా ఎందుకూ పనికిరాకుండా చేసుకున్నా, కానీ ఈరోజు మళ్ళీ అంతగొప్ప వస్తువుని పొందటానికి, సంపాదించటానికి నాదగ్గర శక్తి లేదే, దానిని సాధించటానికి తగిన పరిస్థితులు లేవే అని ఎలాగైతే బాధపడుతూ ఉంటాడో, అదే విధంగా భగవంతుడు ఎంతో విలువైన మానవజన్మను మనకు ప్రసాదిస్తే దానిని సద్వినియోగపరచుకోక, ఏదో డబ్బు సంపాదించుకోవటానికో శారీరక సుఖాలను అనుభవించటానికో మన కంటికి కనిపించేవే మనం అనుభవిస్తూనే శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవని భావిస్తూ కాలాన్ని గడిపి వేస్తున్నాము. 

కాని దాని విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, ఇన్నాళ్ళు అంతా నావాళ్ళు అని వారికోసం ఎంతో శ్రమపడి, అవసరమైతే ఎదుటవారిని మోసం చేసి కూడా లక్షలు ఆర్జించిపెట్టి, భోగాలను అనుభవిస్తూ పెచ్చు మీరిన శారీరిక సౌఖ్యాలతో శరీరమంతా వివిధమైన రోగాలతో నిండిపోయి అసలు సహకరించని స్థితికి వచ్చాక ఇన్నాళ్ళు నావాళ్ళు అని భావించినవారంతా వీనిని భారంగా భావిస్తూ ఇంత ముద్ద పడేసి, తిడుతూ ఉంటే, పిచ్చివాడిలా పడి తిరుగుతూ, చిట్టచివరికి మనఃశాంతి కోల్పోయినప్పుడు తెలుస్తుంది. 

అప్పటికి జ్ఞానోదయం కలిగి భగవంతుడా ఎంత పాపాత్ముడవయ్యా ! ఇన్నాళ్ళు అజ్ఞానంతో ఇదే సుఖమైన జీవితం అని, ఇవే జీవిత లక్ష్యాలని, నీవు నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఇవన్నీ అనుభవించి ఆనందించడానికని భావించి ఇవన్నీ క్షణికమైనవని తెలుసుకోలేక అసలు ఆనందం అంటే ఏమిటో తెలియక పరమానంద స్వరూపుడైన నిన్ను సేవించక, నిజమైన ఆనందాన్ని పొందలేక, ఇప్పుడు బాధపడుతున్నానయ్యా. అయ్యో నన్ను నీవు ఈ శరీరంలోంచి తీసుకువెళ్ళిపోయే సమయం వచ్చేస్తోందే మరి నేను చేసిన పాపకర్మల ఫలితంగా నాకు ఏ తుచ్చమైన నీచమైన జన్మను ప్రసాదిస్తావో, ఇక ఈ అంతిమ సమయంలో నేను ఎప్పుడు నిన్ను గూర్చి పరిపూర్ణంగా తెలుసుకోగలను. ఎన్నడు నిన్ను సేవించగలను. ఎన్నడు పూజించగలను. ఎన్నడు కీర్తించగలను. ఎన్నడు నిన్ను చేరగలను. నేను ఈ జననమరణాల కాలచక్రంలో పడి నలగవలసిందేనా, జన్మ తరించే మార్గమే లేదా అని గుండెలు బాదుకుని ప్రయోజనం ఏమున్నది. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలో కొంచెం ఆలోచించండి.  


No comments:

Post a Comment