July 17, 2014

యాదగిరిగుట్ట పంచ నరసింహస్వామి

యాదగిరిగుట్ట  పంచ నరసింహస్వామి


పురాణ గాథ 

ఒకప్పుడు రాతిగుట్టలతో గుహలాగా ఉన్న ప్రదేశము ..... ఈనాడు భూలోకంలోని ప్రజలందరూ దర్శించే పుణ్యక్షేత్రంగా పంచ నరసింహస్వామి కొలువై ఉన్న ప్రదేశం. ఈ అద్భుతానికి వెనుక ఒక పురాణకథ ఉంది 

త్రేతాయుగంలో జీవించిన ఒక మహనీయుడు, మహర్షి ఋష్యశృంగుడు, అతని సతీమణి శాంతాదేవిల ఏకైక పుత్రుడు "యాదర్షి" ...... ఇతనికి ఒకరోజు విష్ణువును చూడాలన్న ఆశ కలిగింది. మహావిష్ణువుని చూడాలనుకున్న మునులందరూ సంకల్పించే కఠిన తపస్సు తాను కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు. భువనగిరి - రాయగిరికి మధ్యనున్న కొండపైనున్న గుహలో యదర్షి తపస్సు చేయాలని నిర్ణయించుకొని నిరంతరం స్వామిని ధ్యానిస్తూ కఠినమైన తపస్సు చేయసాగాడు. 

యాదర్షి చేస్తున్న తపస్సుకు పరంధాముడు పరవశించి, ప్రసన్నుడై అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇన్నిరొజులుగా మనసులో ఉన్న ఆ స్వామి రూపాన్ని ఇప్పుడు నేరుగా చూసి సంతోషంతో తలమునకలయ్యాడు. యాదర్షికి తను ఐదు జన్మలెత్తి ఐదుసార్లు ఆ నారాయణుడిని దర్శించినంత సంతోషం కలిగింది. 


నారాయణుడు, నరసింహ అవతారంలో వివిధ రూపాలలో ---- జ్వాలానరసింహస్వామి, యోగానరసింహస్వామి, గండభేరుండ నరసింహస్వామి, ఉగ్రనరసింహస్వామి మరియు లక్ష్మి నరసింహస్వామిగా దర్శినమిచ్చారు. 

తరవాత ఈ ఐదు రూపాలలోనూ పూజించటానికి వీలుగా సాలిగ్రామ రూపంలో దర్శనమిచ్చాడు నరసింహస్వామి. ఆవిధంగా యాదర్షికి నరసింహరూపంలో దర్శనమిచ్చిన చోటే ఈ యాదగిరిగుట్ట. మూడువందల అడుగుల  ఎత్తు మాత్రమే గల కొండ కాబట్టి  ప్రజల వాడుకలో గుట్ట గా  పిలవబడుతూ,యాదగిరిగుట్ట గా ప్రసిద్ధి చెందింది.



స్థల పురాణం 

యాదర్షి తపస్సును మెచ్చిన నారాయణుడు, హనుమంతుడుని దూతగా పంపి, యాదర్షిని ఒక పవిత్రమైన చోటికి రప్పించాడు. అక్కడ నరసింహస్వామి రూపంలో యాదర్షికి దర్శనమిచ్చాడు. 

మహదానందం పొందిన యాదర్షికి నరసింహస్వామి దర్శనమిచ్చిన చోటే స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ చోటు ఈనాడు యాదగిరిగుట్టకు ఆలయం ఉన్న కొండ క్రింది ప్రాంతం నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 

యాదర్షి మోక్షం పొందిన తరవాత ఆ చోట నరసింహస్వామి ఆలయం ఉందని తెలుసుకున్న ఆటవికులు కొందరు అక్కడ పూజలు మొదలుపెట్టారు. చదువు - సంధ్యలు లేని ఆ ఆటవిక ప్రజల పూజావిధానం నచ్చని నరసింహుడు కొండ పైభాగం చేరుకున్నాడు. ఆటవికులు ఎంత వెతికినా వారికి కనిపించలేదు. 

కొన్ని సంవత్సరాలు గడచిన అనంతరం పరమ భక్తురాలైన ఒక ఆటవిక స్త్రీకి కలలో నరసింహ స్వామి దర్శనమిచ్చి కొండపైకి రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఆమెకు ఐదు రూపాలలో నరసింహస్వామి దర్శనమిచ్చాదంట. 

పురాతనమైన, సాంప్రదాయమైన యాదగిరిగుట్ట నరసింహస్వామి భక్తులకు ఎంతో మహత్యమున్న ప్రసిద్ధి చెందిన క్షేత్రము. ఆంజనేయుని అనుగ్రహం వల్లనే యాదర్షి కి  నరసింహస్వామి  దర్శనం లభించింది కాబట్టి  మహర్షి కోరిక మేరకు  శ్రీ ఆంజనేయుడే ఇచ్చట  క్షేత్రపాలకుడు గా నిలిచి పూజలందుకుంటున్నాడు

మూలవిగ్రహం ఐదు రూపాలలో కొలువైనా .... ఉగ్రనరసింహస్వామి తప్ప మిగిలిన నలుగు రూపాల్లో ఈనాటికీ మనం చూడగలం. ఉగ్రనరసింహస్వామి యొక్క ఉగ్రం మానవులు చూసి తట్టుకోలేరని ఆ రూపం అదృశ్యంగా ఉంటుందని చెబుతుంటారు.ఆలయ గోపురంపైన అమరిన మూడు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు ఉన్న సుదర్శన చక్రం ప్రకాశిస్తుంది. ఈ సుదర్శన చక్రం గర్భగుడికి పైన ఉంటుంది. ఆరు కిలోమీటర్ల దూరం నుండే మనకు కనిపిస్తుంది. ఇది ....... పూర్వం ప్రజలు స్వామిని దర్శించి రాత్రివేళల్లో తిరిగి వెళ్ళేటప్పుడు వారికి మార్గాన్ని చూపే దీపంలాగా ఉండేదంట. 


ఒక గుహలో, గర్భగుడి లోపల రాళ్ళే గొడుగులా ప్రకృతి చాటిచెప్పే భక్తి నిజంగా అపురూపం. ఈ గొడుగుకు క్రింద మూలవిరాట్టు లక్ష్మీ నరసింహస్వామి మనకు దర్శనమిస్తారు. మిగిలిన ఆలయాలలో కొలువైనట్టు .... లక్ష్మీదేవి నరసింహస్వామి ఒడిలో కాకుండా --- ఆయనకు ఎడమవైపు నిల్చునట్టున్న విగ్రహం మనకు దర్శనమిస్తుంది. 

రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట.

ఈ నరసింహస్వామి ఎంతో గొప్పవైద్యుడు. ఆయన ముందు శరణాగతి అయితే ... ఎన్నో రోగాలను కూడా నయం చేస్తున్నాడని ప్రతీతి. భక్తుల కలలో కనిపించి శస్త్ర చికిత్స చేశాడని, మందులు ఇచ్చాడని, త్వరగా నయమౌతుందని ఆశీర్వదించాడని...... రోగాలు నయమైపోయిన ఎందరో భక్తులు ఈస్వామిని గురించి ఎంతగానో ప్రశంసిస్తుంటారు. మంత్రాలూ, తంత్రాలు, క్షుద్రశక్తులు వలన వచ్చే సమస్యలను ఈ స్వామి సన్నిధికి చేరి ప్రార్థిస్తే, ఎటువంటి సమస్య అయినా నయమవుతుంది. ఎంతో పెద్ద సమస్య కూడా చాలా సులువుగా తీరిపోతుంది. భక్తుల కలలో కనిపించి, మానసిక రుగ్మతను నయం చేశాడని కూడా చెప్పుకుంటారు. గ్రహదోషాల వల్ల కష్టాలపాలైన వారికీ ఈ స్వామి అభయహస్తం కాపాడుతుంది. కన్నతల్లిలా చూసుకుంటూ, కాపాడుతూ తన భక్తుల ఆరోగ్యాన్ని రక్షిస్తున్న ఈ స్వామిని వైద్యనరసింహుడు అని కూడా చెబుతుంటారు. మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.

ప్రతి సంవత్సరము ఫాల్గుణ శుద్ధ విదియ నుండి ద్వాదశి  వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రావణ శుద్ధ దశమి నుండి ఏకాదశి వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయి. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున తెప్పోత్సవము నిర్వహిస్తారు. .ప్రతి నెలలోను శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శతఘటాభిషేకాన్ని చేస్తుంటారు.    

అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే యాదగిరిగుట్టను దర్శిద్దాం....... మోక్షాన్ని పొందుదాం.   


1 comment:

  1. చాలా బావుంది.. ధన్యవాదములు

    ReplyDelete