July 8, 2020

సుమతీ శతకం 1-108 Poems

సుమతీ శతకం 1 - 108 Poems
01
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు ఔరాయనగా
ధారాళమైన నీతులు 
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ!
సుమతీశతక కారుడు 'సుమతీ' అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్పెదనని తెలిపినాడు. లోకములోనీతి మార్గమును ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహము పొందిన వాడనై లోకులు మెచ్చుకొను నట్టి మరలమరల చదువ వలెను అనే ఆశకలుగునట్లుగా వచించుచున్నాను.
2
అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునcదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయుగదరా! సుమతీ.
భావం: సమయమునకు సహాయముచేయని చుట్టమును, నమస్కరించి ననూ వరములీయని దైవమును, యుద్ధములో తానెక్కగా పరుగెత్తని గుర్రమును వెంటనే విడువ వలయును.
3
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుట కంటెన్.
వడిగల యెద్దులగట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ.
భావం: అడిగిన జీతమీయని ప్రభువును సేవించి కష్తపడుట కన్న, వడిగల యెద్దులను గట్టుకొని పొలము దున్నుకొని జీవించుటయే మేలు.
4
అడియాస కొలువుగొలువకు
గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిడిదో డరయ కొంటి నరుగకు సుమతీ.
భావం: వ్యర్ధమైన యాశగల కొలువును, దేవాలయము నందలి యధికారము, విడువకుండా చెడ్డవారితో స్నేహమును, అడవిలో తోడులేకుండక ఓంటరిగా పోవుటయును తగినవికావు. (కనక, వాటిని మానివేయవలెను.
5
అధరము కదిలియు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతీ
6
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ!
7
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుcడున్,
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
8
అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచి బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ.
9
ఆకొన్న కూడె యమృతము,
తాcగొంకక నిచ్చువాడె దాత ధరిత్రిన్,
సో కోర్సువాడె మనుజుడు,
తేకువగలవాడె వంశ తిలకుడు సుమతీ.
10
ఆకలి యుడుగని కడుపును
వేకటియగు లంజపడుపు విడువని బ్రతుకున్,
బ్రా కొన్న నూతి యుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతీ!
11
ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులు
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ!
12
ఇమ్ముగcజదువని నోరును,
'అమ్మా' యని పిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ములcమబ్బుని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ.
13
ఉడుముండదె నూఱేండ్లునుc
బడియుండదె పేర్మిcబాము పదినూఱేండ్లున్
మడుపునcగొక్కెర యుండదె
కడునిలcబురుషార్దపరుcడు గావలె సుమతీ.
14
ఉత్తమగుణములు నీచున
కెత్తెఱుగున గలుగనేర్చు నెయ్యడలన్ దా
నెత్తిచ్చి కఱగబోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!
15
ఉదకము ద్రావెడు హయమును, మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్, మొదవు కడ నున్న వృషభము, జదువని యానీచు గడకు జనకుర సుమతీ
16
ఉపకారికి నుపకారము
విపరీతముగాదుసేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక జేయువాడె నేర్పరి సుమతీ!
17
ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను, జెఱకు కైవతినే పో
నెపములు వెదకునుcగడపటc
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ.
18
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుcగువాcడు ధన్యుcడు సుమతీ.
19
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించు విధంబు గదరా సుమతీ!
20
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పులుగc జెఱువు నిండినc
గప్పలు పదివేలుచేరుcగదరా సుమతీ.
21
ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ
22
ఒక యూరికి నొక కరణము
నొక తీర్పరియైనదక నొగి దఱుచైననౌ
గకవికలు గాకయుండునె
సకలంబును గొట్టుపడక సహజము సుమతీ!
23
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాడే
గొల్లండు గాక ధరలో
గొల్లడును గొల్లడౌనె చుణమున సుమతీ.
24
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడగబడు గలిమిలేమి వసుధను సుమతీ.
26
కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!
27
కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్, ముప్పున దరిద్రుడైనను, తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ
28
కమలములు నీరు బాసినc
గమలాప్తు రశ్మిసోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పినc
దమ మిత్రులే శత్రులౌట తధ్యము సుమతీ.
29
కరణము గరణము నమ్మిన
మరణాంతక మౌను గాని మనలేడు సుమీ,
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ
30
కరణముల ననుసరింపక
విరిసంబున దిన్నతిండి వికటించు జుమీ
యిరుసున గందెన బెట్టక
పరమేశ్వరుబండియైన బాఱుదు సుమతీ!
31
కరణము సాదై యున్నను
గరి మద ముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్నను
గరమరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!
32
కసుగాయఁగఱచి చూచిన
మసలక తన యొగరు గాక మధురంబగునా?
పస గలుగు యువతు లుండఁగఁ
బసిబాలలఁబొందువాఁడు పశువుర సుమతీ!
33
కవి కాని వాని వ్రాతయు,
నవరస భావములు లేని నాతుల వలపున్, దవిలి చను పంది నేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ
34
కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్,
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
35
కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్ బ్రేమమున జెఱకు పిప్పికి చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ
36
కారణములేని నగవునుc
బేరణమునులేని లేమ పృధివీ స్ధలిలోc
బూరణములేని బూరెయు
వీరణములులేని పెండ్లి, వృధరా సుమతీ.
37
కులకాంతతోcడ నెప్పుడుc
గలహింపకు, వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠకంఠి కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లరు సుమతీ.
38
కూరిమిగల దినములలో
నేరము లెన్నcడునుc గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను,
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.
39
కొంచెపు నరు సంగతిచే
నంచితముcగ గీడువచ్చునది యెట్లన్నన్
గించిత్తు నల్లి కఱచిన
మంచమునకుc బెట్లు వచ్చు మహిలో సుమతీ.
40
కొక్కోకమెల్ల జదివిన,
చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్, మిక్కిలి రొక్కము లియ్యక, చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ
41
కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్ చెఱకు తుద వెన్ను బుట్టిన జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ
42
కోమలి విశ్వాసంబును,
బాములతో జెలిమి, యన్య భామల వలపున్, వేముల తియ్యదనంబును, భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ
43
గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో, గడ నుడుగు మగని జూచిన నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ
44
చింతింపకు కడచిన పని
కింతులు వలతురని నమ్మ కెంతయుమదిలో
నంతఃపుర కాంతులతో
మంతనముల మానుమిదియె మతముర సుమతీ.
45
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరువైన యట్లు పామరుcడుదగన్
హేమంబుcగూడcబెట్టిన
భూమీశుల పాలcజేరు భువిలో సుమతీ.
46
చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్ నెట్టుకొని యాశ్రయింతురు గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ
47
చేతులకు తొడవు దానము,
భూతలనాథులకుc దొడవు బొంకమి ధరలో
నీతియె తోడ వెవ్వారికి
నాతికి మాలంబు తొడవు నయముగ సుమతీ.
48
తడ వోర్వక, యొడ లోర్వక, కడు వేగం బడిచి పడిన గార్యం బగునే, తడ వోర్చిన, నొడ లోర్చిన, జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ
49
తన కోపము తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టం‌బౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!
50
తన యూరి తపసి తపమును,
తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్, దన పెరటి చెట్టు మందును, మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ
51
తన కలిమి యింద్ర భోగము,
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్, దన చావు జల ప్రళయము, తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ
52
తనవారు లేని చోటను
జన వించుక లేనిచోట జగడము చోటన్,
అనుమానమైన చోటను,
మనుజును ట నిలువఁదగదు మహిలో సుమతీ!
53
తములము వేయని నోరును
వినుతులతో జెలిమి సేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలకుఁను
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ !
54
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
56
తలమాసిన వొలుమాసిన
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
కులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!
57
తాననుభవింప నర్ధము
మానవపతి జేరు గొంత మఱి భూగతమౌ గానల నీగలుగూర్చిన తెనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ !
58
దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా
నెగ్గుఁ బ్రజ్జ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁబొడచుట సుమతీ!
59
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్
దనవారి కెంత గలిగిన
తన భాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ!
60
ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీcదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ.
61
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్,
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ.
62
నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మగసాలి వాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడివానిని,
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ
63
నయమున బాలుంద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియొ
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ.
64
నరపతులు మేరదప్పిన
దిర మొప్పగ విధవ యింట దీర్పరియైనన్
గరణము వైదికుడయినను
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!
65
నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును దా నవివేకి కెంత జెప్పిన జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ
66
నవ్వకుమీ సభలోపల
సవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్,
నవ్వకుమీ పరసతులతో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ.
68
పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను
మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ!
69
పతికడకు తను గూర్చిన
సతికడకును, వెల్పుకడకు సద్గురు కడకున్
సుతుకడకును రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ !
71
పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై, పరులు దను బొగడ నెగడక, పరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ !
72
పరసతి కూటమి గోరకు
పరధనముల కాసపడకు పరునెంచకుమీ
సరిగాని గోష్టి చేయకు
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ !
79
పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచవి జెరుచు గావున
తాలసుడగువానిపొందు వలదుర సుమతీ !
80
పాలసునకైన యాపద
జాలింపబడి తీర్చదగదు సర్వజ్ఞువకున్
దే లగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ. 
81
పిలువని పనులకు బోవుట,
గలయని సతి గతియు, రాజు గానని కొలువుం, బిలువని పేరంటంబును, వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ
82
పురికిని ప్రాణము గోమటి
వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్ గరికిని ప్రాణము తొండము సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ !
83
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ !
84
పులిపాలు దెచ్చియిచ్చిన
నలవడగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు ధనముబోసిన
వెలయాలికిగూర్మిలేదు వినరా సుమతీ !
85
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినముల గనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ. 
86
పొరుగున బగవాడుండిన
నిర నొందగ వ్రాతకాడె యేలికయైనన్
ధరగాపు గొండెయైనను
గరణులకు బ్రతుకులేదు గదరా సుమతీ!
87
బంగారు కుదువబెట్టకు
నంగడి వెచ్చము లాడకు,
సంగరమున బాఱిపోకు సరసుడవైతే
వెంగలితో జెలిమివలదు వినురా సుమతీ !
88
బలవంతుడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుటమేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ.
89
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుట సుమతీ.
90
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచు దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు గీలూడినట్లు జరుగదు సుమతీ
91
మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభటకోటి ధరిత్రిన
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
92
మానధనుడాత్మదృతిఁచెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెండు జలము లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ!
95
'రా, పొ'మ్మని పిలువని యా
భూపాలునిగొల్వ భుక్తి ముక్తులు గలపే ?
దీపంబు లేని యింటను
జే పుణికిళ్ళాడినట్లు సిద్ధము సుమతీ!
96
రూపించి పలికి బొంకకు,
ప్రపగు చుట్టంబు కెగ్గు పలుకకు, మదిలో
గోపించు రాజుc గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ.
97
లావుగలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
98
వఱదైన చేనుదున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ,
పరులకు మర్మము సెప్పకు,
పిఱికికి దళవాయితనముఁబెట్టకు సుమతీ!
99
వరిపంట లేని యూరును
దొరలుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
100
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
101
వీడెము సేయని నోరును
చేడెల యధరామృతంబుఁజేయని నోరున్
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
104
వేసరపు జాతి గానీ,
వీసము దా జేయనట్టి వీరిడి గానీ, దాసి కొడుకైన గానీ, కాసులు గల వాడె రాజు గదరా సుమతీ
105
శుభముల పొందని చదువును, నభినయముగ రాగరసము నందని పాటల్, గుభ గుభలు లేని కూటమి, సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ
106
సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ.
107
సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
108
స్త్రీలయెడల వాదులాడకు
బాలురతోc జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ.

No comments:

Post a Comment