September 10, 2013

నారసింహ శతకం 71 నుండి 80 వరకు శ్లోకాలు

నారసింహ శతకం 71 నుండి 80 వరకు 
71
ప్రహ్లాదు డేపాటి పైడి కానుక లిచ్చె?
మదగజం బెన్నిచ్చె మౌక్తికములు?
నారదుండెన్నిచ్చె నగలు రత్నంబు? ల
హల్య నీ కే యగ్ర హార మిచ్చె?
ఉడుత నీకేపాటి యూడిగంబులు చేసె?
ఘన విభీషణు డేమి కట్న మిచ్చె?
పంచపాండవు లేమి లంచమిచ్చిరి నీకు?
ద్రౌపది నీ కెంత ద్రవ్య మిచ్చె?

నీకు వీరందఱయినట్లు నేను గాన?
యెందు కని నన్ను రక్షింప విందువదన !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
72
వాంఛతో బలిచక్ర వర్తిదగ్గర జేరి
భిక్షమెత్తితి వేల బిడియపడక?
యడవిలో శబరి దియ్యని ఫలాలందియ్య
జేతులొగ్గితి వేల సిగ్గుపడక?
వేడ్కతో వేవేగ విదురునింటికి నేగి
విందుగొంటి వదేమి వెలితిపడక?
అటుకు లల్పము కుచేలుడు గడించుక చేర
బొక్కసాగితి వేల లెక్కగొనక?

భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను
వారి కాశించితివి తిండివాడ వగుచు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
73
స్తంభమం దుదయించి దానవేంద్రుని ద్రుంచి
కరుణతో బ్రహ్లాదు గాచినావు
మకరిచే జిక్కి సామజము దుఃఖించంగ
గృపయుంచి వేగ రక్షించినావు
శరణంచు నా విభీషణుడు నీ చాటున
వచ్చినప్పుడె లంక నిచ్చినావు
ఆ కుచేలుడు చేరెడటుకు లర్పించిన
బహుసంపదల నిచ్చి పంపినావు

వారివలె నన్ను బోషింప వశముగాదె?
యంత వలపక్షమేల శ్రీకాంత ! నీకు?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
74
వ్యాసు డేకులమందు వాసిగా జన్మించె?
విదురుడే కులమందు వృద్ధిబొందె?
కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లె?
నా వసిష్ఠుం డెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబున బుట్టె?
గుహుడను పుణ్యుడే కులమువాడు?
శ్రీశుకుడెక్కట జెలగి జన్మించెను?
శబరి యేకులమందు జన్మమొందె?

నే కులంబున వీరింద ఱెచ్చినారు?
నీ కృపా పాత్రులకు జాతి నీతులేల?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
75
వసుధా స్థలంబున వర్ణ హీనుడుగాని
బహుళ దురాచార పరుడుగాని
తడసి కాసియ్యని ధర్మశూన్యుడుగాని
చదువ నేరని మూఢ జనుడుగాని
సకల మానవులు మెచ్చని కృతఘ్నుడుగాని
చూడ సొంపును లేని శుంఠగాని
అప్రతిష్ఠలకు లోనైన దీనుడుగాని
మొదటి కేమెఱుగని మోటు గాని

ప్రతిదినము నీదు భజనచే బరగునట్టి
వాని కేవంక లేదయ్య వచ్చు ముక్తి
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
76
ఇభకుంభములమీది కెగిరెడి సింగంబు
ముట్టునే కుఱుచైన మూషకమును?
నవచూతపత్రముల్ నమలుచున్న కోయిల
కొఱుకునే జిల్లేడు కొనలు నోట?
అరవింద మకరంద మనుభవించెడి తేటి
పోవునే పల్లేరు పూలకడకు?
లలిత మైన రసాల ఫలము గోరెడి చిల్క
మెసవునే భ్రమను నుమ్మెత్తకాయ?

నిలను నీకీర్తనలు పాడ నేర్చినతడు
పరులకీర్తన బాడునే యరసి చూడ?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
77
సర్వేశ ! నీపాద సరసిజద్వయమందు
జిత్త ముంపగ లేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలిచి యుండెడునట్లు
చేరి నన్నిపు డేలు సేవకుడను
వనజలోచన ! నేను వట్టి మూర్ఖుడ జుమ్మి
నీస్వరూపము జూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్లి పోసినయట్లు
భక్తిమార్గంబను పాలు పోసి

ప్రేమతో నన్ను బోషించి పెంచుకొనుము
ఘనత కెక్కించు నీదాస గణములోన
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
78
జీమూతవర్ణ ! నీ మోముతో సరిరాక
కమలారి యతికళంకమును బడసె
సొగసైన నీ నేత్ర యుగముతో సరిరాక
నళినబృందము నీళ్ళ నడుమ జేరె
కరిరాజవరద ! నీ గళముతో సరిరాక
పెద్ద శంఖము బొబ్బ పెట్ట దొడగె
శ్రీపతి ! నీదివ్య రూపుతో సరిరాక
పుష్పబాణుడు నీకు బుత్రుడయ్యె

నిందిరాదేవి నిన్ను మోహించి విడక
నీకు బట్టమహిషి యయ్యె నిశ్చయముగ
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
79
హరిదాసులను నింద లాడకుండిన జాలు
సకల గ్రంథమ్ములు చదివినట్లు
భిక్ష మియ్యంగ దప్పింప కుండిన జాలు
జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచించ కుండిన జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు
గనక కంబపు గుళ్లు గట్టినట్లు

ఒకరి వర్షాశనము ముంచకున్న జాలు
పేరుకీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
80
ఇహలోకసౌఖ్యము లిచ్చగించెదమన్న
దేహ మెప్పటికి దా స్థిరత నొంద
ఆయుష్యమున్న పర్యంతంబు పటుతయు
నొక్కతీరున నుండ దుర్విలోన
బాల్య యవ్వన సుదుర్బల వార్ధకములను
మూటిలో మునిగెడి ముఱికి కొంప
భ్రాంతితో దీని గాపాడుద మనుకొన్న
కాల మృత్యువు చేత గోలుపోవు

నమ్మరాదయ్య ! యిది మాయ నాటకంబు
జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


No comments:

Post a Comment