September 10, 2013

నారసింహ శతకం 31 నుండి 40 వరకు శ్లోకాలు

నారసింహ శతకం 31 నుండి 40 వరకు 

31
అతి విద్య నేర్చుట అన్నవస్త్రములకే
పసుల నార్జించుట పాలకొఱకె
సతిని బెండ్లాడుట సంసార సుఖముకే
సుతుల బోషించుట గతులకొఱకె
సైన్యముల్ గూర్చుట శత్రుజయమునకే
సాము నేర్చుటలెల్ల చావుకొఱకె
దానమిచ్చుటయు ముందటి సంచితమునకే
ఘనముగా జదువుట కడుపు కొఱకె

యితర కామంబు గోరక సతతముగను
భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

32
ధరణిలో వేయేండ్లు తనువు నిల్వగబోదు
ధన మెప్పటికి శాశ్వతంబు గాదు
దార సుతాదులు తనవెంట రాలేరు
భ్రుత్యులు మృతిని దప్పింపలేరు
బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు
బలపరాక్రమ మేమి పనికి రాదు
ఘనమైన సకల భాగ్యం బెంత గల్గిన
గోచిమాత్రంబైన గొనుచుబోడు

వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన జేసెడివారికి బరమసుఖము
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

33
నరసింహ ! నాకు దుర్ణయములే మెండాయె
సుగుణ మొక్కటిలేదు చూడ జనిన
నన్యకాంతల మీద నాశ మానగలేను
నొరుల క్షేమము చూచి యోర్వలేను
ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి
నేను జేసెడివన్ని నీచ కృతులు
నావంటి పాపిష్ఠి నరుని భూలోకాన
బుట్ట జేసితి వేల భోగిశయన !

అబ్జదళనేత్ర ! నాతండ్రివైన ఫలము
నేరములు గాచి రక్షింపు నీవె దిక్కు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

34
ధీరత బరుల నిందింప నేర్చితి గాని
తిన్నగా నిను బ్రస్తుతింపనైతి
బొరుగు కామినులందు బుద్ధి నిల్పితి గాని
నిన్ను సంతతము ధ్యానింపనైతి
బెరికి ముచ్చటలైన మురిసి వింటినిగాని
యెంచి నీకథ లాలకించనైతి
గౌతుకంబున బాతకము గడించితిగాని
హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి

నవనిలో నేను జన్మించి నందుకేమి
సార్థకము గానరాదాయె స్వల్పమైన
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

35
అంత్యకాలము నందు నాయాసమున నిన్ను
దలతునో తలపనో తలతు నిపుడె
నరసింహ ! నరసింహ ! నరసింహ ! లక్ష్మీశ !
దానవాంతక ! కోటి భానుతేజ !
గోవింద ! గోవింద !  గోవింద ! సర్వేశ !
పన్నగాధిపశాయి ! పద్మనాభ !
మధువైరి ! మధువైరి ! మధువైరి ! లోకేశ !
నీలమేఘశరీర ! నిగమ వినుత !

ఈ విధంబున నీనామ మిష్టముగను
భజనసేయుచు నుందు నాభావమందు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !



36
ఆయురారోగ్య పు త్రార్థ సంపదలన్ని
కలుగజేసెడి భారకర్త వీవె
చదువు లెస్సగ నేర్పి సభలో గరిష్ఠాధి
కార మొందించెడి ఘనుడ వీవె
నడక మంచిది పెట్టి నరులు మెచ్చేడునట్టి
పేరు రప్పించెడి పెద్ద వీవె
బలువైన వైరాగ్య  భక్తిఙ్ఞానములిచ్చి
ముక్తి బొందించెడు మూర్తి వీవె

అవనిలో మానవుల కన్ని యాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడి వాడ వీవె
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

37
కాయ మెంత భయాన గాపాడినను గాని
ధాత్రిలో నది చూడ దక్క బోదు
ఏవేళ నేరోగ మేమరించునొ? సత్త్వ
మొందంగ జేయు నే చందమునను
ఔషధంబులు మంచి వనుభవించిన గాని
కర్మ క్షీణంబైన గాని విడదు
కోటివైద్యులు గుంపు గూడివచ్చిన గాని
మరణ మయ్యెడు వ్యాధి మాన్పలేరు

జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన
నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

38
జందె మింపుగ వేసి సంధ్య వార్చిన నేమి
బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణ గురురేఖ లిడినను
విష్ణు నొందక కాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిన నేమి
శంభు నొందక కాడు శైవజనుడు
కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి
యాశ పోవక కాడు యతివరుండు

ఎన్ని లౌకికవేషాలు గట్టుకొనిన
గురుని జెందక సన్ముక్తి దొరకబోదు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

39
నరసింహ ! నే నిన్ను నమ్మినందుకు జాల
నెనరు నాయందుంచు నెమ్మనమున
నన్ని వస్తువులు నిన్నడిగి వేసటపుట్టె
నింకనైన గటాక్ష మియ్యవయ్య
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు భోగశయన !
నయముగా వైకుంఠ నగరమందే యుంచు
నరకమందే యుంచు నళిననాభ !

ఎచట నన్నుంచిననుగాని యెపుడు నిన్ను
మఱచి పోకుండ నీనామ స్మరణనొసగు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

40
దేహ మున్నవఱకు మోహసాగరమందు
మునుగుచుందురు శుద్ధ మూఢ జనులు
సలలితైశ్వర్యముల్  శాశ్వతం బనుకొని
షడ్భ్రమలను మానజాల రెవరు
సర్వకాలము మాయ సంసార బద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
ఙ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల జూచి
నింద జేయక తాము నిలువలేరు

మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల
నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


No comments:

Post a Comment