September 25, 2015

నేపాల్ యాత్రా విశేషాలు Part 3 (పోఖరా నుండి ముక్తినాథ్ - తిరిగి పోఖరాకు)

నేపాల్ యాత్రా విశేషాలు Part 3 (పోఖరా నుండి ముక్తినాథ్ - తిరిగి పోఖరాకు)

Day 4 - పోఖరా నుండి జామ్సం & ముక్తినాథ్ 
ఉదయాన్నే అందరం స్నానాలు చేసి, ముక్తినాథుడిని దర్శించటానికి అందరం 2 జతల బట్టలు ఒక చిన్న లగేజీ బ్యాగులలో పెట్టుకొని.....6 గంటలకు బస్సులో బయలుదేరగా 10 నిమిషాలలో పోఖరా Airportకి చేరుకున్నాం.





 పోఖరా నుండి Flait లో Jamsom చేరుకోవటానికి 15 నుండి 20 నిముషాలు పడుతుంది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు విమానాలు పోఖరా నుండి Jomsom 4 ట్రిప్స్ మాత్రమే తిరుగుతాయంట. వాతావరణం బాగోలేకపోతే మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు తిరగవు.  అక్కడ చాలా చిన్న విమానాలు ఉన్నాయి. ఆ విమానంలో 15 మంది మాత్రమే ప్రయాణం చేయగలరు.




మేమంతా విమానంలో 3 ట్రిప్స్ లో Jamsom చేరుకున్నాం. పోఖరాలో విమానం ఎక్కేటప్పుడు వేడిగా ఉన్న వాతావరణం Jomsomలో విమానం దిగేసరికి విపరీతమైన చల్లగా ఉంది. అందుకే ముక్తినాథ్ వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా చలికోట్లు (sweaters) తీసుకువెళ్ళవలసినదే. అక్కడ చుట్టూ మంచుకొండలే దర్శనమిచ్చాయి.



అందరం  9 గంటలకి  Jomsom చేరుకున్నాం. టిఫిన్లు చేసి హోటల్ లో మా లగేజీ ఉంచి, ఒక జత బట్టలు పట్టుకొని ముక్తినాథుడిని దర్శించడానికి బయలుదేరాము.

జామ్సం నుండి ముక్తినాథ్ ప్రయాణం 

హోటల్ నుండి 10 నిముషాలు జీపులో ప్రయాణం,  అక్కడ నుండి 10 నిముషాలు కాలినడకన వెళ్ళాలి.

జీపులు, బస్సులు ఉంటాయి. వాటిలో ప్రయాణించి ముక్తినాథ్ చేరుకోవాలి. మేం 22 members ఒక బస్సులో వెళ్ళాం. ముస్తంగ్ జిల్లాలో, జామ్సం కు 18 కిలోమీటర్లలలో దూరంలో ముక్తినాథ్ ఉంది.

బస్సులు నిలిచే చోటనే ఒక పెద్ద బౌద్ధ ఆరామం ఉంది.





ప్రయాణం చాలా ఆనందంగా, భయంగా అనిపించింది. ముక్తినాథ్ కు ఒక గంట ప్రయాణ సమయం. ఇక్కడికి వెళ్ళాలంటే ఒకరిద్దరు ప్రయాణం చేసేదికాదు. గ్రూపుగానే వెళ్ళాలి. ఒకప్రక్క ఎత్తైన పర్వతాలు, మరోప్రక్క ఆనందంగా ఉరకలువేస్తూ ప్రవహించే గండకీనది.


చూడటానికి ఆనందంగా ఉంది. అంతా ఘాట్ రోడ్డే. మట్టిరోడ్డు. బద్రీనాథ్, కేదారనాథ్ ప్రయాణాలలాగే ఉంది. ప్రయాణం చేస్తున్నంతసేపూ చుట్టూ రకరకాల పర్వతాలతో కూడిన ప్రకృతిని, ఎవరో చిత్రకారుడు చిత్రించినట్టుగా ఎంత అందంగా ఉందో. వర్ణించటం నాకు రావాటం లేదు. 


ముక్తినాథ్ చేరుకున్నాక వాహనాలు నిలుపు స్థలం.




బస్సు గమ్యం చేరుకున్నాక సుమారుగా ఒకటి లేక ఒకటిన్నర కిలోమీటరు దూరం కాలిబాటన నడవాలి. నడవలేని వారిని గుర్రాలమీద లేదా స్కూటర్ల మీద తీసుకుని వెళతారు. కానీ మేం వెళ్లేసరికి గుర్రాలు కానీ, స్కూటర్లు కానీ ఏ సదుపాయము లేవు. ఏమని అడిగితే నేపాల్ లో భూకంపం వచ్చిన దగ్గర నుండి యాత్రవాసులు ఎక్కువగా రావటం లేదని, వారెవరులేరని చెప్పారు. అందువల్ల అందరం కాలినడకనే వెళ్ళాము. నేపాల్ దేశమంలో ప్రజలంతా ఇంచుమించుగా పర్యాటకం పైనే ఆధారపడి ఉన్నారు.





       


ఈ ప్రవేశద్వారం నుండి సుమారుగా 200 మెట్లు ఎక్కాలి, అప్పుడు ముక్తినాథుడు మనకు దర్శనమిస్తాడు.

ముక్తినాథ్ ఆలయం 





ఈ క్షేత్రంలో నాలుగు చేతులున్న నారాయణుని ప్రతిమ ఉంది. ఇది నారాయణుని స్వయంవ్యక్త ప్రదేశం. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఉంది. శ్రీ వైష్ణవులు ఎంతో భక్తితో సేవించుకునే 108 దివ్య క్షేత్రాల్లో ఇది ఒకటి . అదేవిధంగా 8 స్వయంభూ శ్రీవైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన ఏడు క్షేత్రాలు వరుసగా..... 1)శ్రీరంగం 2) శ్రీవైకుంఠం 3) తిరుమల 4) నైమిశారణ్యం 5) తోతాద్రి (మంగళగిరి నే మంగళాద్రి అని, తోతాద్రి అని, దివ్యాద్రి అని , ముక్త్యాద్రి లేక ముక్తి పర్వతము అని , స్తోతాద్రి అని వివిథ నామాలు) 6) పుష్కర్ మరియు 7) బద్రీనాథ్.... ఆలయంలో ముక్తినాథ్ (నారాయణుడు) స్వామి, శ్రీదేవి, లక్ష్మీదేవి, గరుడాళ్వార్, రామానుజుల వారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు సాలగ్రామాలు కూడా ఉన్నాయి.  ఈ క్షేత్రంలో స్వామి విగ్రహమూర్తిని కాకుండా సాలగ్రామ శిలను పూజిస్తారు.

ముక్తిధారలు




ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలో అంటే నాలుగైదు కిలోమీటర్ల దూరంలో గండకీ నది ఉద్భవించిన స్థలం ఉంది. ఆలయానికి వెనుకభాగం నుండి ప్రవహించే ఈ గండకీనదిని దారిమళ్ళించి....108 ముక్తిధారలని నిర్మించారు అని చెబుతారు. ఈ 108 ధారలు క్రింద స్నానం చేస్తే, 108 దివ్యదేశాలు సందర్శించిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. ఈ ధారల నుండి ప్రవహించే నీరు చాలా చాలా చల్లగా ఉన్నాయి. అసలే చుట్టూ మంచుపర్వతాలు. ఆ పర్వతాలు, ఆ వాతావరణంలో ఉంటేనే చల్లగా ఉంటుంది. అటువంటిది ఆ చల్లటి ధారల క్రింద స్నానం చేయటం అంటే సాహసమే. 


మాకైతే స్నానం చేసిన తరవాత కొంత సమయం వరకు చేతులు, కాళ్ళు స్వాధీనంలోకి రాలేదు. చలికి తట్టుకోలేనివారు చేతులకు గ్లోసేస్, కాళ్ళకి సాక్సెస్ వేసుకున్నారు. స్నానాల అనంతరం ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలు వెలిగించి, దేవుని స్తుతించాము. 






అప్పటికే అక్కడి వాతావరణం మారిపోయింది. 


ఏమాత్రం వర్షం పడినా వాహనాలు నడవవు, ఆ రాత్రికి అక్కడే ఉండిపోవలసి వస్తుందని మా గైడు చెప్పడంతో, అక్కడ ఉన్న మిగిలిన దేవాలయాలని దర్శించకుండా త్వరత్వరగా బస్సు స్టాండ్ వద్దకు చేరుకున్నాము.  






అందుకే మిగిలిన ఆలయాలని దర్శించే అవకాసం లేకపోయింది. మళ్ళీ జామ్సం చేరుకునేసరికి సాయంత్రం 5 అయ్యింది. అక్కడ ఆ హోటల్ వాళ్ళకి ముందుగానే ఆర్డర్ ఇవ్వడం వల్ల, మన దక్షినాది వంటలు వండి, వడ్డించారు. 

పొద్దుటి నుండి తిండిలేకపోవటం వలన, అన్నం, పప్పు, సాంబారు, పెరుగు వాసనలు తగలగానే అందరూ ఆవురావురుమంటూ తినేసి, ఎవరి రూములలోకి వారు వెళ్ళి, ప్రయాణ బడలిక వలన, మరుసటిరోజు పొద్దుటి వరకు ఎవ్వరూ లేవలేదు. 

అక్కడ(జామ్సంలో) సాయంత్రం 6 లేక 6. 30 అయ్యేసరికీ అందరూ తలుపులు ముసేసుకున్నారు. రోడ్డు పైన ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. అక్కడ వారికి ఫ్రిజ్, ఫానుతో పని ఉండదేమో. తలుపులు వేసుకుని ఉన్నా, పొద్దున్నే లేచేసరికి bottle లో ఉన్న నీరు ఫ్రిజ్ నీరులాగ చల్లగా అయ్యిపోయింది. బ్రష్ చేసుకోవాలన్నా వేడినీరే ఉపయోగించాం అందరం. అంటే అంత చల్లగా ఉందన్నమాట.

Day 5 
జామ్సం నుండి పోఖరా & పోఖరాలో కొన్ని ప్రదేశాలు చూసాం  
పొద్దున్నే నిద్రలేచి హోటల్ బయటకి వచ్చి చుస్తే ఎదురుగా పర్వతాలపైన రాత్రి అంతా కురిసిన మంచువల్ల వెండికొండలుగా ఎంత అందంగా కనిపించాయో. 

కొన్ని మంచుకొండలపైన సూర్యకిరణాలు పడి, బంగారు కొండలలాగా కనువిందు చేసాయి.


అందరూ వచ్చి చూసితీరవలసిందే ఆ దృశ్యాలని. ఒకప్రక్క వెండి, మరోప్రక్క బంగారు పర్వతాలు ఓహ్ చాలా చాలా బావుంది ఆ ప్రాంతమంతా. 
ఆరోజు వాతావరణం కొంచెం బాగోలేదని 3 ట్రిప్పులే విమానాన్ని నడిపారు. మేమంతా 2 ట్రిప్పులలోనే పోఖరా చేరుకున్నాము. 

రూములకు వచ్చి, స్నానాలు చేసి, పోఖరాలో చూడవలసిన కొన్ని ప్రాంతాలను చూసాము. 

No comments:

Post a Comment