June 27, 2013

శ్రీ కృష్ణ శతకం 51 నుండి 60 వరకు పద్యములు

51

పంచేంద్రియ మార్గంబుల

గొండెపు బుద్దిని జరించి కొన్ని దినంబుల్

ఇంచుక సజ్జన సంగతి

నెంచగ మిమ్మెరిగినాడ నిప్పుడె కృష్ణా.ll

భావం:--
కృష్ణా ! పంచేంద్రియ వ్యాపారము ననుసరించి ఇంతవరకు తిరిగి సాధు సంగతిచే నేనిప్పుడే నీ మహిమను తెలిసికొంటిని.

52

దుష్టుండ దురాచారుడ

దుష్టచరితుడను  చాల దుర్భుద్దిని నే

నిష్ట నిను గొల్వనేరను

దుష్టుడ నను గావు కావు కరుణను కృష్ణా.

భావం:--
కృష్ణా ! నేను దుష్టుడను, దురాచారుడను, దుష్టబుద్ధిని, కావున నిను సేవింపనేరను, నీవే దయచేసి నన్ను కాపాడుము.

53

కుంభీంద్రవరద ! కేశవ !

జంభాసురవైరి ! దివిజసన్నుత చరితా !

అంభోజనేత్ర జలనిధి

గంభీరా ! నన్ను గావు కరుణను కృష్ణా.

భావం:--
కృష్ణా ! గజేంద్రరక్షకా ! దేవతలచే పొగడబడువాడా ! తామర వంటి కన్నులు సముద్రమువంటి గాంభీర్యము గలవాడా ! దయతో నన్ను కాపాడుము.

54

దిక్కెవ్వరు ప్రహ్లాదుకు

దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడు

న్దిక్కెవ్వర య్యహల్యకు

దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా.

భావం:--
కృష్ణా ! ప్రహ్లాదునకు పాండవులకు, దీనులకు, అహల్యకు నీవే దిక్కయితివి. నాకును నీవే దిక్కువు రక్షింపుము.

55

హరి! నీవె దిక్కు నాకును

సిరితో నేతెంచి మకరి శిక్షించి దయం

బరమేష్టి సురలు బొగడcగ

కరిగాంచినరీతి నన్ను గాపుము కృష్ణా.

భావం:--

కృష్ణా ! లక్ష్మీయుతుడవై వచ్చి మొసలిని దునుమాడి ఏనుగును రక్షించినట్లు నన్ను కాపాడుము, నీవే నాకు దిక్కు కృష్ణా !

56

పురుషోత్తమ ! లక్ష్మీపతి !!

సరసిజ గర్భాదిమౌని సన్నుత చరితా !

మురభంజన ! సుర రంజన !

వరదుడవగు నాకు భక్తవత్సల కృష్ణా.

భావం:--
కృష్ణా ! బ్రహ్మమొదలైనవారిచే  కొనియాడబడినవాడా ! మురభంజన ! భక్తుల ప్రేమించువాడా ! నాకు వరములిచ్చి నన్ను కాపాడుము.

57

క్రతువులు తీర్ధాగమములు
వ్రతములు దానములు సేయవలెనా? లక్ష్మీ
పతి! మిము దలచిన వారికి
నతులిత పుణ్యములు గలుగు టరుదా ? కృష్ణా.

భావం:--
కృష్ణా ! యజ్ఞములు , వ్రతములు , తీర్థయాత్రలు , దానములు చేయుటకంటే , మిమ్ములను కొలిచినవారికి, సాటిలేని పుణ్యము లభించును.

58

స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయన్ !
అంభోజనేత్ర ! జలనిధి
గంభీరా ! నన్నుగావు కరుణను కృష్ణా.

భావం:--
స్తంభము నుండి వచ్చి, ప్రహ్లాదుని రక్షించినట్లుగా, పద్మము వంటి నేత్రములు గలవాడా ! సముద్రము వంటి గాంభీర్యము గలవాడా !కరుణజూపి నన్ను కూడా కాపాడుము కృష్ణా.

59

శతకోటి భాను తేజా !

అతులిత సద్గుణ గణాడ్య ! యంబుజనాభా

రతినాధ జనక ! లక్ష్మీ

పతిహిత ననుగావు భక్తవత్సల కృష్ణా.

భావం:--
కృష్ణా ! అనేక సూర్యుల తేజము గలవాడా ! లక్ష్మీనాధా ! మన్మధునకు తండ్రీ !మంచి గుణములు గలవాడా !భక్తవత్సలా ! నన్ను కాపాడవయ్యా !

60

మందుడనే  దురితాత్ముడ

నిందల కొడిగట్టి నట్టి నీచున్నన్నున్

సందేహింపక కావుము

నందుని వరపుత్ర ! నిన్ను నమ్మితి కృష్ణా


భావం:--
కృష్ణా ! నేను మందుడను, నీచుడను, దురితాత్ముడను, నిన్నే నమ్మితిని, నన్ను సందేహింపక కాపాడుము తండ్రీ !
    

No comments:

Post a Comment