కుమార శతకం 11 నుండి 20 శ్లోకాలు
యమ్మును భక్తియును గలిగి యారాధింపన్
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మునఁ బ్రేమింపఁ గీర్తి దనరుఁ కుమారా!
భావం:--
ఓ కుమారా! పిన్నవారు పెద్దవారిపట్ల భయభక్తులను కలిగి యుండాలి. తమ్ముళ్ళూ అన్నపట్ల గౌరవమర్యాదలను ప్రదర్శించాలి. అన్నకూడా తమ్ముళ్ళను అదే భావముతో చూడాలి. ఇటువంటి అన్నదమ్ములు, లోకమున పేరు ప్రఖ్యాతులు పొందగలరు.
12 వ శ్లోకం:--
తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!
భావం:--
ఓ కుమారా! కొడుకు చెడ్డవాడైన తండ్రి తప్ప. ఇది అందరకు తెలిసినదే. గావున ఈ సత్యమును గుర్తెరింగి నీ తల్లిదండ్రులకు చెడ్డపేరు రాకుండునట్లు నడుచుకొనుము.
13 వ శ్లోకం:--
మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు ;
నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!
భావం:--
ఓ కుమారా! నీ రహస్యములెన్నడును ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.
14 వ శ్లోకం:--
తల్లిని దండ్రిని సహజల
నల్లరి బెట్టినను వారలలుగుచు నీపై
నుల్ల మున రోయు చుందురు
కల్లరి వీడనుచుఁ గీర్తిఁ గందం గుమారా!
భావం:--
ఓ కుమారా! కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని అల్లరి పెట్టరాదు. అట్లు చేసినచో వారు నీపై కోపించి నిన్ను అబద్ధములాడువానిగా చిత్రించి మనస్సునందు కోపపడుదురు. దానివలన నీకు అపకీర్తి వచ్చును. కావున అట్లు చేయరాదు.
15 వ శ్లోకం:--
అపం దన తల్లిగ మే
లొప్పంగని జరుపవలయు నుర్వీస్థలి జి
న్నప్పుడు చన్నిడి మనిసిన
యప్పడతియు మాతృతుల్యయండ్రు కుమారా!
భావం:--
ఓ కుమారా! తన అక్కను తల్లివలె భావించాలి. అమ్మ తరువాత అక్కయ్యే మనకు తల్లి.కావున అక్కను తల్లిగా పూజించాలి. ఆమె మనసును బాధింపకు. ఆమె దీవెనలే మనకు సోపానమార్గాలు. అట్లే తనను ఎత్తుకొని పోషించినవారిని (దాదితో సహా) కూడా తల్లితో సమానంగా గౌరవించాలి.
16 వ శ్లోకం:--
ఆకులత బడకు మాపద
నేకతమునఁ జనకు త్రోవ నింతికి దగు నం
తేకాని చన వొసంగకు
లోకులు నిన్నెన్న సుగుణలోల! కుమారా!
భావం:--
సుగుణాశక్తి గల కుమారా! ఆపదసమయమందు ఆందోళన పడరాదు. తోడులేనిదే ఒంటరిగా పోరాదు. భార్యకు తగినంత చనువును మాత్రమే ఇయ్యవలయును. ఎక్కువ ఇచ్చినచో నిన్ను తక్కువ చేయును . ఈ విషయములన్నింటిని తెలిసికొని మసలుము.
17 వ శ్లోకం:--
తనుజులనుం గురు వృద్ధుల
జననీ జనకులను సాధుజనుల నెవడు దా
ఘను డయ్యు బ్రోవడో యా
జనుడే జీవన్మృతుండు జగతి కుమారా!
భావం:--
ఓ కుమారా! మనిషి తానెంత గొప్పవాడైనను తన ఆలుబిడ్డలను, తల్లితండ్రులను, గురువులను, పెద్ద్దలను, మంచివారిని ఆదరించాలి. అట్లు చేయనివాడు బ్రతికి యుండినను చనిపోయిన వానితో సమానము.
18 వ శ్లోకం:--
దుర్జనుల నైనఁ దిట్టకు
వర్జింపకు సుజన గోష్టి; పరులను నెల్లన్
నిర్జింతుననుచుఁ ద్రుళ్ళకు;
దుర్జనుడండ్రు నిను నింద దోప కుమారా!
భావం:--
ఓ కుమారా! చెడ్డవారిని కూడా దూషింపరాదు. మంచివారున్న చోటును వదలరాదు. మంచివారున్న చోటును వదలరాదు. శత్రువులను చంపుతానని విర్రవీగరాదు. అట్లు చేసినచో నిన్ను చెడ్డవాడని అంటారు. నిందలు వేస్తారు. నీకు చెడ్డ పేరు వస్తుంది.
19 వ శ్లోకం:--
సంపద గల వారిని మో
దింపుచు జుట్టుకొని యందు రెల్లప్పుడు న
త్సంపద తొలంగిన నుపే
క్షింపుడు రవివేక జనులు క్శితిని కుమారా!
భావం:--
ఓ కుమారా! లోకమందు ధనమే నిత్యమని తెలివి లేనివారు భావిస్తారు. డబ్బున్నవారినే ఆశ్రయించి తమ పబ్బము గడుపుకొంటారు.సంపదలు పోయిన వెంటనే మరల వారినే దూషిస్తారు. ఎంత అవివేకులు ఈ జనులు.
20 వ శ్లోకం:--
సద్గోష్ఠి సిరియు నొసగును
సద్గోష్ఠ్యె కీర్తి బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!
భావం:--
ఓ కుమారా! సజ్జనులు, సత్ఫురుషుల సభలయందే మంచి జ్ఞానమును సంపదింతురు. దానివలన సిరి సిద్ధించును సద్గోష్ఠి వలన కీర్తి పెరుగును, సంతృప్తి కలుగుతుంది. సద్గోష్ఠి వలన సర్వపాపములు సమసిపోవును.
No comments:
Post a Comment