సుమతీ శతకం 31 నుండి 40 వరకు
31
కవి కాని వాని వ్రాతయు,
నవరస భావములు లేని నాతుల వలపున్,
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ
32
కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్,
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
33
కారణములేని నగవునుc
బేరణమునులేని లేమ పృధివీ స్ధలిలోc
బూరణములేని బూరెయు
వీరణములులేని పెండ్లి, వృధరా సుమతీ.
34
కులకాంతతోcడ నెప్పుడుc
గలహింపకు, వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠకంఠి కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లరు సుమతీ.
35
కూరిమిగల దినములలో
నేరము లెన్నcడునుc గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను,
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.
36
కొంచెపు నరు సంగతిచే
నంచితముగ గీడువచ్చునది యెట్లన్నన్
గించిత్తు నల్లి కఱచిన
మంచమునకు బెట్లు వచ్చు మహిలో సుమతీ !
37
కొఱగాని కొడుకు బుట్టిన
కొఱగామియెకాదు తండ్రి గుణముల జెఱచున్
చెఱకుతుద వెన్ను పుట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ !
38
కోమలి విశ్వాసంబును
బాములతో జెలిమి యన్య భామల వలపున్
వేముల తియ్యదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ !
39
గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు ధరలో
గడనుడుగు మగని జూచిన
నడపీనుగు వచ్చె ననుచు నగుదురు సుమతీ
40
చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతులతో
మంతనములు మానుమిదియె మతముర సుమతీ !
No comments:
Post a Comment