September 13, 2013

కుమార శతకం 81 నుండి 90 వరకు శ్లోకాలు

కుమార శతకం 81 నుండి 90 వరకు శ్లోకాలు 


81 వ శ్లోకం 
ధరణీజాతము లే యే
తరి నెట్లట్లను ఫలించుఁ దగనటు పూర్వా
చరణ ఫలంబు ననుభవము
గరమను భవనీయమగును గాదె కుమారా!

భావం 
ఓ కుమారా! ఈ ధరణిపై ఏయే ఋతువులందు ఏయే విధములుగా వృక్షములు ఫలించునో ఆయావిధముగానే మానవులు తమ పూర్వజన్మములందు చేసిన పాపపుణ్యములఫలములు ఈ జన్మమునందు అనుభవింతురు సుమా!

82  వ శ్లోకం 
ఘనులు విని సమ్మతింపని
పనులకు జొతబడక పొగడు పనులను జొరు; మెం
డును బొంకబోక కడ స
జ్జనములతో గలసి మెలగు జగతి కుమారా!

భావం 
ఓ కుమారా! పెద్దలు వలదన్న చెడుపనులను చేయకుము. వారల మెప్పు పొందునట్లు మంచిపనులను చేయుము. అసత్యములు పలుకరాదు. పలుకుటకు వెళ్ళరాదు.మంచివారితో స్నేహము చేసి మంచి అనిపించుకొనుము..

83  వ శ్లోకం 
రోషావేశము జనులకు
దోషము తలపోయ విపుల దుఃఖకరము నౌ
రోషము విడిచిన యెడ సం
తోషింతురు బుధులు హితము దోప కుమారా!

భావం 
ఓ కుమారా! ఆలోచించి చూడగా కోపావేశములు మనుజులకు ఎక్కువ పాపమును అంటగట్టును దుఃఖములకు మూలమవియే. అట్టి గుణములను త్యజించిన వారిని పండితులు పొగిడి మెచ్చుకొందురు.

84  వ శ్లోకం 
గుణవంతుని సంగతి ని
ర్గుణులకు గుణములు ఘటించు కుసుమాది సమ
ర్పణమున వస్త్రాదిక మా
క్షణమున పరిమళము నొందు కరణి కుమారా!

భావం 
ఓ కుమారా! పువ్వులు,అత్తరులు మొదలగు వానిచే వస్త్రాదులు గుభాళించునట్లు గుణవంతులతొ కూడిన గుణహీనులకు గూడ గౌరవ మర్యాదలు అబ్బును.

85  వ శ్లోకం 
మును మనుజుడు జన్మాంతర
మున చేసిన పుణ్య పాపములు పుడమిని వా
నిని బొందక విడువవు దే
వుని నిందింపకుము కీడు వొడుమ కుమారా!

భావం 
ఓ కుమారా! పూర్వ జన్మములందు మానవుడు చేసిన పుణ్యపాపములవలన ఈ జన్మములో కష్టసుఖాలనేవి సంభవించును. ఆ పుణ్యపాపముల ఫలమును పొందక విడువవు. నీ కష్టములకు కారణము భగవంతుడని దూషింపకుము భగవంతుని అన్యాయముగా నిందించినచో భంగపడుదువు సుమా!

86  వ శ్లోకం 
అల సరసాన్నంబుల బరి
మళము గలుగు వస్తువులను మహితల యానం
బుల నాసనముల సుబ్బకు
కలుగుం జను కాలవశముగాను కుమారా!

భావం 
ఓ కుమారా! ఈ భూమి యందు అన్నపానాదులు, పరిమళద్రవ్యాలు, వాహనములు, ఆసనములు మున్నగునవి కాలముననుసరించి కలుగుచుండును. అ సౌకర్యములను జూచి పొంగిపోకుము. నీ రాత బాగుండదని కాలమున అన్నియు నీ నుండి దూరమగును.

87  వ శ్లోకం 
మనుజులు తన సౌఖ్యము కొర
కును సంరక్షణము నవని గోరుదు రొగి నే
జన పాలుఁడు సంరక్షిం
పను దగియును బ్రోవ డతడే పాపి కుమారా!

భావం 
ఓ కుమారా! ఈ భూమిపై మనుజులు సుఖములు గోరి రక్షణ ఏర్పాటు చేసుకొందురు. రక్షింపగలిగిన సామర్ధ్యము ఉండియు రక్షింపనివాడు పాపాత్ముడే.

88  వ శ్లోకం 
మండలపతి దండార్హుల
దండింపక యుండరాదు ధారుణి నాత డ
ఖండల సమానుడైనను
మెండగు పాపంబు నొంది మెలగు కుమారా!

భావం 
ఓ కుమారా! ప్రభువు నిందితులను శిక్షింపవలెను. వారిని దండించకుండా విడిచిపెట్టరాదు. నిందితులను దండింపని ప్రభువు ఇంద్రునితో సమానుడైననూ మిక్కిలి పాపమును మూట గట్టుకొనును.

89  వ శ్లోకం 
కత్తిని చేతం బట్టుచు
మొత్త దలచి వచ్చువాని ముఖ్యముగా మే
ల్వత్తించిన నదె ప్ర్రాయ
శ్చిత్తమతని జంపదగదు చిన్ని కుమారా!

భావం 
ఓ కుమారా! కత్తిని చేత ధరించి చంపుతానని వస్తున్న వానిని ఎదిరించకుండా వానికి కావలసిన ప్రయోజనములను కలుగజేసినచో అదే అతనికి ప్రాయశ్చితమునిచ్చి మంచివానిగా జేయును. అట్టి వానిని చంపరాదు. పొసగమేలు చేసి పొమ్మనుటే ఉత్తమమైనది.

90  వ శ్లోకం 
పురుషుం డొనర్పని పనికి
నరయగ దైవం బదెట్టు లనుకూలించున్
సరణిగ విత్తక యున్నను
వరిపండునె ధరణిలోన వరలి కుమారా!

భావం 
ఓ కుమారా! భూమి యమ్దు సరిగా విత్తనము నాటాకున్నచో వరిపైరు ఏ విధముగా మంచిఫలితాలను ఇవ్వదో అట్లే మనిషి తన ప్రయత్నము తాను చేయకున్నచో ఆ పనికి భగవంతుడు ఏ విధంగా అనుకూలించును? (అనుకూలించడని భావము.)

No comments:

Post a Comment