July 25, 2020

సుమతీ శతకం 21 to 30 poems

సుమతీ శతకం 21 నుండి 30 వరకు పద్యాలు 
21
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ !
22
ఒక యూరికి నొక కరణము
నొక తీర్పరియైనగాక నొగి దఱుచైనన్ 
గకవికలు గాకయుండునె
సకలంబును గొట్టుపడక సహజము సుమతీ !
23
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాడే
గొల్లండుగాక ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ !
24
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడం బడుగలిమిలేని వసుధను సుమతీ !
25
కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!

26
కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుడైనను,
తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ !
27
కమలములు నీరు బాసిన
గమలాప్తు రశ్మిసోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పిన
దమ మిత్రులే శత్రులౌట తధ్యము సుమతీ !
28
కరణము గరణము నమ్మిన
మరణాంతక మౌను గాని మనలేడు సుమీ,
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ !
29
కరణముల ననుసరింపక
విరిసంబున దిన్నతిండి వికటించు జుమీ
యిరుసున గందెన బెట్టక
పరమేశ్వరుబండియైన బాఱుదు సుమతీ!
30
కరణము సాదై యున్నను
గరి మద ముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్నను
గరమరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!

No comments:

Post a Comment