June 27, 2013

శ్రీ కృష్ణ శతకం 41 నుండి 50 వరకు పద్యములు

41 వ శ్లోకం 

వడుగవువై మూడడుగుల
నడిగితివా బలిని భళిర, యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడుచిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణా.

భావం:--
కృష్ణా ! వామనావతారమెత్తి, బలిని మూడడుగుల భూమినడిగి, లోకములన్నిటిని నీ మేనితో నింపితివి కదయ్యా మహాత్మా ! నీ చరిత్రలు కడు చిత్రములు. 

42 వ శ్లోకం 

ఇరువ దొకమార్లు నృపతుల
శిరముల క్షండించి తౌర చేగొడ్డంటన్
ధర గశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా.

భావం:--
కృష్ణా !పరశురామావతారము ఎత్తి ఇరువుదొక్కమార్లు రాజులను హతమార్చి, తెచ్చుకున్న రాజ్యాలను కశ్యపునకు యిచ్చితివి కదా ! నీ మహిమలు తెలుసుకొనలేకపోతిమి కదా ! 

43 వ శ్లోకం 

దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చు కొనియు నయోధ్య
న్విశదముగ కీర్తి నేలిన
దశరథ రామావతార ధన్యుడ కృష్ణా.

భావం:--
కృష్ణా ! రామావతారమెత్తి రావణుని హతమార్చి, సీతను తెచ్చి అయోధ్యను కీర్తితో పాలించిన ధన్యుడవు కదయ్యా !

44 వ శ్లోకం 

ఘనులగు ధేనుక ముష్టిక
దనుజుల జెండాడి తౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ? రేవతీ పతి
వనగ బలరామమూర్తి యౌగద కృష్ణా.

భావం:--
కృష్ణా ! బలసాలురగు ధేనుక, ముష్టికులను దనుజులను చంపి, సుజనులను రక్షించిన రేవతీ విభుడవగు బలరాముడవు నీవే కదా !

45 వ శ్లోకం 

త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్
కృపగల రాజవు భళిరే
కపటపు బౌద్దావతార ఘనుడవు కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు త్రిపురాసుర భార్యల శీలము చెరచి, వారి భర్తలను సంహరింపచేసిన బుద్ధవతారుడవు కదా !

46 వ శ్లోకం 

వెలిపపు తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల ద్రుంపన్
కలియుగము తుదిని వేడుక
కలికివి గానున్న లోకకర్తవు కృష్ణా.

భావం:--
కృష్ణా ! ధర్మము నిలుపుటకు దుర్మతుల చంపుటకు, కలియుగాంతమందు నీవు కలికి రూపాన గుఱ్ఱమునెక్కి సంచరించెదవు కదా !

47 వ శ్లోకం 

వనజాక్ష ! భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందు కరుణానిధివై
కన నీ సద్గుణ జాలము
సనకాది మునీంద్రులెన్నజాలరు కృష్ణా.

భావం:--
కృష్ణా ! భక్తవత్సలా ! త్రిమూర్తి స్వరూపుడవు, దయానిధివి, అయిన నీ గుణజాలము సనకాది మునీంద్రులను పొగడజాలరు. 

48 వ శ్లోకం 

అపరాధ సహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముడనై జేసితి
చపలుని ననుగావు శేషశాయివి కృష్ణా.

భావం:--
శేషసాయివగు కృష్ణా ! తప్పులు చేసితిని, పాపాత్ముడను, కపటుడను, చపలుడను, అగు నన్ను కాపాడుమయ్యా !

49 వ శ్లోకం 

నరపశుడ మూఢచిత్తుడ
దురితారంభుడను మిగుల దోషగుడనునీ
గుణు తెఱుగ నెంతవాడను
హరి నీవే ప్రావు దాపు వౌదువు కృష్ణా.

భావం:--
కృష్ణా ! నరపశువును ! అజ్ఞానుడను, దోషిని, నిన్ను తెలుసుకోలేనివాడను, నన్ను తోడునీడై ఎల్లప్పుడూ కాపాడుము తండ్రీ. 

50 వ శ్లోకం 

పరనారీ ముఖపద్మము
గుఱుతుగ నొయ్యారినడక గొప్పును నడుము
న్నరయంగనె మోహింతురు
నిరతము నిను భక్తిగొల్వ నేర్వరు కృష్ణా.

భావం:--
కృష్ణా ! జనులు పరస్త్రీల ముఖమును, నడకను, కొప్పు, నడుము మొదలైనవి చూడగనే కామింతురు. కానీ నిన్ను భక్తితో కొలుచుట తెలియదు కదా అట్టివారికి.

No comments:

Post a Comment