June 27, 2013

నాయకుడు -- సంస్థ

1. నాయకత్వాన్ని వహించేటప్పుడు సేవకుడిగా ఉండండి. నిస్వార్థంగా ఉండండి. అనంత సహనం కలిగి ఉండండి. అప్పుడు విజయం మీదే.

2. విశ్వాసం, సౌశీల్యం గల ఆరుగురు(కొద్దిమంది) వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు కావలసినవి మూడు --- ప్రేమించే హృదయం భావించే మనస్సు, పనిచేసే చెయ్యి.

3. మిమ్మల్ని ఒక శక్తి జనక యంత్రంగా తయారుచేసుకోండి. మీరు పవిత్రులు, శక్తిమంతులు అయితే మీరొక్కరే ప్రపంచం మొత్తానికి సరితూగగలరు.

4. ప్రేమ, మంచితనం, పవిత్రత మనలో ఎంత అభివృద్ధి చెందితే......బయట ప్రపంచంలో అంట ప్రేమ, మంచితనం, పవిత్రత మనకు కనబడతాయి. పరదూషణ నిజానికి ఆత్మదూషణే. మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటే (ఇది మీరు చేయగలిగిన పనియే) ప్రపంచం తనంతట తానే మీకై సరికాగలదు.

5. అఖండమైన ఉత్సాహం, అపరిమితమైన ధైర్యం, అప్రతిహతమైన శక్తి.......అన్నిటినీ మించి పరిపూర్ణ విధేయత------ఈ లక్షణాలే ఒక వ్యక్తినిగానీ, ఒక దేశాన్నిగానీ పునరుజ్జీవింప చేయగలవు.

6. సహనశీలురై ఒకరినొకరు విశ్వాసపాత్రులై ఉండండి. మీలో మీరు తగవులాడుకోవద్దు. ఆర్ధికలావాదేవీలలో పరిపూర్ణమైన పారదర్శకతను (స్వచ్ఛతను) కలిగి ఉండండి. మీకు విశ్వాసం, నిజాయితీ, శ్రద్ధాభక్తులు ఉన్నంత వరకు సర్వం వికాసాన్ని పొందుతుంది.

7. మీరందరూ స్వలాభాన్ని, వర్గకీచులాటలను, అసూయను విడిచిపెట్టండి. భూమాతవలె ఓర్మి కలిగి ఉండండి. దీనిని మీరు సాధించగలిగితే లోకమే మీకు పాదాక్రాంతమవుతుంది.

8. విమర్శించటం విడిచిపెట్టండి. ఎదుటివారు చేసే పని మంచిదైతే మీకు చేతనైన సహాయం చేయండి. వారు తప్పుద్రోవ పడుతున్నారనిపిస్తే వారి తప్పులను సున్నితంగా తెలియచేయండి. ఒకరినొకరు తప్పుపట్టుకోవటమే అన్ని అనర్థాలకు మూలం. సంస్థల వినాశనానికి ముఖ్యకారణం కూడా ఇదే.

9. సంఘటితంగా పనిచెయ్యటం కావాలి. నీవు నన్ను అర్థంచేసుకుంటావా? మీకెవరికైనా బుర్రలో ఈ పాటి మేథాశక్తి ఉందా ? ఉంటే మీ మనస్సును పనిచేయనివ్వండి.

10. నిస్స్వార్థంగా పని చెయ్యండి. మరొకరిని చాటుగా దూషిస్తున్న మిత్రుని మాటలను ఎన్నడూ వినవద్దు.

11. కపటం, దుర్మార్గం ఎంత మాత్రం ఉండకూడదు. అల్పశ్వాస పాటి అనైతికత, నలుసంత చెడు విధానం కూడా తగదు.







No comments:

Post a Comment