నారసింహ శతకం 91 నుండి 100 వరకు శ్లోకాలు
బులకాంకురము మేన బుట్టువాడు
నయమైన నీ దివ్య నామకీర్తనలోన
మగ్నుడై దేహంబు మఱచువాడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు
బ్రేమతో దండ మర్పించువాడు
హా పుండరీకాక్ష ! హా రామ ! హరి ! యంచు
వేడ్కతో గేకలు వేయువాడు
చిత్త కమలంబునను నిన్ను జేర్చువాడు
నీదులోకంబునం దుండు నీరజాక్ష !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
92
నిగమగోచర ! నేను నీకు మెప్పగునట్లు
లెస్సగా పూజింపలేను సుమ్మి
నాకు దోచిన భూషణములు పెట్టెద నన్న
గౌస్తుభమణి నీకు గలదు ముందె
భక్ష్యభోజ్యముల నర్పణము జేసెద నన్న
నీవు పెట్టితి సుధ నిర్జరులకు
గలిమికొద్దిగ కానుకల నొసంగెద నన్న
భార్గవీదేవి నీ భార్య యయ్యె
నన్ని గలవాడ నఖిల లోకాధిపతివి !
నీకు భూషాదులను పెట్ట నేనెంతవాడ !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
93
నవసరోజదళాక్ష ! నన్ను బోషించెడు
దాతవు నీ వంచు ధైర్యపడితి
నా మనంబున నిన్ను నమ్మినందుకు దండ్రి !
మేలు నా కొనరింపు నీలదేహ !
భళిభళీ ! నీ యంత ప్రభువు నెక్కడ జూడ
బుడమిలో నీ పేరు పొగడవచ్చు
ముందు జేసిన పాపమును నశింపగ జేసి
నిర్వహింపుము నన్ను నేర్పుతోడ
బరమసంతోష మాయె నా ప్రాణములకు
నీఋణము దీర్చుకొన నేర నీరజాక్ష !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
94
ఫణుల పుట్టలమీద బవ్వళించినయట్లు
పులుల గుంపున జేర బోయినట్లు
మకరి వర్గంబున్న మడుగు జొచ్చినయట్లు
గంగదాపున నిండ్లు గట్టినట్లు
చెదల భూమిని జాప చేర బఱచినయట్లు
తోలుతిత్తిని బాలు పోసినట్లు
వెఱ్ఱివానికి బహు విత్త మిచ్చినయట్లు
కమ్మగుడిసె మందు గాల్చినట్లు
స్వామి ! నీ భక్తవరులు దుర్జనులతోడ
జెలిమి జేసిన యట్లైన జేటు వచ్చు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
95
ధనుజసంహార ! చక్రధర ! నీకు దండంబు
లిందిరాధిప ! నీకు వందనంబు
పతితపావన ! నీకు బహునమస్కారముల్
నీరజాతదళాక్ష ! నీకు శరణు
వాసవార్చిత ! మేఘవర్ణ ! నీకు శుభంబు
మందరధర ! నీకు మంగళంబు
కంబుకంధర ! శార్జ్గ కర ! నీకు భద్రంబు
దీనరక్షక ! నీకు దిగ్విజయము
సకలవైభవములు నీకు సార్వభౌమ !
నిత్యకల్యాణములు నగు నీకు నెపుడు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
96
మత్స్యావతారమై మడుగులోపల జొచ్చి
సోమకాసురు ద్రుంచి చోద్యముగను
దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల
బ్రహ్మకిచ్చితి వీవు భళి ! యనంగ
నా వేదముల నియ్య నాచారనిష్ఠల
ననుభవించుచు నుందు రవనిసురులు
సకలపాపంబులు సమసిపోవు నటంచు
మనుజు లందఱు నీదు మహిమ దెలిసి
యుందు రరవిందనయన ! నీ యునికి దెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
97
కూర్మావతారమై కుధరంబు క్రిందను
గోర్కితో నుండవా కొమరు మిగుల?
వరహావతారమై వనభూములను జొచ్చి
శిక్షింపవా హిరణ్యాక్షు నపుడు?
నరసింహమూర్తివై నరభోజను హిరణ్య
కశిపుని ద్రుంపవా కాంతి మీఱ?
వామనరూపమై వసుధలో బలిచక్ర
వర్తి నఱంపవా వైర ముడిగి?
యిట్టి పనులెల్ల జేయగా నెవరికేని
తగునె నరసింహ ! నీకిది దగును గాక !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
98
లక్ష్మీశ ! నీదివ్య లక్షణగుణముల
వినజాల కెప్పుడు వెఱ్ఱినైతి
నా వెఱ్ఱిగుణములు నయముగా ఖండించి
నన్ను రక్షింపుమో నళిననేత్ర !
నిన్ను నే నమ్మితి నితరదైవముల నే
నమ్మలే దెప్పుడు నాగశయన !
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె
నీపాదకమలముల్ నిరత మేను
నమ్మియున్నాను నీపాద నళినభక్తి
వేగ దయచేసి రక్షింపు వేదవిద్య !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
99
అమరేంద్రవినుత ! నిన్ననుసరించినవారు
ముక్తి బొందిరి వేగ ముదముతోను
నీపాదపద్మముల్ నెఱ నమ్మియున్నాను
నాకు మోక్షం బిమ్ము నళిననేత్ర !
కాచి రక్షించు నన్ను గడతేర్చు వేగమే
నీ సేవకుని జేయు నిశ్చలముగ
గాపాడినను నీకు గైంకర్యపరుడ నై
చెలగి నీపనులను జేయువాడ
ననుచు బలుమాఱు వేడెద నబ్జనాభ !
నాకు బ్రత్యక్ష మగుము నిన్ నమ్మినాను
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
అమరేంద్రవినుత ! నిన్ననుసరించినవారు
ముక్తి బొందిరి వేగ ముదముతోను
నీపాదపద్మముల్ నెఱ నమ్మియున్నాను
నాకు మోక్షం బిమ్ము నళిననేత్ర !
కాచి రక్షించు నన్ను గడతేర్చు వేగమే
నీ సేవకుని జేయు నిశ్చలముగ
గాపాడినను నీకు గైంకర్యపరుడ నై
చెలగి నీపనులను జేయువాడ
ననుచు బలుమాఱు వేడెద నబ్జనాభ !
నాకు బ్రత్యక్ష మగుము నిన్ నమ్మినాను
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
100
శేషప్ప యను కవి చెప్పిన పద్యముల్
చెవుల కానందమై చెలగుచుండు
నే మనుజుండైన నెలమి నీ శతకంబు
భక్తితో విన్న సత్ఫలము గలుగు
జెలగి యీ పద్యముల్ చేర్చి వ్రాసినవారు
కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగా బుస్తకం బెపుడు బూజించిన
దురిత జాలంబులు దొలగిపోవు
నిద్ది పుణ్యాకరం బని యెపుడు జనులు
కష్టమనక పఠియించిన గలుగు ముక్తి
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
No comments:
Post a Comment