కుమార శతకం 1 నుండి 10 శ్లోకాలు
1వ శ్లోకం
శ్రీ భామినీ మనొహరు
సౌభాగ్య తయా స్వభావు సారసనాభున్
లోఁ భావించెద; నీకున్
వైభవము లొసగుచుండ, వసుధఁ గుమారా !
భావం
ఓ కుమారా!సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మనసును ఆకర్షించినవాడును, ఐశ్వర్య భోగభాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును, నాభియందు పద్మము కలవాడును, అయిన విష్ణుమూర్తి, సంపదలనిచ్చే శ్రీ హరిని ప్రార్ధించుచున్నాను.
2 వ శ్లోకం
పెద్దలు వద్దని చెప్పిన
పద్దుల బోవంగరాదు పరకాంతల నే
పొద్దే నెద బరికించుట
కుపదేశింపగఁ గూడ దుర్విఁ గుమారా!
భావం
ఓ కుమారా! పెద్దలు వద్దని చెప్పిన పనులను పంతములకు పోయి చేయరాదు. ఇతర స్త్రీలను ఎన్నడునూ మనసులో తలంచుట మంచిది కాదు. ఈ విషయములను మనసులో నుంచుకొని భూమిపై మెలగుము.
3 వ శ్లోకం
అతి బాల్యములో నైనను
బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స
ద్గతి మీర మెలగ నేర్పిన
నతనికి లోకమున సౌఖ్యమగును గుమారా!
భావం
ఓ కుమారా! మిక్కిలి చిన్నతనములో కూడా చెడు మార్గములయందు నడువరాదు. మంచిమార్గములో నడచిన వానికి లోకమందు సుఖమే ప్రాప్తించును.
4 వ శ్లోకం
తనపై దయ నుల్కొనఁ గన్
గొన నేతెంచినను శీల గురుమతులను వమ్
దనముగఁ భజింపందగు
మనమలరగ నిదియ విబుధ మతము కుమారా!
భావం
ఓ కుమారా! దయతో తనకు మంచి చేయ బూనిన వారిని గౌరవించి, నమస్కరింపుము. వారి మనస్సు సంతోషపడునట్లు చేయుటయే నీవు వారి పట్ల చూపించదగు మర్యాద. పెద్దల ననుసరించే మంచి పద్ధతి యిదియే.
5 వ శ్లోకం
ఉన్నను లేకున్నను పై
కెన్నడుమర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిందిరుగు మెలమిఁ గుమారా!
భావం
ఓ కుమారా! నీకు ఉన్నా లేకపోయినా నీ కుటుంబ రహస్యాలను ఇతరులకు తెలియనీయకుము. నిన్ను కన్నవారికి పేరు ప్రఖ్యాతులు వచ్చునట్లు. నలుగురు గొప్పగా పొగిడే విధంగా సంతోషముతో మసలుకొనుము.
6. వ శ్లోకం
పెద్దలు విచ్చేసినచొ
బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్
హద్దెరిగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!
భావం
ఓ కుమారా! మన ఇంటికి పెద్దలు వచ్చినచో మర్యాదగా లేచి నిలబడవలెను. బద్ధకమువలనగాని, పొగరుతనంతోగాని, పెద్ద చిన్న భేదములు గ్రహింపక మొండిగా లేవకున్నచో, నిన్నందరూ మూర్ఖునిగా పరిగణిస్తారు.
7. వ శ్లోకం
పనులెన్ని కలిగి యున్నను
దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై
వినగోరుము సత్కథలను;
కాని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!
భావం
ఓ కుమారా! నీకెంత తీరికలేకున్ననూ, ఎన్ని పనులున్ననూ, మంచి బుద్ధిగలవాడివై ప్రతీ రోజు జ్ఞానమునిచ్చే మంచి కథలను వినవలెను. నీవట్లు చేసినచో నీ ప్రజ్ఞ పెరిగి, నిన్ను బుద్ధిమంతులందరూ సంతోషముతో మెచ్చుకొంటారు.
8. వ శ్లోకం
కల్లలగు మాట లాడకు
మెల్లజనంబులకు వేగ హృదయము కడు రం
జిల్లగఁ బల్కుము నీ కది
తెల్లము రహి గీర్తిఁగాంచు దెరగు కుమారాఁ!
భావం
ఓ కుమారా ! అసత్యములాడరాదు. మనుషులందరూ మెచ్చుకొనేటట్లు వారి మనస్సులు సంతోషపడునట్లు మాట్లాడుము. మహిలో నీకది ఆనందమును కీర్తిని ప్రసాదించును.
9 వ శ్లోకం
ఏనాడైనను వినయము
మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ
బూనకు మసమ్మతయు బహు
మానమునను బొందు మిదియె మతము కుమారా!
భావం
ఓ కుమారా! ఎన్నడునూ వినయ స్వభావమును వీడరాదు. ఈర్ష్యా అసూయలతో తమ కంటే పెద్దవారితో కలహించుట పనికిరాదు. పేదవారి కోపం పెదవికి చేటు అనే నానుడిని మనస్సునందుంచుకొని మెలగుము.అట్లు చేసినచో నీకు సంఘంలో గౌరవ మర్యాదలబ్బును. సన్మానాలు జరుగును.
10. వ శ్లోకం
తనకు విద్యాభ్యాసం
బును జేసినవానికన్న బొలుపుగఁ బదిరె
ట్లను దూగు దండ్రి వానికి
జననియుఁ బదిరెట్లుఁ దూగు జగతిఁ గుమారా!
భావం
ఓకుమారా! ఈ లోకమందు విద్యాభ్యాసము నేర్పి తీర్చిదిద్దిన గురువు కంటే కన్నతండ్రి పదిరెట్లు ఎక్కువ. కన్నతండ్రి కంటే కన్నతల్లి పదిరెట్లు ఎక్కువ. ఈ సత్యమును తెలుసుకొని మసలుకొనుము.
No comments:
Post a Comment