September 25, 2015

నేపాల్ యాత్ర మొత్తం విశేషాలు

నేపాల్ యాత్రా విశేషాలు
Day  1

సెప్టెంబర్ 04వ తేదీన ఉదయం అమ్మ - నాన్న, తమ్ముడు - మరదలు, మేనకోడలు ఇంకా కొంతమంది స్నేహితులతో ... మొత్తం 22 మంది...... నేపాల్ లో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలని దర్శించటానికి సికింద్రాబాద్ నుండి గోరఖపూర్ రైలులో బయలుదేరాము. 

Day 2
మరుసటి దినం కృష్ణాష్టమి అయ్యింది. మా గ్రూప్ లో ఉన్నవారంతా రైలులోనే ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని, మా రైలుబోగీ అంతా గాలిబుడగలతో అలంకరించి,  తమ్ముడు తీసుకువచ్చిన చిన్నికృష్ణుని విగ్రహం, నాన్నగారి వద్ద ఉండే కృష్ణుని విగ్రహాలు అన్నిటినీ అలంకరించి,  నాన్నగారు & తమ్ముడు పూజలు చేసారు. 

రైలులోనే కృష్ణాష్టమి జరుపుకుంటామని ముందే తెలిసిన మాలో కొందరు భక్తులు రకరకాలైన స్వీట్స్ ని తీసుకువచ్చారు. వాటిని నైవేద్యంగా పెట్టి కంపార్ట్మెంట్ లో ఉన్నవారందరికీ పంచిపెట్టాము.   




ఆరోజు సాయంత్రం గం3.30 నిమిషాలకి గోరఖ్పూర్ చేరవలసిన రైలు 4 గంటలు ఆలస్యంగా 7.30 కి చేరింది.

మేం రైల్వే స్టేషన్ కి చేరుకోగానే, మా గైడు వచ్చి మమ్మల్ని బస్ వద్దకు చేర్చి, రాత్రి 12 గంటలు దాటితే నేపాల్ బోర్డర్ లోకి ప్రవేశం ఉండదని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ తీసుకుపోయాడు. కాని బోర్డర్ చేరేసరికి రాత్రి 12.30 నిllలు అయ్యింది. అందువల్ల బోర్డర్ కి ఇవతలే బస్సుని నిలిపేసాడు.



అక్కడ నుండి 1/2 కిలోమీటరు దూరం నడిచాక,  అంటే నేపాలుబోర్డర్ లోకి ప్రవేశించి, ఆ రాత్రికి అక్కడే హోటల్ లో రూమ్స్ తీసుకొని నిద్రించాం.అక్కడ వాతావరణం మన ఇండియా వాతావరణంలాగే చాలా వేడిగా ఉంది.

Day 3 - బోర్డర్ నుండి పోఖరా ప్రయాణం 
తెల్లవారాక 6.00 లకి బస్సు వచ్చి మా హోటల్ ముందు నిలిచింది. అందరం మా లగేజీ తీసుకొని స్నానాలు ముగించి, టిఫిన్ తిని, మన ఇండియా కరెన్సీని - నేపాలి కరెన్సీ లోకి మార్చుకున్నాము. మన మనీ 1,000 ఇస్తే, వాళ్ళ మనీ 1,600 ఇచ్చారు. అక్కడ ఎండ, వేడి తక్కువే ఉన్నాయి, కానీ చెమటలు ఎక్కువగా ఉన్నాయి. 11 గంటలకి బస్సులో అందరం పోఖరాకి బయలుదేరాం. నేపాల్ దేశం అంతా కొండలమయమే.

అక్కడ రోడ్డులన్ని ఘాట్ రోడ్డులే. దారి అంతా పచ్చని కొండలు, గుట్టలు, పెద్దపెద్ద పర్వతాలు, లోయలు చూడటానికి మనస్సుకి చాలా ఆహ్లాదంగా అనిపించింది.




పోఖరా చేరేసరికి రాత్రి 7.45 అయ్యింది. అంతవరకూ బస్సులో మా ప్రయాణం సాగుతూనే ఉంది. మధ్యలో బస్సుని 2సార్లు ఆపి, కాఫీ, టిఫిన్లు, భోజనాలు చేసాము. నేపాలులో ఎక్కడా కూడా బియ్యం దొరకవని తెలిసే, మా గ్రూపులో ఇద్దరు Electrical Rice Cooker & 1 rise bag తీసుకువచ్చారు, కొంతమంది ఊరగాయలు తెచ్చారు. ఉదయాన్నే హోటల్ రూములో కుక్కర్లో అన్నం వండి తెచ్చుకోవటంతో ఆ మధ్యాహ్నం అందరూ ఊరగాయలతోనే పచ్చని చెట్ల మధ్య వనభోజనాలు  చేసాం. రాత్రికి పోఖరాలో హోటల్ లో నిద్రచేసాము. పోఖరాలో కూడా వాతావరణం చాలా వేడిగానే ఉంది.

Day 4 - పోఖరా నుండి జామ్సం & ముక్తినాథ్ 
ఉదయాన్నే అందరం స్నానాలు చేసి, ముక్తినాథుడిని దర్శించటానికి అందరం 2 జతల బట్టలు ఒక చిన్న లగేజీ బ్యాగులలో పెట్టుకొని.....6 గంటలకు బస్సులో బయలుదేరగా 10 నిమిషాలలో పోఖరా Airportకి చేరుకున్నాం.




 పోఖరా నుండి Flait లో Jamsom చేరుకోవటానికి 15 నుండి 20 నిముషాలు పడుతుంది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు విమానాలు పోఖరా నుండి Jomsom 4 ట్రిప్స్ మాత్రమే తిరుగుతాయంట. వాతావరణం బాగోలేకపోతే మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు తిరగవు.  అక్కడ చాలా చిన్న విమానాలు ఉన్నాయి. ఆ విమానంలో 15 మంది మాత్రమే ప్రయాణం చేయగలరు.




మేమంతా విమానంలో 3 ట్రిప్స్ లో Jamsom చేరుకున్నాం. పోఖరాలో విమానం ఎక్కేటప్పుడు వేడిగా ఉన్న వాతావరణం Jomsomలో విమానం దిగేసరికి విపరీతమైన చల్లగా ఉంది. అందుకే ముక్తినాథ్ వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా చలికోట్లు (sweaters) తీసుకువెళ్ళవలసినదే. అక్కడ చుట్టూ మంచుకొండలే దర్శనమిచ్చాయి.



అందరం  9 గంటలకి  Jomsom చేరుకున్నాం. టిఫిన్లు చేసి హోటల్ లో మా లగేజీ ఉంచి, ఒక జత బట్టలు పట్టుకొని ముక్తినాథుడిని దర్శించడానికి బయలుదేరాము.

జామ్సం నుండి ముక్తినాథ్ ప్రయాణం 
హోటల్ నుండి 10 నిముషాలు జీపులో ప్రయాణం,  అక్కడ నుండి 10 నిముషాలు కాలినడకన వెళ్ళాలి.

జీపులు, బస్సులు ఉంటాయి. వాటిలో ప్రయాణించి ముక్తినాథ్ చేరుకోవాలి. మేం 22 members ఒక బస్సులో వెళ్ళాం. ముస్తంగ్ జిల్లాలో, జామ్సం కు 18 కిలోమీటర్లలలో దూరంలో ముక్తినాథ్ ఉంది.

బస్సులు నిలిచే చోటనే ఒక పెద్ద బౌద్ధ ఆరామం ఉంది.




ప్రయాణం చాలా ఆనందంగా, భయంగా అనిపించింది. ముక్తినాథ్ కు ఒక గంట ప్రయాణ సమయం. ఇక్కడికి వెళ్ళాలంటే ఒకరిద్దరు ప్రయాణం చేసేదికాదు. గ్రూపుగానే వెళ్ళాలి. ఒకప్రక్క ఎత్తైన పర్వతాలు, మరోప్రక్క ఆనందంగా ఉరకలువేస్తూ ప్రవహించే గండకీనది.


చూడటానికి ఆనందంగా ఉంది. అంతా ఘాట్ రోడ్డే. మట్టిరోడ్డు. బద్రీనాథ్, కేదారనాథ్ ప్రయాణాలలాగే ఉంది. ప్రయాణం చేస్తున్నంతసేపూ చుట్టూ రకరకాల పర్వతాలతో కూడిన ప్రకృతిని, ఎవరో చిత్రకారుడు చిత్రించినట్టుగా ఎంత అందంగా ఉందో. వర్ణించటం నాకు రావాటం లేదు.


ముక్తినాథ్ చేరుకున్నాక వాహనాలు నిలుపు స్థలం.


బస్సు గమ్యం చేరుకున్నాక సుమారుగా ఒకటి లేక ఒకటిన్నర కిలోమీటరు దూరం కాలిబాటన నడవాలి. నడవలేని వారిని గుర్రాలమీద లేదా స్కూటర్ల మీద తీసుకుని వెళతారు. కానీ మేం వెళ్లేసరికి గుర్రాలు కానీ, స్కూటర్లు కానీ ఏ సదుపాయము లేవు. ఏమని అడిగితే నేపాల్ లో భూకంపం వచ్చిన దగ్గర నుండి యాత్రవాసులు ఎక్కువగా రావటం లేదని, వారెవరులేరని చెప్పారు. అందువల్ల అందరం కాలినడకనే వెళ్ళాము. నేపాల్ దేశమంలో ప్రజలంతా ఇంచుమించుగా పర్యాటకం పైనే ఆధారపడి ఉన్నారు.




ఈ ప్రవేశద్వారం నుండి సుమారుగా 200 మెట్లు ఎక్కాలి, అప్పుడు ముక్తినాథుడు మనకు దర్శనమిస్తాడు.
   


ముక్తినాథ్ ఆలయం 






ఈ క్షేత్రంలో నాలుగు చేతులున్న నారాయణుని ప్రతిమ ఉంది. ఇది నారాయణుని స్వయంవ్యక్త ప్రదేశం. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఉంది. శ్రీ వైష్ణవులు ఎంతో భక్తితో సేవించుకునే 108 దివ్య క్షేత్రాల్లో ఇది ఒకటి . అదేవిధంగా 8 స్వయంభూ శ్రీవైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన ఏడు క్షేత్రాలు వరుసగా..... 1)శ్రీరంగం 2) శ్రీవైకుంఠం 3) తిరుమల 4) నైమిశారణ్యం 5) తోతాద్రి (మంగళగిరి నే మంగళాద్రి అని, తోతాద్రి అని, దివ్యాద్రి అని , ముక్త్యాద్రి లేక ముక్తి పర్వతము అని , స్తోతాద్రి అని వివిథ నామాలు) 6) పుష్కర్ మరియు 7) బద్రీనాథ్.... ఆలయంలో ముక్తినాథ్ (నారాయణుడు) స్వామి, శ్రీదేవి, లక్ష్మీదేవి, గరుడాళ్వార్, రామానుజుల వారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు సాలగ్రామాలు కూడా ఉన్నాయి.  ఈ క్షేత్రంలో స్వామి విగ్రహమూర్తిని కాకుండా సాలగ్రామ శిలను పూజిస్తారు.

ముక్తిధారలు


ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలో అంటే నాలుగైదు కిలోమీటర్ల దూరంలో గండకీ నది ఉద్భవించిన స్థలం ఉంది. ఆలయానికి వెనుకభాగం నుండి ప్రవహించే ఈ గండకీనదిని దారిమళ్ళించి....108 ముక్తిధారలని నిర్మించారు అని చెబుతారు. ఈ 108 ధారలు క్రింద స్నానం చేస్తే, 108 దివ్యదేశాలు సందర్శించిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. ఈ ధారల నుండి ప్రవహించే నీరు చాలా చాలా చల్లగా ఉన్నాయి. అసలే చుట్టూ మంచుపర్వతాలు. ఆ పర్వతాలు, ఆ వాతావరణంలో ఉంటేనే చల్లగా ఉంటుంది. అటువంటిది ఆ చల్లటి ధారల క్రింద స్నానం చేయటం అంటే సాహసమే. 


మాకైతే స్నానం చేసిన తరవాత కొంత సమయం వరకు చేతులు, కాళ్ళు స్వాధీనంలోకి రాలేదు. చలికి తట్టుకోలేనివారు చేతులకు గ్లోసేస్, కాళ్ళకి సాక్సెస్ వేసుకున్నారు. స్నానాల అనంతరం ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలు వెలిగించి, దేవుని స్తుతించాము. 






అప్పటికే అక్కడి వాతావరణం మారిపోయింది. 


ఏమాత్రం వర్షం పడినా వాహనాలు నడవవు, ఆ రాత్రికి అక్కడే ఉండిపోవలసి వస్తుందని మా గైడు చెప్పడంతో, అక్కడ ఉన్న మిగిలిన దేవాలయాలని దర్శించకుండా త్వరత్వరగా బస్సు స్టాండ్ వద్దకు చేరుకున్నాము.  






అందుకే మిగిలిన ఆలయాలని దర్శించే అవకాసం లేకపోయింది. మళ్ళీ జామ్సం చేరుకునేసరికి సాయంత్రం 5 అయ్యింది. అక్కడ ఆ హోటల్ వాళ్ళకి ముందుగానే ఆర్డర్ ఇవ్వడం వల్ల, మన దక్షినాది వంటలు వండి, వడ్డించారు. 

పొద్దుటి నుండి తిండిలేకపోవటం వలన, అన్నం, పప్పు, సాంబారు, పెరుగు వాసనలు తగలగానే అందరూ ఆవురావురుమంటూ తినేసి, ఎవరి రూములలోకి వారు వెళ్ళి, ప్రయాణ బడలిక వలన, మరుసటిరోజు పొద్దుటి వరకు ఎవ్వరూ లేవలేదు. 

అక్కడ(జామ్సంలో) సాయంత్రం 6 లేక 6. 30 అయ్యేసరికీ అందరూ తలుపులు ముసేసుకున్నారు. రోడ్డు పైన ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. అక్కడ వారికి ఫ్రిజ్, ఫానుతో పని ఉండదేమో. తలుపులు వేసుకుని ఉన్నా, పొద్దున్నే లేచేసరికి bottle లో ఉన్న నీరు ఫ్రిజ్ నీరులాగ చల్లగా అయ్యిపోయింది. బ్రష్ చేసుకోవాలన్నా వేడినీరే ఉపయోగించాం అందరం. అంటే అంత చల్లగా ఉందన్నమాట.

Day 5 - జామ్సం నుండి పోఖరా & పోఖరాలో కొన్ని ప్రదేశాలు చూసాం  
పొద్దున్నే నిద్రలేచి హోటల్ బయటకి వచ్చి చుస్తే ఎదురుగా పర్వతాలపైన రాత్రి అంతా కురిసిన మంచువల్ల వెండికొండలుగా ఎంత అందంగా కనిపించాయో. 

కొన్ని మంచుకొండలపైన సూర్యకిరణాలు పడి, బంగారు కొండలలాగా కనువిందు చేసాయి.



అందరూ వచ్చి చూసితీరవలసిందే ఆ దృశ్యాలని. ఒకప్రక్క వెండి, మరోప్రక్క బంగారు పర్వతాలు ఓహ్ చాలా చాలా బావుంది ఆ ప్రాంతమంతా. 
ఆరోజు వాతావరణం కొంచెం బాగోలేదని 3 ట్రిప్పులే విమానాన్ని నడిపారు. మేమంతా 2 ట్రిప్పులలోనే పోఖరా చేరుకున్నాము. 

రూములకు వచ్చి, స్నానాలు చేసి, పోఖరాలో చూడవలసిన కొన్ని ప్రాంతాలను చూసాము. 

1)బిందువాసిని అమ్మవారి కోవెల, 

శివాలయం








దేవతామూర్తులు
 నవదుర్గలు
 శివాలయంలో పూజలు


లక్ష్మీనారాయణులు


సీతారాములు

 రాధాకృష్ణులు




2)జలపాతాలు, 








ఎవరు విసిరిన పైసలు నీటిలో ఉన్నఅమ్మవారి చేతిలో పడతాయో వారికి అదృష్టం కలిసివస్తుందట







3)గుప్తేశ్వరుడు - గుహలు ఉన్నాయి గుహలలో ఉన్న ఈశ్వరుడు








గుహలలోకి దిగి క్రిందికి వెళితే, అక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది. 






4)అనంతరం ఒక పెద్ద చెరువు వద్దకు వెళ్ళాం. 




అక్కడ పడవలపై చెరువు మధ్యకు వెళితే, వారాహి అమ్మవారి కోవెల ఉంది.













అమ్మను దర్శించి, రూములకి వచ్చేసాము. మేం హోటల్ కి చేరుకున్నాక పెద్ద వర్షం పడింది. ఇక్కడ కూడా సాయంత్రం 7 అయ్యేసరికి షాప్స్ అన్నీ మూసేసారు. ఎవ్వరు రోడ్లపై కనిపించ లేదు. అందుకనే పోఖరాలో ఎవ్వరూ షాపింగ్ చెయ్యటం కుదరలేదు.  

Day 6 --- పోఖరా నుండి ఖాట్మండు
మళ్ళీ పొద్దున్నే పోఖరా నుండి ఖాట్మండుకి 6.30 కి ప్రయాణమయ్యాం. దారిలో 10 గంటలకి రహదారి పక్కనే ఆనుకొని ఉన్న మనోకామనాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించాం. 








అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఆలయానికి చేరుకోవటానికి, రోడ్డు, మెట్లు మార్గాలు లేవు. కేబుల్ కార్లు మాత్రమే ఉన్నాయి. రెండు ఎత్తైన పర్వతాలని దాటితే అమ్మవారిని దర్శించవచ్చును. 



అలా కేబులుకార్లలో ప్రయాణం చేస్తూ క్రిందకి చుస్తే పచ్చని పొలాలు, లోయలు ఎంత అందమగా కనిపించాయో. 

కేబులుకారు దిగాక సుమారుగా 200 మెట్లు ఎక్కి వెళ్ళాక కోవెల ఉంటుంది. అమ్మవారి కోవెల పునర్నిర్మాణంలో ఉంది. అందువల్ల మేము అమ్మవారి ఆలయ నమూనా చూసే భాగ్యం కలుగలేదు.  

అమ్మవారిని ఆలయానికి అనుకొని ఉన్న ఒక చిన్న గదిలో ఉంచారు. అక్కడే అమ్మవారిని దర్శించి, ఆమె ఆశీస్సులు అందుకొని, తిరిగివచ్చాం.













కేబులుకారులో వెళ్ళిరావటానికి ఒక మనిషికి 575 రూపాయలు. 

తరవాత మళ్ళీ ఖాట్మండుకి ప్రయాణం మొదలయ్యింది. మధ్యమధ్యలో ఆగి, టిఫిన్లు, భోజనాలు చేసుకొని, సాయంత్రం 6 గంటలకు ఖాట్మండు చేరుకున్నాం. వెళ్ళగానే హోటలు రూములో లగేజీ ఉంచి, shopping కోసం బయలుదేరాము. కాని మేం వెళ్లేసరికి 6.30 అవ్వటంతో అక్కడ షాపులు అన్నీ మూసేసి ఉన్నాయి. ఆరోజు tourism ఎక్కువ లేదని షాపులన్నీ త్వరగా ముసేసారంట. అందరం దిగాలు ముఖాలతో హోటలుకి తిరిగి వచ్చేసి, పడుకొన్నాం. 

Day 7 - ఖాట్మండులో ఆలయాల దర్శనం - స్వయంభూనాథ్ (బౌద్ధనాథ్)
ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని 6.30 నిమిషాలకి బస్సులో బయలుదేరి 7.30 కి స్వయంభుని (బౌద్ధస్థూపంని) దర్శించాం. ఈ ఆలయం కొండగుట్ట పైన ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే నడిచే ఓపిక ఉంటే నడిచి వెళ్ళొచ్చును, లేదా బస్సు, వ్యానులపైన వెళ్ళొచ్చును.











Vasudhara is the goddess of wealth and abundance in Buddhist theology. Often referred to as the "Bearer of Treasure," she is the Buddhist counterpart of the Hindu goddess Sri-Lakshmi.

కొండ దిగువన బుద్ధ అమీదేవ పార్క్ ఉంది. 







తరవాత జలనారాయణుని(బుద్ధనీలకంఠని) దర్శించాము. 





నీటిలో ఉన్న నారాయణుని సాలగ్రామ విగ్రహంను చూడగానే, వైకుంఠములో ఉండే నారాయణుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ, వైకుంఠ నారాయణుని తలపించాడు. అంత పెద్ద విష్ణు రూపాన్ని చూసేసరికి మనస్సు ఒక్కసారిగా ఉప్పొంగిపోయి పది నిమిషాలపాటు ఆనందభాష్పాలు ఆగలేదు.











అనంతరం పశుపతినాథుని ఆలయానికి వెళ్ళాం.


అక్కడ ఆలయం బయట పూజరులచే మేమంతా గోత్రనామాలతో పూజలు చేయించుకొని, రుద్రక్షమాలను ప్రసాదంగా స్వీకరించి, రుద్రుని దర్శనానికి లోనికి ప్రవేసించాము. ఆలయ ప్రవేశమార్గంలో ఒక పెద్ద నంది ఠీవిగా కూర్చొని మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ప్రతీ శివాలయంలో రాతి నందిని మనం చూస్తాం. కానీ ఇక్కడ ఇత్తడి నంది మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ పశుపతినాథుడు పంచముఖుడు. నాల్గువైపులా నాల్గు ముఖాలు కలిగి, శిరస్సు పైన 5వ ముఖముతో ఉంటాడు. ప్రతీ ఆలయానికి ఒక ముఖద్వారమే ఉంటుంది. కానీ ఇక్కడ శివయ్య పంచముఖుడు అగుటవలన నాలుగు వైపులా ఆలయ ద్వారాలు ఉంటాయి. నాలుగువైపులా తిరిగి, ప్రదక్షిణచేసి, శివుడిని దర్శించవచ్చు. నేను నాలుగు వైపులా ప్రదక్షిణ చేసి వచ్చేసరికి అక్కడ శివయ్యకి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం అర్థగంట సేపు జరిగింది. అంతసేపూ స్వామిని స్తుతిస్తూ, ఆ అభిషేకం చూస్తూ నేను అక్కడే ఉండిపోయాను. మావాళ్ళంతా ఆలయానికి చుట్టుప్రక్కల ఉన్న మిగిలిన ఆలయాలని దర్శించి, నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికి అభిషేకం పూర్తయ్యింది. మనస్సు తృప్తి చెందింది. పంచామృతాభిషేకం అనంతరం స్వామికి కవచం ధరింపచేసి, మూడువైపులా ఉన్న ద్వారాలను ఉదయం 11.30 నిమిషాలకి మూసివేస్తారు. ఒకవైపు ద్వారం నుండే స్వామిని దర్శించాలి. అందుకే ఎవ్వరు వెళ్ళినా 11.30 లోపే స్వామిని నాలుగు వైపుల నుండి చూసి, స్వామి నాలుగు ముఖాలను దర్శించవచ్చును. స్వామి దర్శనం అనంతరం ప్రాకారంలో ఉన్న భైరవుడు, సహస్రలింగాలు, అమ్మవారి కోవెల మొదలైన వాటిని దర్శించి బయటకు వచ్చాము. 

అక్కడ నుండి నేపాల్ మాహారాజ ప్యాలెస్ కి వెళ్ళి , అంతా చూసి, హోటలుకి, రూముకి తిరిగి వచ్చాం. మా హోటల్ ప్రక్కనే బజారు ఉండటంతో ఎవరికివారే వెళ్ళి, షాపింగ్ చేసుకువచ్చారు. 

Day 8 ఖాట్మండు నుండి నేపాల్ బోర్డర్ కి ప్రయాణం

ఆ రాత్రి అక్కడే ఉండి, మరుసటిరోజు ఉదయం 6.30కి ఖాట్మండు నుండి నేపాల్ బోర్డర్ కి మాప్రయాణం మొదలయ్యింది. ముక్తినాథ్ లో గండకీనదిని చూడలేదు, నదీ స్నానం చెయ్యలేదు అనే అసంతృప్తి అందరిలోనూ ఉంది. అది గ్రహించిన మా బస్సు డ్రైవరు బబ్లూ మార్గమధ్యంలో బస్సుని ఆపి, ఇక్కడే గండకీనది చివరి స్థానం. ఈ ప్రాంతం దాటితే మనకు గండకీనది కనిపించదు, ఎవరైనా వెళితే వెళ్ళి నదిని దర్శించి రండి అని చెప్పగానే, అందరం చాలా సంతోషంతో నదీమతల్లిని దర్శిద్దామని వెళ్ళాము. ఆరోజు శ్రావణమాసం ఆఖరి శుక్రవారం. గండకీనదిలో స్నానం చెయ్యాలని కోరిక ఆపుకోలేక అందరం స్నానాలు చేసేసాము. 







అందరి మనస్సులు తృప్తి చెందాయి. తిరిగి బోర్డర్ కి ప్రయాణమయ్యాము. బోర్డరుకి వచ్చేసరికి సాయంత్రం 6 అయ్యింది. అందరి వద్ద ఉన్న నేపాలీ కరెన్సీని మళ్ళీ ఇండియన్ కరెన్సీగా మార్చుకొన్నాము. మొత్తానికి నేపాల్ బోర్దరుని దాటి ఇండియాలోకి అడుగుపెట్టాం. రాత్రి 10.30 కి గోరఖ్పూర్ రైల్వేస్టేషన్ కి చేరుకున్నాము. స్టేషను ఎదురుగా ఉన్న హోటల్ లో రూములు తీసుకొని, రాత్రి నిద్రించాము.

Day 9
ఉదయం గోరఖ్పూర్ లో 6.30 కి రైలు ఎక్కాము. 

Day 10
మరుసటిరోజు సాయంత్రం 3.30 కి హైదరాబాదు స్టేషనులో దిగి సంతోషవదనాలతో ఎవరిళ్ళకి వాళ్ళు తిరుగుముఖం పట్టాం. ఇవి మా యాత్రావిశేషాలు.                                                                                                

No comments:

Post a Comment