శ్రీ ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం ....... భావసహితం.
దేవతాకార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
దేవతలను అనుగ్రహించి, రాక్షస సంహారం చేయటం కోసం, స్తంభం నుండి అవతరించిన నృసింహస్వామీ నీకు నమస్సులు.
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
వామభాగాన లక్ష్మీదేవిచే ఆలింగనం చేయబడి, భక్తులు కోరిన వరాలు ప్రసాదించే కల్పతరువైన లక్ష్మీవల్లభా నీకు నమస్సులు.
ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
శత్రువైన హిరణ్యకశిపుడి సంహారనంతరం అతని పేగులనే మాలగా ధరించి, శంఖు, చక్రం మొదలగు వివిధ ఆయుధాలను ధరించిన నృసింహస్వామి! నన్ను ఈ అప్పుల నుండి కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నా.
స్మరణాత్సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
కేవలం నీ నామస్మరణతోనే అన్ని పాపాలను తరిమికొట్టే ఓ నృసింహస్వామి! నీకు నమస్సులు.
సింహనాదేన మహతా దిగ్దంతి భయనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
శత్రు సంహారానంతరం నరసింహస్వామి చేసిన వీర ఘర్జన, భక్తులలో అన్ని దిక్కులలో ఉన్న భయాలను తొలగించేటట్టుగా ఉన్నది. అట్టి స్వామి! నీకు నమస్సులు.
ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
ప్రహ్లాదునిపై కరుణావర్షం కురిపించి, హిరణ్యకశిపుని సంహరించిన ఆ లక్ష్మీనరసింహస్వామికి ప్రణామములు.
క్రూరగ్రహైః పీడితానాం భక్తానా మభయప్రదం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
దుష్టగ్రహ బాధల నుండి తక్షణ విముక్తి ప్రసాదించి, భక్తులకి అభయాన్ని ప్రసాదించే స్వామికి వందనములు.
వేదవేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
వేదాలకు సారమైన స్వామి, అన్ని యజ్ఞయాగాదులకు ఈశ్వరుడై ఉండి బ్రహ్మరుద్రాదులచే సదా కీర్తించబడుతున్న నృసింహస్వామి, ఆర్ధిక ఇబ్బందులనుండి మమ్ములను ముక్తులుగా చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా.
య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితం
అనృణీ జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్
ఈ శ్లోకాన్ని ప్రతీరోజు ఎవరైతే నిత్యమూ మూడు పూటలా త్రికరణశుద్ధిగా చదువుతారో, వారు తమకున్న అన్ని ఋణబాధలనుండి విముక్తి లభించటమే కాక తమకు న్యాయంగా రావలసిన సొమ్ము కూడా త్వరగా తిరిగి లభిస్తుంది.
ఇతి ఋణవిమోచన నృసింహస్తోత్రం సమాప్తం.
(ఈ స్తోత్రాన్ని అన్ని అరిష్టాలు, దోషాలు, ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు సాయం సమయంలో ఒకసారి స్మరిస్తే మంచి ఫలితం లభిస్తుంది.)
No comments:
Post a Comment