June 23, 2013

వీర్రాజు గారి పద్యములు 21 నుండి 30 వరకు

21 వ పద్యము.

కొరకుమీ కుటిలుడవై 
పోరకుమీ పరులతోడ పుడమిని నీవున్ 
చేరకుమీ చెడు చెంతకు 
మీరకుమీ గురువులాజ్ఞ మేలగు నీకున్ ll

 22 వ పద్యము.

ఏడకుమీ పరులగనియు 
ఆడకుమీ చీట్లపేక ఆస్తియుపోవున్ 
కూడకుమీ పామరులను 
వీడకుమీ వినయమెపుడు విజయము కలుగున్ ll 


23 వ పద్యము.

ఉపకారంబుడిగిన మరి 
అపకారము చేయబూన కన్యుల కెపుడున్ 
కపటముతో దిరగ జనదు 
సఫలముతో కావేపనులును సంశయమేలన్ ll


24 వ పద్యము.

బంతియు చేమంతిని గని 
ఇంతులు సిగలో తురమగ ఇంపుగ జూచున్ 
ఎంతైన కాంత లెపుడును 
సంతనమును జూపరేమో సంపదయున్నన్ ll

25 వ పద్యము.

సర్వము నేనెరుగుదునని 
గర్వముతో దిరుగకెపుడు కడువడి నీవున్ 
సర్వము నెరిగిన నీవును 
ఉర్విని తెలియని విధమున నుండుట సరియా ? ll 

26 వ పద్యము

అగ్రకులము నాదనుచును 
నిగ్రహముగ పలుకబోకు నీవెపుడయినన్
ఆగ్రహము వచ్చు వినినను 
జాగ్రత్తగా మెలగకున్న జాలిని విడుచున్ ll 

27 వ పద్యము.

తక్కువ కులమ్ము నీదని 
ఎక్కువగా అనకు ఎపుడు ఎవ్వరితోడన్
ఎక్కువ తక్కువ ఏమిటి 
ఒక్కటె మానవులనుచు ఓర్మితో చెప్పుమా ll 

28 వ పద్యము.

మనిషికి తిండియు బట్టయు 
అనుదినమును కావలయును అవసరమనియున్ 
ధనమేమియు లేకున్నను 
మనుటకు ఇవియున్న చాలు మనగలరవనిన్ ll

29 వ పద్యము.

వినయము కలవాడొక్కడు 
తనయుండున్నను పుడమిని తనకది గొప్పే 
తనయుని బొగడిన నితరులు 
తనువే పులకించునెంతో తనయుని గనినన్ ll 

30 వ పద్యము.

తరగని ధనంబు గలిగిన 
పెరుగదు కీర్తెపుడు నీకు పెచ్చు విధాలన్ 
పరులకు సాయము చేయుట 
నిరతము నీవాచారించ నిన్నే బొగడున్ ll


No comments:

Post a Comment