September 13, 2013

మహిషాసురుని జన్మ వృత్తాంతం.

మహిషాసురుని జన్మ వృత్తాంతం.       

దానవ వంశానికి మూలపురుషుడు దనువు. అతనికి రంబుడు కరంబుడు అనే ఇద్దరు కుమారులు గలరు. వారికి సంతానము కలుగలేదు. ఆ దిగులతో వారిద్దరూ సంతానము కొరకు తపస్సు చేయగా, వీరి తపస్సుకు ఇంద్రుడు భయపడి, మొసలి రూపంలో వచ్చి కరంబుని పాదాలు పట్టుకొని, నీళ్ళలోకి లాగి సంహరించెను. రంబుడికి ఇది తెలిసి, తన తలను నరికి అగ్నికి ఆహుతి చేయ్యబోగా, అగ్ని దేముడు వారించి, చచ్చి ఏమి సాధిస్తావు ఆత్మహత్య మహాపాతకము నీకేమి వరం కావాలో కోరుకోమని చెప్పెను. అంతట రంబుడు అగ్నికి ఈ విధంగా సమాధానమిచ్చాడు---- ఓ అగ్నిదేవా ! త్రిలోకవిజేతను పుత్రునిగా అనుగ్రహించు, దేవదానవమానవులకు ---- అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి వంటి లక్షణములున్న పుత్రునిని ప్రసాదించమని కోరెను. అప్పుడు అగ్నిదేముడు "నీ మనస్సు ఏ కామినిపై లగ్నమౌతుందో ఆమెవల్ల నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు. "అనిచెప్పి అదృశ్యమయ్యెను.

రంభాసురుడు అచటినుండి బయలుదేరి, ఇంటికి చేరుకుంటూ దారిలో ఎదకువచ్చి, కామార్తియై, ఉన్న ఒక మహిషి (గేదె) ని చూసేను. ఆమెను చూడగానే రంబుని మనస్సు చలించెను. దానితో సంగమించాడు. అది గర్భవతియైనది. దానిని తీసుకొని పాతాళమునకు చేరుకున్నాడు. అలా రంబునికి - మహిషికి పుట్టినవాడే "మహిషాసురుడు".

ఈ మహిషాసురుడు వేలసంవత్సరాలు  తపస్సు చేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు కోరుకోమనెను. తనకు మరణము లేకుండా ఉండాలని మహిషాసురుడు వరము కోరెను. నీ కోరిక ప్రకృతికి విరుద్ధమైనది. మరణానికి ఒక్క అవకాశం విడిచిపెట్టి, మరేదైనా కోరుకోమనెను. అంతట మహిషుడు  పురుషుని చేతిలో నాకు మరణము లేకుండా వరమివ్వు, ఆడది అబల, నన్ను సంహరించుట అసాధ్యము అని అనెను. అప్పుడు బ్రహ్మ ఓ మహిషాసురా ! నీ మరణము ఆడదాని చేతిలోనే ఉన్నది అని తెలిపి అంతర్ధానం అయ్యెను. ఇది మహిషాసురుని జన్మ వృత్తాంతం. 

ఈ విధంగా వరగర్వితుడైన మహిషాసురుని బాధలు తట్టుకోలేక, బ్రహ్మాదిదేవతలు అందరూ కలిసి, విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి మమ్ములను రక్షింపుమని వేడుకొనగా, ఒక్క  స్త్రీ  చేతిలోనే అతని మరణం సంభవిస్తుంది కనుక.... మీ మీ శక్తులన్నిటినీ కలిపి ఒక స్త్రీమూర్తిగా రూపొందించి మన ఆయుధములను కూడా ఆమెకు ఇచ్చి మహిషుని సంహరిద్దాము అని తెలిపెను. ఈ విధంగా అందరి శక్తులను, ఆయుధములను అందుకొని ఆదిపరాశక్తిగా అవతరించి ఎనిమిది రోజులు భీకర పోరాటం సలిపి తొమ్మిదవ రోజున మహిషుని సంహరించింది. కనుకే ఈమెను మహిషాసురమర్ధిని అని పేర్కొంటారు.ఇది మూలకథ.




                                  

No comments:

Post a Comment