September 10, 2013

కుమార శతకం 31 నుండి 40 వరకు శ్లోకాలు

కుమార శతకం 31 నుండి 40 వరకు శ్లోకాలు

ధనవంతుడె కులవంతుడు
ధనవంతుడె సుందరుండు ధనవంతుడె
ఘనవంతుడు బలవంతుడు
ధనవంతుడె ధీరుడనుచు దలతె?కుమారా.

భావం:-
ఓ కుమారా ! ఈ లోకమందు ధనవంతుని అందరూ మంచివానిని గౌరవింతురు.ధనము కలవారని లోకులు సుందరుడని,గుణవంతుడని గొప్పవాడని,బలవంతుడని,ధైర్యవంతుడని పలువిధములుగా పొగడుదురు.మనసునందీవిషయాన్ని ఉంచుకొని ధనము సంపాదింపుము.

32 వ శ్లోకం
విను ప్రాణరక్షణమునన్
ధనమంతయు మునిగిపోవు తరి,పరిణయమం
దున,గురుకార్యమున,వధూ
జన సంగమమునందు బొంక జనును కుమారా.

భావం:-
కుమారా ! వినుము ప్రాణము కాపాడుకొను సమయమందును,ఐశ్వర్యము నశించు సమయమందుననూ,వివాహసమయమునండుననూ,గొప్ప ప్రజోపయోగ కార్యము నెరవేర్చు సమయమునందుననూ,స్త్రీలనుసంగమించు సమయమునందునూ అసత్యములాడవచ్చును.

33 వ శ్లోకం
దీనుండై నను శాత్రవు
డైనన్ శరణనుచు వేడునపుడు ప్రియత న
మ్మానవుని కోర్కె దీర్చిన
వాని సుజనుడండ్రుబుధులు వసుధ కుమారా.

భావం:-
ఓ కుమారా ! దీనుండై శరణుగోరివచ్చినవాడు శత్రువైననూ అతని ప్రయోజనమును ప్రేమతో నెరవేర్చినచో అతనిని జూచి పండితులు సుజనుడని పొగడుదురు.

34 వ శ్లోకం
మిత్రుండు దనకు విశ్వా
మిత్రము జేసినను గాని మేలనవచ్చున్
శాత్రవుడు ముద్దుగొన్నను
ధాత్రిం దన కదియె కీడు తలప కుమారా.

భావం:-
ఓ కుమారా ! లోకమందుమిత్రుడు మనకు కీడు చేసిననూ,దానిని మేలు చేసినట్లుగానే భావించవలెను.కాని శత్రువు మనయింట భోజనము చేసిననూ మనకు అపకారమే కలుగునని తెలియవలెను.

35 వ శ్లోకం
విత్తంబు విద్య కులము
న్మత్తులకు మదంబొసంగు;మాన్యులకున్ స
ద్వృత్తి నొసంగున్ వీనిన్
జిత్తంబున నిడి మెలంగ జెలగు కుమారా.

భావం:-
ఓ కుమారా ! ధనము,గొప్ప విజ్ఞానము,సద్వంశము దుర్మార్గులకు గర్వమును ఇచ్చును.ఈ త్రిగుణాలే సజ్జనులకు మంచిని కలుగ జేయును.వీనిని గుర్తుంచుకొని ప్రవర్తించుము.

36 వ శ్లోకం
ఋణ మధిక మొనర్చి సమ
ర్పణ చేసిన తండ్రి విద్యరాని కొడుకుల
క్షణశాలి రాణి దుశ్చా
రిణి యగు జననియును దలప రిపులు కుమారా.

భావం
ఓ కుమారా ! కుమారులకు అప్పులను ఆస్తులుగా ఇచ్చినతండ్రి,విద్యలేని కుమారుడు,అందమైన భార్య,చెడునడతగల్గిన తల్లి ఆలోచించినచో వీరందరూ శత్రువులే సుమా.

37 వ శ్లోకం
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్
బ్రాజ్ఞతను గలిగి యున్నన్
బ్రాజ్ఞులలో  బ్రాజ్ఞు  డవుగ ప్రబలు కుమారా.

భావం
ఓ కుమారా ! నిన్ను చేయమని ఆజ్ఞాపించిన పనులను తెలివిగా చేసి మెప్పుపొందుము.ఒక్క బుద్దినైపుణ్యమును ప్రదర్శించుటయే గాదు.తెలివైన వారిలో తెలివైనవానిగా పేరు తెచ్చుకొని అభివృద్ది చెందుము.

38 వ శ్లోకం
వృద్దజన సేవ చేసిన
బుద్ది విశేషజ్ఞు  బూత చరితుడున్
సుధ్దర్మశాలి యని బుధు
లిధ్దరC బొగిడెదరు ప్రేమయెసగ  గుమారా.

భావం
ఓ కుమారా ! పెద్దల పట్ల గౌరవము ప్రదర్శించుము.పెద్దలను గౌరవించనిచో వారి దివ్యమైన ఆశీస్సులు పొదుటయే గాక బుద్దిమంతుడు,ధర్మాత్ముడు,మంచివాడని మెచ్చుకుంటూ ప్రేమతో పొగడుదురు.

39 వ శ్లోకం
సతతము  బ్రాత:కాలో
చితవిధులను జరుపు మరసి శీఘ్రముగ నహ:
పతి పూర్వ పర్వతాగ్రా
గతుడగుటకు మున్నె వెరపు గల్గి కుమారా.

భావం
ఓ కుమారా ! ప్రతిరోజూ సూర్యోదయాత్పూర్వమే మేల్కొనుము.ఉదయమందు చేయవలసిన పనులను తెలుసుకొని ఆ పనులను సూర్యుడు ఉదయించకముందే శ్రద్దతో చేయుము

40 వ శ్లోకం
పోషకుని మతము  గను  గొని
భూషింపక గాని ముదము బొందరు మఱియున్
దోషముల నెంచు చుండును
దోషివయిన మిగుల  గీడు దోచు  గుమారా.

భావం
ఓ కుమారా ! యజమాని మనస్సును గ్రహించి మెలగుట మంచిపద్దతి.యజమానినెంత గౌరవించిననూ సంతోషము పొందడు.సేవకుని యందు తప్పులను వెదకుచునె యుండును.కావున యజమాని పట్ల జాగరూకుడవై మెలగుము.నీవు దుష్టుడవైనచో మిక్కిలి కీడు కలుగునని తెలుసుకొనుము.

2 comments:

  1. స్వేతా, మీ బ్లాగ్ మొత్తం చదువుతాను

    ReplyDelete
  2. నా బ్లాగుని తప్పకుండ చూసి - చదవండి దీది .... తప్పులేమైన ఉంటే తప్పకుండా చెప్పండి...

    ReplyDelete