June 19, 2013

శ్రీ కృష్ణ శతకం:-- 1 నుండి 10 పద్యాలు

శ్రీ కృష్ణ శతకం:--  1 నుండి 10 పద్యాలు 

1 వ పద్యం
శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా.ll

భావం:--
శ్రీ రుక్మిణీదేవికి నాథుడవు, జలమున నిద్రించువాడవు, నారద సంగీతమునకు వశడవు గోవర్ధనపర్వతమెత్తి గోపకులమును రక్షించినవాడవు. ద్వారకా వాసుడవు. భక్తులను పాలించువాడవు అగు ఓ కృష్ణా ! దయతో మమ్ము రక్షింపుము.

2 వ పద్యం
నీవే తల్లి వి దండ్రి వి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా.ll

భావం :--
హే కృష్ణా ! నీవే నా తల్లివి, తండ్రియు, హితుడవు, వీడవలెవెన్నంటి యుండువాడవు, గురుడవు దైవము అయినవాడవు, నా ప్రభుడవు, నాకు ఆధారుడవు అని నమ్మితిని. నిజముగ సుమా !

3 వ పద్యం
నారాయణ పరమేశ్వర
ధారా ధర నీలదేహ దానవవై రీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా నను గావు కరుణ వెలయఁగ కృష్ణా.ll

భావం:--
నారాయణుడు, పరమేశ్వరుడు నీలదేహుడు, రాక్షసవైరి, క్షీరాబ్దిశయనుడు, యదువీరుడు అను బిరుదులతో విహరించే ఓ కృష్ణా ! దయతో నన్నుగావుమయ్యా.

4 వ పద్యం
హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్మ్యము
హరి హరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా.ll

భావం:--
అంభుజనాభా ! కృష్ణా ! సమస్తపాపములు పోగొట్టు నీ పేరిటి "హరి" అను రెండక్షరముల మహిమను ఎవరును పొగడజాలరు. నా బోటి వానికి వీలగునా కాదుగదా ????

5 వ పద్యం
కౄరాత్ముఁ డజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటివేల్పు వెందును కృష్ణా.ll

భావం:--
దుర్మార్గుడగు అజామిళుడు తనకుమారుని "నారాయణ" అని పిలిసినందుకే అతనిని రక్షించితివి, నీకు సమానమైన దైవమెందును లేరు కదా ఓ కృష్ణా !??

6 వ పద్యం
చిలుక నొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
పలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా.ll

భావం:-
కృష్ణా !ఒక స్త్రీ ముద్దుగా ఒక చిలుకను "శ్రీరామ" అని పిలిచినంత మాత్రమునే ఆదరించి మోక్షమిచ్చినావు కదా..... నిన్నుభక్తితో ధ్యానించు వారికి తప్పక ముక్తి కలుగును కదా కృష్ణా !
7 వ పద్యం
అకౄరవరద మాధవ
చక్రాయుధ ఖడ్గపాణిశౌరి ముకుందా
శక్రాదిదివిజసన్నుత
శుక్రార్చిత నన్ను కరణఁజూడుము కృష్ణా.

భావం:-
అకౄరుని కాపడినట్టియు, ఇంద్రుడు మున్నగు దేవతలచే స్తుతించబడినట్టియు, చక్రము,ఖడ్గము, శార్జ్ఞము మొదలగు ఆయుధములు దాల్చినట్టి ఓ కృష్ణా ! నన్ను రక్షింపుము.

8 వ పద్యం
నందుని ముద్దులపట్టివి
మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
పండితు నిను దలఁతు భక్తవత్సల కృష్ణాll

భావం:-
భక్తులపై కరుణగల ఓ కృష్ణా ! నందుని ముద్దుల కొమరుడవై పుట్టితివి. మందరపర్వతమును దాల్చితివి. హరి, మాధవుడు, విష్ణువు అను పేర్లుచే నుతింపబడితివి. సౌందర్యసాలివని మునులచే పొగడబడితివి. అట్టి నిన్ను నా మదిలో ధ్యానించెదను.

9 వ పద్యం
ఓ కారుణ్యపయోనిధి!
నా కాధారంబ వగచు నయముగఁ బ్రోవ
న్నా కేల యితర చింతలు
నాకాధిప వినుత లోకనాయక కృష్ణాll

భావం:-
ఇంద్రునిచే సన్నుతింపబడిన లోకనాయకా ! కృష్ణా ! దయాసముద్రడవగు నీవు ఆధారముగానుండగా, నాకు ఇతర చింతలతో పనిలేదు.

10 వ పద్యం
వేదంబులు గననేరని
యాది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నా దిక్కు జూచి కావుము
నీ దిక్కే నమ్మినాఁడ నిజముగ కృష్ణాll

భావం:-
వేదంబులు తెలిసికొనజాలని, ఆదిపరబ్రహ్మవు, పాపరహితుడవు, దుష్టశిక్షకుడవు అగు ఓ కృష్ణా ! నీవే దిక్కని నమ్ముకున్నాను. నన్ను రక్షింపుమయ్యా.....    


No comments:

Post a Comment