March 28, 2014

మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు:

మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర మాసంలో, శుద్ధ నవమి నాడు,  పునర్వసు నక్షత్రములో, త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం జరుపుకున్నది ఈ రోజునే. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

భద్రగిరి పర్వతరాజు తపస్సువల్ల, అక్కమాంబ త్యాగంవల్ల, భక్తరామదాసు పట్టుదలవల్ల త్రేతాయుగం నాటి అయోధ్యరాముడు మళ్ళీ మనకు ఈ కలియుగంలో భద్రాచలరామునిగా అవతరించాడు. కానీ త్రేతాయుగం గుర్తులు నేటికి భద్రాచలంలో పవిత్ర గోదావరీ తీరాన ఒడ్డున, పంచవటి వద్ద మనకు దర్శనమిస్తున్నాయి. అక్కడ రావణుడు... సీతమ్మను అపహరించిన వైనం, మాయలేడి, సీతమ్మతల్లి ఆరవేసిన నారచీరల ఆనవాళ్ళు, సీతమ్మ స్నానమాచరించిన గుండము మొదలగునవి, మనం చూడవచ్చును. 

సీతారాముల కళ్యాణం అనగానే మనకు ముందుగా భద్రచలమే గుర్తుకువస్తుంది. ఆకాశమంత పందిళ్ళుతో, ఎటుచూసినా విసినకర్రలతో సందడి చేసే జనం, మనఇంటి పెళ్ళివలె సందడితో, అందరూ ఎంతో ఆనందంగా ఎదురుచూసే సీతారామ కళ్యాణం చూడటానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఈ రోజు రామయ్య పెళ్ళికొడుకై, సీతమ్మ పెళ్ళికూతురై మనందరికీ కనువిందు చేస్తున్నారు.


సీతారామ కళ్యాణ రహస్యాలని కొన్నిటిని మనం తెలుసుకుందాము. ఒకానొక రోజున దశరధుడు తన నలుగురు కొడుకులకు వివాహము చేయదలచి, ఒక సమావేసము ఏర్పాటు చేసాడు. సరిగ్గా అదే సమయానికి విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చాడు.  దశరధుడు-- విశ్వామిత్రునికి సకల మర్యాదలు చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. విశ్వామిత్రుడు దశరధునితో "నేను రాముణ్ణి అడవులకి తీసుకుపోవటానికే వచ్చాను" అనెను. కొంతసమయం దశరధునితో వాదన జరిగింది. పిమ్మట వశిష్ట మహర్షి దశరధునిని ఒప్పించి, రామలక్ష్మణులని .... విశ్వామిత్రునితో అడవులకి పంపెను. అసలు రహస్యం ఇక్కడే ఉంది. 

శ్రీ మహావిష్ణువు రామునిగాను---లక్ష్మీదేవి సీతమ్మగాను ఈ భూమిపై అవతరించారనే రహస్యం---దేవతలకి, మహర్షులకి మాత్రమే తెలుసు. దశరధునికి తెలియదు. అందుకే ఆటను అందరిలాగే తన నలుగురి పిల్లలికి వివాహం జరిపించాలని సమావేశం ఏర్పాటు చేసాడు. 

దేవలోకంలో ----- సీతారాముల కళ్యాణము జరిపించే బాధ్యత విశ్వామిత్రునిదే అని శ్రీ మహావిష్ణువు అధ్యక్షతన జరిగిన సమావేశంలోదేవతలంతా తీర్మానించారు. అందుకే రామలక్ష్మణుల వివాహ సమావేశం జరుగుతుంది అని తెలియగానే విశ్వామిత్రుడు వచ్చి, సభని ఆటంకపరిచి, రాముణ్ణి తనతో తీసుకెళ్ళి, సీతమ్మతో వివాహం జరిపించేవరకు రాముణ్ణి విడిచిపెట్టకుండా, అంటిపెట్టుకుని కళ్యాణము జరిపించి అయోధ్యకు తీసుకువచ్చాడు. 

ఎవ్వరూ ఎత్తలేని విల్లుని సునాయాసంగా కదిపిన సీతమ్మకి---- ఆ ధనుస్సుని ఎత్తుతూనే వంచి, విరగకొట్టిన రామునికి పెళ్లి అనగానే, అందరు ఈడు --జోడు కుదిరింది అని అనుకున్నారు. 


రాముడు పుట్టింది, సీతమ్మ జన్మించింది రావణ వధ కోసం మాత్రమే. ఆ రావణుణ్ణి సంహరించాలి అంటే, శివుడూ--శక్తీ ఏకం కావాలి. ఇక్కడ రాముడు శివ స్వరూపము అయితే, సీత శక్తి స్వరూపం. ఈ రెంటినీ ఏకం చేసినవాడు-- విశ్వామిత్రుడు.                                                     

ఇన్ని మహత్యాలు ఉన్న రామాయణాన్ని చదివిన, విన్న, సీతారాముల కళ్యాణాన్ని చూసిన మన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. 

శ్రీరామ జయరామ జయజయ రామ.


No comments:

Post a Comment