September 11, 2013

కుమార శతకం 61 నుండి 70 వరకు శ్లోకాలు

కుమార శతకం 61 నుండి 70 వరకు శ్లోకాలు

జారులతో  జోరులతో
గ్రూరులతో నెపుడు పొత్తు గోరక మది స
త్ఫూరుష పదాంబు జాతా
ధారుడవై బ్రతుకు కీర్తి తనరు కుమారా!

భావం 
ఓ కుమారా! విటులతోనూ, దొంగలతోనూ, క్రూరులతోనూ కలసి స్నేహము చేయకుము. నిత్యము సజ్జనుల పాదపద్మములను మనసునందు నిలుపుకొని మనుగడ సాగించుము.

62 వ శ్లోకం 
జ్ఞానుల చరితము వీనుల
నానుచు సత్పురుష గోష్టి ననఘంబనుచున్
బూనుము : ధర్మపధంబును
దా నెరిగినయంత మరువదగదు కుమారా!

భావం 
ఓ కుమారా! జ్ఞానుల చరిత్రలను వినుటయును, సజ్జనుల సభలలో పాల్గొనుట వలననూ, పాపములు నశించునని తెలియుము. కావున నీ శక్తి సామర్ధ్యములున్నంతవరకూ ధర్మమును వీడక ఈ భూమియందు నడచుకొనుము.

63 వ శ్లోకం 
తన పంక్తి యందు బాంధవ
జనము లొక విధంబుగా మెసమ్గుచు నుండం
గను దా సద్రసముల మెస
గిన విషభోజన సమంబు క్షితిని కుమారా!

భావం 
ఓ కుమారా! తన పంక్తియందు కూర్చున్న బంధువులొక విధంబున తినుచుండగా తాను మధుర పదార్థములను, షడ్రసోపేతముగా భుజించుట కూడదు. తనట్లు వేరు విధమున భుజించినచో అది విషముతో సమానమగునని తెలియుము.

64 వ శ్లోకం 
పరజనులు కట్టి విడిచిన 
వర చేలములైన గట్ట వలదు వలువలన్
నెరి మాయు మడాత మార్చుచు
ధరియించుటా యొప్పదండ్రు ధరను కుమారా!

భావం 
ఓ కుమారా! ఇతరులు కట్టి విడిచిన వస్త్రములెంత విలువగలవియైననూ, ధరింపరాదు. అట్లే ఎంత విలువగలిగిన వస్త్రములనైననూ నలిగిన మడతలు కనబడునట్లు కట్టరాదు. అట్లు చేయుట ఈ భూమియందు కూడని పని.

65 వ శ్లోకం 
లోకమున సర్వజనులకు
నా కాలుడు ప్రాణహారియై యుండగ శో 
భాకృత కార్యముల వడిం
బ్రాకటాముగ జేయకుండరాదు కుమారా!

భావం 
ఓ కుమారా! లోకమునందు సర్వజనులకు హరించు యముడున్నాడని తెలుసుకొని చేయదగిన శుభకార్యముల నన్నింటిని ప్రసిద్ధముగా శీఘ్రముగా వెంటనే చేయుము. ఆలస్యము చేసినచొ పనియగుట కష్టము. అనగా ప్రాణం పోకడ వాన రాకడ ఎవరికీ తెలియనట్లే ఈ గాలిబుడగవంటి జీవితం ఎంత కాలం ఉంటుందో ఎవరికీ తెలియదు కావున దీపముండగానే యింటిని చక్కబెట్టుకొనుమన్నట్లు మహిలో మనం జీవించియున్నపుడే మంచి పనులు చేయుమని అర్ధం.

66 వ శ్లోకం 
ప్రజ్ఞావంతుని చెతను
ప్రజ్ఞాహీనునకు గడమ వాటిల్లు నిలన్
బ్రాజ్ఞత గల్గి నటించిన 
దత్‍జ్ఞు న్నుతియింతురదియు ధనము కుమారా!

భావం 
ఓ కుమారా! ఈ భూమియందు తెలివైన‍ వారి వలన తెలివి లేనివారికి కష్టములు కలుగును తెలివిగలిగి నటించిన వాని జీవితమును జూసి జనులెల్లరునూ పొగడుదురు. అదియే మానవునికి ధనము.

67 వ శ్లోకం 
గృహ దాహకునిం బరదా
రహరుం బంధుహిత కార్య రహితుని దుష్టో
త్సాహపరుని జంపి నరపతి
యిహ పరముల యందు కీర్తి నెసగు కుమారా!

భావం 
ఓ కుమారా! ఇండ్లను తగులబెట్టువానిని, ఇతరుల భార్యలను హరించువారిని, బంధువులు, హితులు మొదలగు వారి పనులను చేయక చెడగొట్టువానిని, చెడుపనులను చేయుట యందుత్సాహము కలవారిని రాజు సంహరించి ఇహపరలోక కీర్తిని పొందుతాడు.

68 వ  శ్లోకం 
జనియించుట పొలియుటకే
పెను సుఖమొందుటది కష్ట విధినొందుటకే
విను హెచ్చుట తగ్గుటకే
యని మనమున నమ్మవలయునయ్య కుమారా!

భావం 
ఓ కుమారా! మానవులు పుట్టుట గిట్టుట కొరకే ! మిక్కిలి సుఖములనుభవించుట కష్టములు పొందుటకొరకే. పెరుగుట విరుగుట కొరకేయని భావింపుము. పెద్దలు చెప్పిన ఈ సూక్తిని మరువకుము.

69 వ శ్లోకం 
కులభామల విడువకు వెలి
పొలతుల వీక్షించి మోహమును బొరలకుమీ
ఖలు డందు రెట్టివారలు
గులహీనుడు పుట్టెననుట కొఱలు కుమారా!

భావం 
ఓ కుమారా! ఎన్నడునూ నీ భార్యను విడువకుము. పరస్త్రీల వ్యామోహములో పడకుము. అట్లు చేసినచో నిన్ను దుష్టుడందురు. కులహీనుడు జన్మించెననుమాట నీ పట్ల యదార్ధమై నిలిచి యుండును.

70 వ శ్లోకం 
పాపంబులందు నెక్కుడు
పాపము సుమీ! ధరిత్రిపై క్రోధగుణం
బే పారు, లోభమును, విని
యే పురుషుల బెడద గూడ దిలను కుమారా!

భావం 
ఓ కుమారా! ఎక్కువైన కోపము, లోభము అనే గుణములు పాపములన్నింటిలోనూ మిక్కిలి పాపములు. అందుచే ఎవరికీ బాధ కలుగకుండునట్లు మసలుకొనుము.

No comments:

Post a Comment