నారసింహ శతకం 11 నుండి 20 వరకు శ్లోకాలు
11గార్దభంబున కేల కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల మలయజంబు?
శార్ధూలమునక కేల శర్కరాపూపంబు?
సూకరంబున కేల చూతఫలము?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల కుండలములు?
మహిషాని కేల నిర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల పంజరంబు?
ద్రోహచింతన జేసెడి దుర్జనులకు
మధురమైనట్టి నీనామ మంత్రమేల?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

12
పసరంబు వంజైన బసులకాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య గయ్యాళైన బ్రాణనాధుని తప్పు
తనయుడు దుష్టయిన తండ్రి తప్పు
సైన్యంబు చెదిరిన సైన్యనాధుని తప్పు
కూతురు చెడుగైన మాత తప్పు
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు
దంతి దుష్టయిన మావంతు తప్పు
ఇట్టి తప్పులెఱుంగక యిచ్చవచ్చి
నటుల మెలగుదు రిప్పు డీ – యవని జనులు.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

13
కోతికి జలతారు కుళ్లాయి యేటికి?
విరజాజి పూదండ విధవ కేల?
ముక్కిడితొత్తుకు ముత్తెంపు నత్తేల?
నద్ద మేమిటికి జాత్యంధునకును?
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్?
క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?
ఱంకుబోతుకు నేల బింకంపు నిష్ఠలు?
వావి యేటికి దుష్ట వర్తనునకు?
మాట నిలుకడ కుంకరి మోటు కేల?
చెవిటివానికి సత్కథ శ్రవణ మేల?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

14
మాన్యంబులీయ సమర్ధుడొక్కడు లేడు
మాన్యముల్ చెఱుప సమర్ధు లంత
యెండిన యూళ్లగో డెఱిగింప డెవ్వడు
బండిన యూళ్లము బ్రభువు లంత
యితడు పేద యటంచు నెఱిగింప డెవ్వండు
కలవారి సిరు లెన్నగలరు చాల
దనయాలి చేష్టల తప్పెన్న డెవ్వడు
బెఱకాంత ఱంకెన్న బెద్ద లంత
యిట్టి దుష్టుల కధికార మిచ్చినట్టి
ప్రభువు తప్పు లటంచును బలుకవలెను.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

15
తల్లిగర్భమునుండి ధనము తేడెవ్వడు
వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్త మార్జనజేసి విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగల కిత్తురో దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

16
లోకమం దెవడైన లోభిమానవు డున్న
భిక్ష మర్థిమి జేత బెట్టలేడు
తాను బెట్టకయున్న తగవు పుట్టదుగాని
యొరులు పెట్టగ జూచి యోర్వలేడు
దాతదగ్గఱ జేరి తన ముల్లె చెడినట్లు
జిహ్వతో జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు
మేలు కల్గిన జాల మిణుకుచుండు
శ్రీరమానాథ | యిటువంటి క్రూరునకును
భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

17
తనువులో బ్రాణముల్ తరళిపొయ్యెడివేళ
నీ స్వరూపమును ధ్యానించునతడు
నిమిషమాత్రములోన నిన్ను జేరును గాని
యముని చేతికి జిక్కి శ్రమలబడడు
పరమసంతోషాన భజన జేసెడివారి
పుణ్య మేమనవచ్చు భోగిశయన
మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య నళిననేత్ర
కమలనాభ నీ మహిమలు గానలేని
తుచ్ఛులకు ముక్తిదొరకుట దుర్లభంబు.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

18
నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము గన్నతల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్
నీ కటాక్షము మాకనేకధనము
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు నిత్యసుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య
నీ పద ధ్యానంబు నిత్యజపము
తోయజాతాక్ష నీ పాద తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మ రుద్రవినుత.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

19
బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని
మరణకాలమునందు మఱతునేమొ
యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ గప్పగా భ్రమచేత
గంప ముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచు
బిలుతునో శ్రమచేత బిలువనొ
నాటి కిప్పుడె చేతు నీ నామభజన
తలచెదను, జెవి నిడవయ్య ! ధైర్యముగను.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

20
పాంచభౌతికము దుర్బలమైన కాయం బి
దెప్పుడో విడుచుట యెఱుకలేదు
శతవర్షములదాక మితము జెప్పిరి గాని
నమ్మరా దామాట నెమ్మనమున
బాల్యమందో మంచి ప్రాయమందో లేక
ముదిమియందో లేక ముసలియందొ
యూరనో యడవినో యుదకమధ్యముననో
యెప్పుడో విడుచుట యేక్షణంబొ
మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన
దేహమున్నంతలో మిమ్ము దెలియవలయు.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

No comments:
Post a Comment