September 10, 2013

నారసింహ శతకం 81 నుండి 90 వరకు శ్లోకాలు

నారసింహ శతకం 81 నుండి 90 వరకు శ్లోకాలు 
81
భావంబు నీనామ భజన గోరుచునుండు
జిహ్వ నీ కీర్తనల్ సేయ గోరు
హస్తయుగ్మంబు నిన్నర్చింప గోరును
కర్ణముల్ నీ మీది కథను గోరు
తనువు నీ సేవయే ఘనముగా గోరును
నయనముల్ నీ దర్శనంబు గోరు
మూర్ధమ్ము నీ పదమ్ముల మ్రొక్కగా గోరు
నాత్మ నీదై యుండు నరసి చూడ

స్వప్నములనైన నేవేళ సంతతమును
బుద్ధి నీ పాదములయందు బూనియుండు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


82
పద్మాక్ష ! మమతచే బరము నందెద మంచు
విఱ్ఱవీగుదుమయ్య ! వెఱ్ఱిపట్టి
మాస్వతంత్రంబైన మదము కండ్లకు గప్పి
మొగము పట్టదు కామ మోహమునను
బ్రహ్మదేవుండైన బైడి దేహము గల్గ
జేసివేయక మమ్ము జెఱిచె నతడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ముకలతోడి
ముఱికి చెత్తలు చేర్చి మూట కట్టె

నీ శరీరాలు పడిపోవు టెఱుగ కేము
కాముకుల మైతి మిక మిమ్ముగానలేము.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


83
గరుడవాహన ! దివ్య కౌస్తుభాలంకార !
రవికోటితేజ ! సారంగవదన !
మణిగణాన్విత ! హేమ మకుటాభరణ ! చారు
మకరకుండల ! లసన్మందహాస !
కాంచనాంబర ! రత్న కాంచివిభూషిత !
సురవరార్చిత ! చంద్ర సూర్యనయన !
కమలనాభ ! ముకుంద ! గంగాధరస్తుత !
రాక్షసాంతక ! నాగ రాజశయన !

పతితపావన ! లక్షీశ ! బ్రహ్మజనక !
భక్తవత్సల ! సర్వేశ ! పరమపురుష !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


84
పలుమాఱు దశరూపములు ధరించితి వేల?
యేకరూపము బొందవేల నీవు?
నయమున క్షీరాబ్ధి నడుమ జేరితి వేల?
రత్నకాంచన మందిరములు లేవె?
పన్నగేంద్రునిమీద బవ్వళించితి వేల?
జలతారుపట్టెమంచములు లేవె?
ఱెక్కలు గలపక్షి నెక్కసాగితి వేల?
గజతురంగాందోళికములు లేవె?

వనజలోచన ! యిటువంటి వైభవములు
సొగసుగా నీకు దోచెనో సుందరాంగ?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


85
తిరుపతి స్థలమందు దిన్నగా నే నున్న
వేంకటేశుడు మేత వేయలేడొ?
పురుషోత్తమమున కే బోయనజాలు జ
గన్నాథు డన్నంబు గడపలేడొ?
శ్రీరంగమునకు నే జేర బోయిన జాలు
స్వామి గ్రాసము బెట్టి సాకలేడొ?
కాంచీపురములోన గదిసి నే గొలువున్న
గరివరదుడు పొట్ట గడపలేడొ?

యెందు బోవక నేను నీ మందిరమున
నిలిచితిని నీకు నామీద నెనరు లేదు.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


86
తార్క్ష్యవాహన ! నీవు దండిదాత వటంచు
గోరి వేడుక నిన్ను గొల్వవచ్చి
యర్థిమార్గమును నే ననుసరించితినయ్య
లావైన బదునాల్గు లక్ష లైన
వేషముల్ వేసి నా విద్యాప్రగల్భత
జూపసాగితి నీకు సుందరాంగ !
యానంద మైన నే నడుగ వచ్చిన దిచ్చి
వాంఛ దీర్పుము నీలవర్ణ ! వేగ

నీకు నావిద్య హర్షంబు గాక యున్న
తేపతేపకు వేషముల్ దేను సుమ్మి.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


87
అమరేంద్రవినుత ! నే నతిదురాత్ముడ నంచు
కలలోన నైనను గనుల బడవు
నీవు ప్రత్యక్షమై నులువకుండిన మానె
దొడ్డగా నొక యుక్తి దొరకెనయ్య !
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి
నీస్వరూపము చేసి నిలుపుకొంచు
ధూప దీపము లిచ్చి తులసితో బూజించి
నిత్యనైవేద్యముల్ నేమముగను

నడుపుచును నిన్ను గొలిచెద నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గలుగు నాకింతె చాలు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


88
భువనేశ ! గోవింద ! రవికోటిసంకాశ !
పక్షివాహన ! భక్త పారిజాత !
యంభోజభవ రుద్ర జంభారిసన్నుత !
సామగానవిలోల ! సారసాక్ష !
వనధిగంభీర ! శ్రీవత్స కౌస్తుభవక్ష !
శంఖచక్రగదా సిశార్ఙ్ఞహస్త !
దీనరక్షక ! వాసుదేవ ! దైత్యవినాశ !
నారదార్చిత ! దివ్య నాగశయన !

చారు నవరత్నకుండల శ్రవణయుగళ !
విబుధవందిత పాదబ్జ ! విశ్వరూప !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


89
నాగేంద్రశయన ! నీ నామమాధుర్యంబు
మూడుకన్నుల సాంబమూర్తి కెఱుక
పంకజాతాక్ష ! నీ బలపరాక్రమ మెల్ల
భారతీపతి యైన బ్రహ్మ కెఱుక
మధుకైటభారి ! నీ మాయాసమర్థత
వసుధలో బలిచక్రవర్తి కెఱుక
పరమాత్మ ! నీ దగు పక్షపాతిత్వంబు
దశశతాక్షుల పురంధరుని కెఱుక

వీరి కెఱుకగు నీకథల్ వింత లెల్ల
నరుల కెఱు కన్న నెవరైన నవ్విపోరె?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


90
అర్థులేమైన నిన్నడుగవచ్చెద రంచు
క్షీరసాగరమందు జేరినావు
నీచుట్టు సేవకుల్ నిలువకుండుటకునై
భయదసర్పముమీద బండినావు
భక్తబృందము వెంటబడి చరించెద రంచు
నెగసి పోయెడిపక్షి నెక్కినావు
దాసులు నీద్వార మాసింపకుంటకు
మంచి యోధుల కావలుంచినావు

లావు గలవాడ వైతి వేలాగు నేను
నిన్ను జూతును నాతండ్రి ! నీరజాక్ష !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !



No comments:

Post a Comment