నారసింహ శతకం 51 నుండి 60 వరకు
పలురోగములకు నీ పాదతీర్థమె కాని
వలపు మందులు నాకు వలదు వలదు
చెలిమి సేయుచు నీకు సేవ జేసెద గాన
నీ దాసకోటిలో నిలుపవయ్య
గ్రహభయంబునకు జక్రము దలచెదగాని
ఘోరరక్షలు గట్ట గోరనయ్య
పాముకాటుకు నిన్నుభజన జేసెదగాని
దాని మంత్రము నేను తలపనయ్య
దొరికితివి నాకు దండి వైద్యుడవు నీవు
వేయికష్టాలు వచ్చినన్ వెఱవనయ్య
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

52
కూటికోసరము నే గొఱగాని జనులచే
బలుగద్దరింపులు పడగవలసె?
దార సుత భ్రమ దగిలియుండగగదా
దేశదేశములెల్ల దిరుగవలసె?
బెను దరిద్రత పైని బెనగియుండగగదా
చేరి నీచులసేవ చేయవలసె?
నభిమానములు మది నంటియుండగగదా
పరుల జూచిన భీతి పడగవలసె?
నిటుల సంసారవారిధి నీదలేక
వేయివిధముల నిన్ను నే వేడుకొంటి.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

53
సాధు సజ్జనులతో జగడమాడిన గీడు
కవులతో వైరంబు గాంచ గీడు
పరమ దీనుల జిక్కబట్టి కొట్టిన గీడు
భిక్షగాండ్రను దుఃఖ పెట్ట గీడు
నిరుపేదలను జూచి నిందజేసిన గీడు
పుణ్యవంతుల దిట్ట బొసగు గీడు
సద్భక్తులను దిరస్కారమాడిన గీడు
గురుని ద్రవ్యము దోచు కొనిన గీడు
దుష్టకార్యము లొనరించు దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

54
పరులద్రవ్యముమీద భ్రాంతి నొందినవాడు
పరకాంతల నపేక్ష పడెడువాడు
అర్థుల విత్తంబులపహరించెడు వాడు
దానమియ్యంగ వద్దనెడివాడు
సభలలోపల నిల్చి చాడిచెప్పెడివాడు
పక్షపు సాక్ష్యంబు పలుకువాడు
విష్ణుదాసుల జూచి వెక్కిరించెడివాడు
ధర్మసాధుల దిట్ట దలచువాడు
ప్రజల జంతుల హింసించు పాతకుండు
కాలకింకర గదలచే గష్టమొందు.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

55
నరసింహ ! నా తండ్రి నన్నేలు నన్నేలు
కామితార్థము లిచ్చి కావు కావు
దైత్యసంహార ! చాల దయయుంచు దయయుంచు
దీనపోషక ! నీవె దిక్కు దిక్కు
రత్నభూషితవక్ష ! రక్షించు రక్షించు
భువనరక్షక ! నన్ను బ్రోవు బ్రోవు
మారకోటిసురూప ! మన్నించు మన్నించు
పద్మలోచన ! చేయి పట్టు పట్టు
సురవినుత ! నేను నీచాటు జొచ్చినాను
నా మొఱాలించి కడతేర్చు నాగశయన !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

నీ భక్తులను గనుల్ నిండ జూచియు రెండు
చేతుల జోహారు సేయువాడు
నేర్పుతో నెవరైన నీ కథల్ చెప్పంగ
వినయమందుచు జాల వినెడువాడు
తన గృహంబునకు నీ దాసులు రా జూచి
పీటపై గూర్చుండ బెట్టువాడు
నీసేవకుల జాతి నీతు లెన్నక చాల
దాసోహ మని చేర దలచువాడు
పరమభక్తుండు ధన్యుండు భానుతేజ !
వాని గనుగొన్న బుణ్యంబు వసుధలోన
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

57
పక్షివాహన ! నేను బ్రతికినన్నిదినాలు
కొండెగాండ్రను గూడి కుమతినైతి
నన్నవస్త్రము లిచ్చి యాదరింపుము నన్ను
గన్నతండ్రివి నీవె కమలనాభ !
మరణ మయ్యెడినాడు మమతతో నీయొద్ది
బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక !
ఇనజభటావళి యీడిచికొనిపోక
కరుణతో నాయొద్ద గావ లుంచు
కొసకు నీ సన్నిధికి బిల్చు కొనియు నీకు
సేవకుని జేసికొనవయ్య శేషశయన !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

58
నిగమాదిశాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన
యఙ్ఞకర్తగు సోమ యాజియైన
ధరణిలోపల బ్రభాత స్నానపరుడైన
నిత్యసత్కర్మాది నిరతుడైన
నుపవాస నియమంబు లొందు సజ్జనుడైన
గావివస్త్రముగట్టు ఘనుడునైన
దండిషోడశమహా దానపరుండైన
సకల యాత్రలు సల్పు సరసుడైన
గర్వమున గష్టపడి నిన్ను గానకున్న
మోక్షసామ్రాజ్య మొందడు మోహనాంగ |
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

59
పంజరంబున గాకి బట్టి యుంచిన లెస్స
పలుకునే వింతైన చిలుకవలెను?
గార్దభంబును దెచ్చి కళ్లెమింపుగవేయ
దిరుగునే గుఱ్ఱంబు తీరుగాను?
ఎనుపపోతును మావటీడు శిక్షించిన
నడచునే మదవారణంబువలెను?
పెద్దపిట్టను మేత బెట్టి పెంచిన గ్రొవ్వి
సాగునే వేటాడు డేగవలెను?
కుజనులను దెచ్చి నీ సేవ కొఱకు బెట్ట
వాంఛతో జేతురే భక్త వరులవలెను?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

60
నీకు దాసుడ నంటి నిన్ను నమ్ముకయుంటి
గాన నాపై నేడు కరుణజూడు
దోసిలొగ్గితి నీకు ద్రోహ మెన్నగబోకు
పద్మలోచన ! నేను పరుడగాను
భక్తి నీపై నుంచి భజన జేసెద గాని
పరుల వేడను జుమ్మి వరము లిమ్ము
దండిదాతవు నీవు తడవుసేయక కావు
ఘోరపాతకరాశి గొట్టివైచి
శీఘ్రముగ గోర్కు లీడేర్చు చింత దీర్చు
నిరతముగ నన్ను బోషించు నెనరు నుంచు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

No comments:
Post a Comment