కుమార శతకం 51 నుండి 60 వరకు శ్లోకాలు
సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలొ బొగడించునంచు దలపు కుమారా!
భావం
ఓ కుమారా! ’ధనం మూలమిధం జగత్ ’ అన్నారు పెద్దలు. మనిషికి ధనమే ముఖ్యమైనది. సంపదలు కలిగినపుడు బంధువులు తమంత తామే వచ్చి చేరుదురు. శుభములన్నియు సిరితో బాటే వచ్చును. స్నేహితులు మనదగ్గర డబ్బున్నంతవరకూ మనచుట్టూ తిరుగుతారు. ధనమువలన సుగుణములతోను, కీర్తి ప్రఖ్యాతులతోను చూడబడతాము. కావున ధనము సంపాదించుట నేర్చుకొనుము.
52 వ శ్లోకం
తనదు కులాంగన యాలో
చనమున మంత్రియును భుక్తి సమయంబున దా
జననియు రతిలో రంభా
వనజేక్షణ యయినఁ బుణ్యవశము కుమారా!
భావం
ఓ కుమారా! లోకమందు పురుషునకు అనుకూలవతియైన భార్య కావలయును. ఆలోచించు సమయమునందు మంత్రివలెను, భోజన సమయమునందు తల్లివలెను, రతి సమయమునందు రంభవలెను,సేవలు చేయు భార్య పొందుట మిక్కిలి అదృష్టమనబడును. అట్టి భార్య లభించడం పూర్వజన్మ ఫలము.
53 వ శ్లోకం
అల దేవగృహము కడప యి
రుల గోవాటముల యందు ద్రోవలలో ర
చ్చల కొట్టములను నొప్పదు
మల మూత్ర విసర్జనంబు మహిని కుమారా!
భావం
ఓ కుమారా! దేవాలయముల వద్దను, గడపముందటను, గోశాలయందును, రహదారులయందును, నలుగురు కూర్చుండు స్థలముల వద్దను, పశువులు కొట్టములందును, మలమూత్రములను విసర్జించుట ఈ భూమిపై తగదని తెలుసుకొమ్ము.
54 వ శ్లోకం
పాపపు బని మది దలపకు
చేపట్టిన వారి విడువ జేయకు కీడున్
లోపల దలపకు, క్రూరుల
ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!
భావం
ఓ కుమారా! మనస్సునందు పాపపు పనులను తలంపకు. భార్యపుత్రులను విడిచిపెట్టరాదు. కాపాడుదునన్న వారిని వదలివేయకుము. మనసునందెవ్వరికి కీడు తలంపవద్దు. దుర్మార్గులను మనస్సునందెక్కువగా నమ్మవలదు. ఈ పద్ధతులను తెలుసుకొని మెలగుము.
55 వ శ్లోకం
జగడంబులాడు చోటను
మగువలు వసియించుచోట మదగజము దరిన్
బగతుండు తిరుగుచోటన్
మగుడి చనగవలయుఁ జలము మాని కుమారా!
భావం
ఓ కుమారా! పొట్లాటలు జరుగు ప్రదేశమందును, స్త్రీలు నివసించు ప్రదేశములందును, మదించిన ఏనుగులున్న స్థానమందును, శత్రువు దిరుగు ప్రదేశములందునూ, నిలువరాదు. అటువంటి ప్రదేశములలో నివసించరాదు. శీఘ్రమే వదలిపోవలెను.
56 వ శ్లోకం
తిరుగకు దుర్మార్గులతో
నరుగకు గహనాంతర స్థలాదుల కొంటన్
జరుగకు శత్రుల మోల
న్మరువకు మేల్ హితులయెడల మదిని కుమారా!
భావం
ఓ కుమారా! దుర్మార్గులతో కలసి తిరుగకు. ఒంటరిగా కీకారణ్య ప్రాంతములకు పోరాదు. ఎప్పుడూ శత్రువుల పక్షము వహింపకు. నీ మంచిని కోరువారినెపుడూ మరువకు. వారికి మంచిని కలుగజేయుము.
57 వ శ్లోకం
తరలాక్షుల యెడనెన్నడు
బర్హాసాలాపములను పచరింపకుమీ
బరికించి నిరీక్షించిన
నురు దోషంబనుచు దలపుచుండు కుమారా!
భావం
ఓ కుమారా! స్త్రీల పట్ల పరిహాసములెన్నడునూ చేయకు. వారిని పరిశీలనగా చూచుట, వారికొరకు నిరీక్షించుటా మిక్కిలి దోషములని ఎరుంగుము.
58 వ శ్లోకం
కాయమున నాటు శరములు
పాయంబున దీయవచ్చు బహునిష్ఠురతన్గూ
య మదినాటు మాటలు
పాయవుగా యెపుడు నెగడు పరచు కుమారా!
భావం
ఓ కుమారా! శరీరమునకు నాటిన బాణమును ఉపాయముతో తీయవచ్చు. కాని మనసున నాటిన మాటలు మానసిక వ్యధను కలుగజేయును. అటువంటి కఠిన మాటలను వెనక్కు తీసుకొనుట కష్టం. అవి మనస్సును బాధించును.
59 వ శ్లోకం
పెనుకోపము గర్వము ను
బ్బును జపలము దురభిమానము నిర్వ్యాపారం
బునుఁ జొరవు నునికియును న
ల్పుని గుణము లటంచు దెలివిబొందు కుమారా!
భావం
ఓ కుమారా! మిక్కిలి కోపము, గర్వము, మానసిక చాంచల్యము, పొంగిపోవుట, గర్వపడుట, పనిలేకుండుట, చురుకుదనములేకుండుట, మొదలగునవి అల్పుని గుణములని తెలుసుకొనుము. ఈ గుణములను నీ దరి జేరనీయకుము.
60 వ శ్లోకం
విత్తము గూర్చిన మనుజుం
డుత్తమ దానంబు భోగమొందని యెడ భూ
భృత్త స్కర శిఖి గతము వి
వృత్తికంబగును నట్టి పదవి కుమారా!
భావం
ఓ కుమారా! మనిషి ధనమును ఎక్కువగా కూడ బెట్టవలెను. అట్లు ఐశ్వర్యవంతుడైనవాడు దానము జేయుచు, భోగములను అనుభవింపవలెను. తాను దినక , తనవారికి పెట్టక కూడబెట్టిన ధనము చివరకు రాజులపాలో, దొంగలపాలో, అగ్నిపాలో కాక తప్పదు. అటువంటి స్థితిని బొందకుము.
No comments:
Post a Comment