March 28, 2014

పరమాత్మను చేరుకోవటం ఎలా

పరమాత్మను చేరుకోవటం ఎలా

మన పూర్వులు, ఋషులు అంతా మనకి కలిగే అనుమానాలు తీర్చటానికి ఎంతో శ్రమించారు. సర్వజగత్తుకు నాయకుడైన ఆ శ్రీమన్నారాయణుని చేత ఆడబడేటటువంటి జగన్నాటకంలో లోకాలన్నీ ఎలా సృష్టించబడుతున్నాయి, ఎలా పాలించబడుతున్నాయి, చివరకు మరలా ఎలా అతనిలో లీనమవుతున్నాయి. ఎన్నో కోట్ల జీవులను ఆయన సృష్టిస్తున్నాడు కదా, అందులో ముఖ్యంగా మానవుడు చేయవలసిన పనులేమిటి, ఎట్లు ఈ జన్మ లభిస్తోంది, మరలా జన్మించకుండా ఉండాలంటే ఏ ఏ పనులను ఆచరించాలి, వీటన్నింటికి సంబంధించిన జ్ఞానమంతా మనకి వేదాలలో చెప్పబడింది. అందరూ ఈ వేద విజ్ఞానాన్ని పొందలేరు కాబట్టి వారందరి కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచించి, ఆ వేదాల సారాన్నంతా పురాణ -- ఇతిహాసాల రూపంగా మనకి అందించారు. అందులో మనకి పైకి రాజుల చరిత్రలు, ఏవేవో చక్కని కథలు చూపిస్తున్నా, లోలోపల భావం మాత్రం మనిషి మనిషిగా బ్రతికితే లోకం చేత ఎలా కీర్తింపబడతాడు. జేవితంలో తనకు ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ భగవంతుడిని చేరే మార్గంలో ఎలా పయనించాలి. మనం పాటించవలసిన ధర్మాలు ఏమిటి, వీటి గురించి జ్ఞానం మనకు అందించటమే వారి లక్ష్యం. ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మికత పెంపొందించటమే వారి రచనలయొక్క ఆశయం. కాబట్టి మనం ఆ పరమాత్మను చేరాలి అంటే ఎంతో కష్టమేమో అని అనుమానాలు పెట్టుకుని, కంగారు పడవలసిన అవసరం లేదు. అసలంటూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మనల్ని అవతలి ఒడ్డుకు చేర్చడానికి ఎన్నో సాధనాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవటానికి ఎన్నెన్నో ఉపాయాలు మనకు కనబడతాయి. వీటన్నిటి సహాయంతో నెమ్మదిగా ఈ సాగరాన్ని ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న పరమాత్మ స్థానాన్ని మనం చేరుకుందామా.


No comments:

Post a Comment